ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్

Published : 28 Nov 2023 14:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024).. ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ లీగ్. 2008లో ఆరంభ సీజన్‌తోనే ప్రకంపనలు రేపిన ఈ లీగ్.. గత 17 ఏళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎలా ఎదిగిపోయిందో తెలిసిందే. ఫుట్‌బాల్ లీగ్స్‌కు దీటుగా చాలా పెద్ద స్థాయికి ఎదిగింది. బిగ్ బాష్ సహా ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్స్ ఉన్నప్పటికీ.. ఐపీఎల్ ప్రత్యేకత, దాని స్థాయి వేరు. పాకిస్థాన్ క్రికెటర్లు మినహా అన్ని దేశాల ఆటగాళ్లకూ ఇందులో ప్రవేశం ఉంది. ఈ లీగ్ ద్వారా పేరుతో పాటు భారీగా డబ్బూ సంపాదిస్తుంటారు విదేశీ క్రికెటర్లు. ఐతే ఎందుకోగానీ మొదట్నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్లకు మాత్రం ‘IPL’ అస్సలు అచ్చిరావడం లేదు. ఈ లీగ్ మీద తమ ముద్ర వేసిన ఇంగ్లిష్ ఆటగాళ్లు చాలా తక్కువమందే కనిపిస్తారు.

బెన్ స్టోక్స్.. ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో ఒకడు. ఇంగ్లాండ్ తరఫున అతను ఎన్నో ఘనతలు సాధించాడు. 2019 ప్రపంచకప్ విజయంలోనూ అతడిది ముఖ్య పాత్ర. కానీ, ఐపీఎల్‌లో అతను ఎప్పుడూ నిలకడగా ఆడింది లేదు. పుణె సూపర్‌ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఇలా జట్లు మారుతూ వచ్చాడు. కానీ.. ఎక్కడా నిలకడగా ఆడలేదు. వేలంలో రికార్డు ధరలు పలకడమే తప్ప.. ఆ స్థాయికి తగ్గ ఆటతీరును ఎప్పుడూ ప్రదర్శించలేకపోయాడు. రాజస్థాన్ తరఫున విఫలమయ్యాక చెన్నైకి మారిన అతడు.. అక్కడా నిలకడ చూపించలేకపోయాడు. గాయాలు కూడా అతణ్ని వెంటాడాయి. గత సీజన్లో అతను మైదానంలో దిగిన మ్యాచ్‌ల కంటే డగౌట్‌కు పరిమితమైన మ్యాచ్‌లే ఎక్కువ. ఈ సీజన్‌కు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాడు. చెన్నై అతణ్ని విడిచిపెట్టేసింది. ఇక నిరుడు సన్‌రైజర్స్ రూ.13.5 కోట్లకు కొన్న హ్యారీ బ్రూక్‌ను ఈ సీజన్‌కు వదులుకుంది. అలాగే ముంబయి ఇండియన్స్ రూ.8 కోట్లకు కొన్న జోఫ్రా ఆర్చర్ గత సీజన్లో తేలిపోయాడు. దీంతో అతణ్ని ఆ జట్టు వద్దనుకుంది. ఇంకా ఫిల్ సాల్ట్ (దిల్లీ క్యాపిటల్స్), డేవిడ్ విల్లీ (బెంగళూరు), జో రూట్ (రాజస్థాన్), ఫిల్ సాల్ట్ (దిల్లీ), ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్)... ఇలా చాలామంది ఇంగ్లిష్ ఆటగాళ్లకు ఆయా ఫ్రాంఛైజీలు సెలవు చీటీలు ఇచ్చేశాయి. ఒక్క జోస్ బట్లర్ (రాజస్థాన్) మాత్రమే చాలా సీజన్ల నుంచి ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. లివింగ్‌స్టన్ (పంజాబ్) పర్వాలేదు.

ఏంటి సమస్య?

ఇంగ్లాండ్ ప్రస్తుతం ప్రపంచ మేటి క్రికెట్ జట్లలో ఒకటి. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసి ఉండొచ్చు. కానీ, ఆ జట్టు నాణ్యతను తక్కువ చేయలేం. పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా బలమైన ఆటగాళ్లున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచింది ఆ జట్టే. అంతకుముందు 2019లో వన్డే ప్రపంచకప్ కూడా సాధించారు. ఆ జట్టు టీ20 స్పెషలిస్టులతో కిక్కిరిసి పోయింది. ఇంగ్లాండ్‌లో దేశవాళీ క్రికెట్ చాలా బలంగా ఉంది. అక్కడ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు బోలెడంతమంది తయారవుతుంటారు. వారిలో చాలామంది తమ దేశంలో జరిగే ‘హండ్రెడ్’తో పాటు టీ20 బ్లాస్ట్ టోర్నీల్లో అదరగొడుతుంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాష్ సహా అనే టీ20 లీగ్స్‌లో ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆధిపత్యం చలాయిస్తుంటారు. ఐపీఎల్‌లో మాత్రం ఎప్పుడూ ఇంగ్లిష్ ఆటగాళ్ల ఆధిపత్యం సాగలేదు. ఇంగ్లాండ్ జట్టులో, వేరే క్రికెట్ లీగ్స్ అదరగొట్టినోళ్లు ఐపీఎల్‌లో విఫలమవుతుంటారు.

ఈ లీగ్ మీద వాళ్లతో పాటు ఇంగ్లాండ్ బోర్డుకు అంత ఆసక్తి ఉండదనే చర్చ జరుగుతుంటుంది. ఐపీఎల్‌ను చూసి ఇంగ్లిష్ బోర్డు అసూయ చెందుతుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. అందుకే ఐపీఎల్‌కు పోటీగా ఏదో ఒక సిరీస్ పెడుతుంది. దీంతో ఆటగాళ్లను పూర్తి స్థాయిలో ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనివ్వకుండా ఇబ్బంది పెడుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు లీగ్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరనే అభిప్రాయంతోనే వారిని ఫ్రాంఛైజీలు కూడా విశ్వసించలేని పరిస్థితి ఉంది. టోర్నీకి ఆలస్యంగా రావడం, మధ్యలో వెళ్లిపోవడం లాంటి వ్యవహారాలు కూడా ఇంగ్లిష్ క్రికెటర్ల మీద ఐపీఎల్ ఫ్రాంఛైజీలు నమ్మకం పెట్టకపోవడానికి ప్రధాన కారణాలు. ప్రదర్శన కూడా అంతంతమాత్రమే కావడంతో ఈ సీజన్‌కు చాలామంది ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు పక్కన పెట్టేశాయి.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు