Team India: టీమ్‌ఇండియా టీ20 ‘100’ మార్క్ వీరులు
వన్డేలు, టెస్టుల్లో సెంచరీలు కొట్టడం బ్యాట్స్‌మెన్‌కు సాధారణ విషయమే. అదే టీ20ల్లో కొట్టాలంటే అంత తేలికకాదు. ఇన్నింగ్స్ మొత్తంలోనే 120 బంతులు వేస్తే...
వన్డేలు, టెస్టుల్లో సెంచరీలు కొట్టడం బ్యాట్స్‌మెన్‌కు సాధారణ విషయమే. అదే టీ20ల్లో కొట్టాలంటే అంత తేలికకాదు. ఇన్నింగ్స్ మొత్తంలోనే 120 బంతులు వేస్తే.. ఒక ఆటగాడు సెంచరీ చేయాలంటే ఎలా ఆడాలి? బౌలర్ ఎవరని చూడకుండా దొరికిన బంతిని దొరికినట్లు ఉతికారేయాలి. అలా ఆడితేనే టీ20ల్లో ‘100’ మార్క్ సాధ్యమవుతుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా తరఫున ఇంతకుముందు ఎవరెన్ని శతకాలు బాదారో తెలుసుకుందాం..
సురేశ్ రైనా ది ఫస్ట్..
టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో తొలి శతకం బాదింది మాజీ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా. 2010 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-సీ విభాగంలో సెంట్ లూసియా వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో రైనా (101; 60 బంతుల్లో 9x4, 5x6) శతకం బాది విరోచిత బ్యాటింగ్ చేశాడు. 168.33 స్ట్రైక్‌రేట్‌తో దక్షిణాఫ్రికా బౌలర్లు రోరీ క్లీన్‌వెల్ట్, ఆల్బీ మోర్కెల్, రోలోఫ్ వాండర్ మెర్వ్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. 31 పరుగులకే మురళీ విజయ్(0), దినేశ్ కార్తీక్ (16)లను ఔట్ చేసి గట్టి దెబ్బ తీశారు. ఈక్రమంలోనే యువరాజ్(37; 30 బంతుల్లో 3x4, 2x6)తో కలిసి రైనా దుమ్మురేపాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. అయితే, కీలక సమయంలో యువీ ఔటవ్వగా యూసుఫ్ పఠాన్ (11), ధోనీ (16)తో కలిసి రైనా మరింత ధాటిగా ఆడాడు. 19 ఓవర్లు పూర్తయ్యేసరికి 95 పరుగులతో ఉన్న అతడు మూడో బంతిని సిక్సర్‌గా కొట్టి టీ20ల్లో మూడో బ్యాట్స్‌మన్‌గా, టీమ్‌ఇండియా తరఫున తొలి ఆటగాడిగా సెంచరీ కొట్టాడు. కానీ, మరుసటి బంతికే ఇంకో షాట్ ఆడబోయి ఔటయ్యాడు. చివరికి టీమ్‌ఇండియా 186/5 స్కోర్ చేయగా దక్షిణాఫ్రికా ఛేదనలో 172/5 స్కోర్‌కు పరిమితమైంది.
రోహిత్ ది సెకండ్..
రైనా తర్వాత టీమ్‌ఇండియా తరఫున పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ కొట్టిన హీరో రోహిత్ శర్మ. 2015లో దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (3) ఆదిలోనే ఔటైనా.. హిట్‌మ్యాన్ (106; 66 బంతుల్లో 12x4, 5x6) శతకంతో చెలరేగాడు. అతడి స్ట్రైక్‌రేట్ 160.60గా నమోదైంది. విరాట్ కోహ్లీ (43; 27 బంతుల్లో 1x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించాడు. అయితే, రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాక ఇద్దరూ అబాట్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఔటయ్యారు. తర్వాత భారత్ 200 లక్ష్యం నిర్దేశించినా దక్షిణాఫ్రికా ఛేదించింది. ఇక 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ (118; 43 బంతుల్లో 12x4, 10x6) మరో సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడి స్ట్రైక్‌రేట్ 274.41గా నమోదైంది. దీన్ని బట్టి లంక బౌలర్లను ఎలా ఆడుకున్నాడో ఊహించుకోవచ్చు. ఆపై 2018లో బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ (100 నాటౌట్; 56 బంతుల్లో 11x4, 5x6) మూడో శతకం బాదాడు. ఇందులో అతడి స్ట్రైక్‌రేట్ 175.57గా నమోదైంది. అదే ఏడాది లఖ్‌నవూ వేదికగా వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో (111 నాటౌట్; 61 బంతుల్లో 8x4, 7x6) నాలుగో శతకం బాదాడు. ఇందులో అతడి స్ట్రైక్‌రేట్ (181.96)గా నమోదైంది. కాగా, ఈ మూడు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా గెలవడం విశేషం.
కేఎల్ రాహుల్ ది థర్డ్..
టీమ్‌ఇండియా తరఫున పొట్టి క్రికెట్‌లో శతకం బాదిన మూడో బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. 2016లో అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ (110 నాటౌట్; 51 బంతుల్లో 12x4, 5x6) తొలిసారి టీ20ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడి స్ట్రైక్‌రేట్ 215.68గా నమోదైంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 245/6 పరుగుల భారీ స్కోర్ చేయగా ఛేదనలో భారత్ అంతే దీటుగా బదులిచ్చింది. అజింక్య రహానె (7), విరాట్ కోహ్లీ (16) విఫలమైనా రోహిత్ (62; 28 బంతుల్లో 4x4, 4x6), రాహుల్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అయితే, రోహిత్ కీలక సమయంలో ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన ధోనీ (43; 25 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్‌తో కలిసి మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు. కానీ చివరి బంతికి అతడు ఔటవ్వడంతో టీమ్‌ఇండియా 244/4తో నిలిచింది. అలా ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇక 2018లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో రాహుల్ (101 నాటౌట్; 54 బంతుల్లో 10x4, 5x6) రెండోసారి పొట్టి క్రికెట్‌లో శతకం బాదాడు. ఇందులో అతడి స్ట్రైక్‌రేట్ 187.03గా నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 159/8 స్కోర్ చేయగా ఛేదనలో టీమ్ఇండియా 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
దీపక్ హుడా ది ఫోర్త్..
యువ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా (104; 57 బంతుల్లో 9x4, 6x6) ఇటీవల ఐర్లాండ్‌తో ఆడిన రెండో టీ20లో శతకం బాదాడు. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు 182.46 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగాడు. దీన్నిబట్టి ఐర్లాండ్ బౌలర్లను ఏ విధంగా చితక్కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతడికి సంజూ శాంసన్ (77; 42 బంతుల్లో 9x4, 4x6)కూడా తోడవ్వడంతో భారత్ 225/7 భారీ స్కోర్ సాధించింది. తర్వాత ఐర్లాండ్ కూడా గొప్పగా పోరాడింది. ఆ జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడంతో చివరికి 221/5తో నిలిచింది. ఆఖరి ఓవర్‌లో భారత్ గొప్పగా పుంజుకోవడంతో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది.
సూర్యకుమార్ ది నంబర్ 5..
ఆదివారం ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ (117; 55 బంతుల్లో 14x4, 6x6) అతి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 212.73 స్ట్రైక్‌రేట్‌తో ఎవరూ ఊహించని బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో శతకం బాదిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తొలుత ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 215/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమ్‌ఇండియా ఛేదనలో తడబడింది. ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ (28; 23 బంతుల్లో 2x6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. శ్రేయస్ స్ట్రైక్‌రొటేట్ చేస్తూ సహకరించగా సూర్య ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ, శ్రేయస్ ఔటయ్యాక టీమ్‌ఇండియా టపాటపా వికెట్లు కోల్పోయింది. చివరికి సూర్య కూడా ఔటవ్వడంతో భారత్ ఓటమిపాలైంది.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!