Sunil Chhetri: ఛెత్రి ఇక చాలని..

ఈ తరానికి భారత ఫుట్‌బాల్‌ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్‌ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్‌స్టార్‌ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది.

Published : 17 May 2024 04:04 IST

రిటైర్మెంట్‌ ప్రకటించిన ఫుట్‌బాల్‌ స్టార్‌
జూన్‌ 6న ఆఖరి మ్యాచ్‌
దిల్లీ

ఈ తరానికి భారత ఫుట్‌బాల్‌ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్‌ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్‌స్టార్‌ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. ఆటతో, నాయకత్వంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు వెన్నెముకలా నిలిచి.. అభిమానులను అలరించి మురిపించిన ఈ మేటి ఫుట్‌బాలర్‌ ఇంకొన్ని రోజుల్లో రిటైర్‌కానున్నట్లు ప్రకటించాడు. జూన్‌ 6న అతడు చివరిసారి దేశం తరఫున బరిలోకి దిగుతాడు.

ఫుట్‌బాల్‌లో ఓ గొప్ప అంకం ముగియనుంది. భారత ఫుట్‌బాల్‌ మేటి, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి తన ఇన్నింగ్స్‌ను ముగిస్తున్నాడు. జూన్‌ 6న కువైట్‌తో జరిగే ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌ అనంతరం రిటైర్‌కానున్నట్లు ప్రకటించాడు. బుధవారం తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఛెత్రి తన నిర్ణయాన్ని తెలిపాడు. ‘‘కువైట్‌తో మ్యాచే కెరీర్‌లో నాకు చివరిది. దేశం తరఫున ఆడాలన్నది ప్రతి ఒక్కరి కల. అది నాకు సాధ్యమైంది. దేశం తరఫున ఆడటానికి మరేదీ సాటిరాదు’’ అని ఓ వీడియో ద్వారా ఛెత్రి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్‌ స్ట్రైకర్‌ ఇప్పటివరకు 94 గోల్స్‌ కొట్టాడు. దేశం తరఫున అత్యధిక గోల్స్‌ కొట్టిన, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కెరీర్‌ను ముగించనున్నాడు. మార్చిలో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడిన అతడు.. తాజా వీడియోలో పాకిస్థాన్‌పై తన అరంగేట్ర మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. దేశం తరఫున నా తొలి మ్యాచ్‌ను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. అది నమ్మశక్యం కానిది. అంతకన్నా ముందు రోజు ఉదయం సుఖి సర్‌ (అప్పటి జట్టు కోచ్‌ సుఖ్విందర్‌ సింగ్‌) నా దగ్గరకు వచ్చి ‘నువ్వు ఆడబోతున్నావు’ అని చెప్పినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను’’ అని ఛెత్రి అన్నాడు. ఛెత్రి ఆఖరి మ్యాచ్‌ కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియంలో జరుగుతుంది. తన కెరీర్‌లో ఎక్కువ ఫుట్‌బాల్‌ ఆడిన చోటే అతడు రిటైరవుతున్నాడు.

ప్రస్థానమిలా...

ఛెత్రి లేని భారత ఫుట్‌బాల్‌ను ఊహించడం కష్టమే. అతడు లేని లోటు భర్తీ చేయడం కూడా. 19 ఏళ్లుగా  జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు మరి. ఈ 39 ఏళ్ల స్టార్‌ స్ట్రైకర్‌.. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆడుతున్న వారిలో, అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో, మెస్సి తర్వాతి స్థానంలో మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌ మూడు సార్లు (2007, 2009, 2012) నెహ్రూ కప్‌, మూడు సార్లు (2011, 2015, 2021) సౌత్‌ ఏషియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (శాఫ్‌) ఛాంపియన్‌షిప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించడం ఛెత్రి కెరీర్‌లో హైలైట్స్‌. 2008 ఏఎఫ్‌సీ ఛాలెంజ్‌ కప్‌ గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. ఆ విజయంతో భారత్‌ 27 ఏళ్లలో తొలిసారి ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ (2011)కు అర్హత సాధించింది. సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రి 2002లో మోహన్‌ బగాన్‌ తరఫున క్లబ్‌ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. 2010లో యుఎస్‌ఏ మేజర్‌ లీగ్‌ సాకర్‌ జట్టు కన్సాస్‌ సిటీ విజార్డ్స్‌ తరఫున కూడా ఆడాడు. ఏడుసార్లు ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్న ఛెత్రి.. ఇతర పెద్ద భారత క్లబ్‌లు ఈస్ట్‌ బెంగాల్‌ (2008-2009), డెంపో (2009-2010)లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో ముంబయి సిటీ, బెంగళూరు ఎఫ్‌సీల తరఫున ఆడాడు. క్లబ్‌ ఫుట్‌బాల్‌లో ఛెత్రి మొత్తం 252 గోల్స్‌ కొట్టాడు.


ఛెత్రి

అరంగేట్రం: 2005లో
మ్యాచ్‌లు : 150
గోల్స్‌     : 94
ఆఖరి మ్యాచ్‌: జూన్‌ 6న కువైట్‌తో


3

ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఆటగాళ్లలో టాప్‌ స్కోరర్ల జాబితాలో ఛెత్రి స్థానం. 150 మ్యాచ్‌ల్లో 94 గోల్స్‌ కొట్టాడు. రొనాల్డో (205 మ్యాచ్‌ల్లో 128), మెస్సి (180 మ్యాచ్‌ల్లో 106) అతడి కన్నా ముందున్నారు.


‘‘సునీల్‌ నిస్సందేహంగా భారత మేటి ఫుట్‌బాలర్లలో ఒకడు. భారత ఫుట్‌బాల్‌కు అతడి  సేవ వెలకట్టలేనిది. అతడి రిటైర్మెంట్‌ భారత ఫుట్‌బాల్‌కు పెద్ద లోటు. ఒక సీనియర్‌గా అతడితో కలిసి ఆడడం నా అదృష్టం’’

భుటియా


‘‘నీ కెరీర్‌ అసాధారణం. భారత ఫుట్‌బాల్‌, భారత క్రీడల్లో నువ్వో దిగ్గజానివి’’

బీసీసీఐ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని