IPL 2023: మళ్లీ టీమ్‌లకు గాయాల బెడద.. కీలక సమయంలో తప్పని కష్టాలు!

ఐపీఎల్ 2023వ సీజన్‌లో (IPL 2023) ప్లేఆఫ్స్‌ రేసు ఊపందుకుంటోంది. కానీ, కీలక ఆటగాళ్లు గాయపడటంతో కొన్ని మ్యాచ్‌లతోపాటు టోర్నీ మొత్తానికి దూరమైన పరిస్థితి నెలకొంది.

Updated : 28 Apr 2023 19:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో సగం మ్యాచ్‌లు ముగిశాయి. ప్లేఆఫ్స్‌ కోసం ఇప్పుడే అసలైన సమరం మొదులకానుంది. ఈ క్రమంలో రూ.కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు కీలక మ్యాచ్‌లకు దూరమైతే ఆయా ఫ్రాంచైజీలకు తీవ్ర నష్టం. లీగ్‌ ప్రారంభానికి ముందే వైదొలిగితే.. అతడి స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చి మ్యాచ్‌లకు సన్నద్ధం చేసేవారు. తీరా మెగా టోర్నీ ప్రారంభమైన తర్వాత గాయాల కారణంగా బయటకెళ్లిపోతే.. కొత్తగా చేరే ప్లేయర్‌తో మ్యాచ్‌లను ఆడించడం కత్తిమీద సవాలే.  ఇలాంటి పరిస్థితి ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆయా ఫ్రాంచైజీలకు ఎదురైంది. ఇలా కొన్ని మ్యాచ్‌లకు, టోర్నీకి దూరమైన టాప్‌ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.. 

సుందర్‌ ఔట్ (Sunder)

తాజాగా ఏడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమయ్యాడు. తొడకండరాల గాయం వల్ల మిగతా మ్యాచ్‌ల నుంచి వైదొలిగినట్లు ఇప్పటికే సన్‌రైజర్స్ ప్రకటించింది. దిల్లీ మీద మినహా.. మిగతా జట్లతో జరిగిన మ్యాచుల్లో గొప్పగా ఏమీ రాణించలేదు.

కేన్‌కు తీవ్ర గాయం

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్ ఫీల్డింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడతాడో లేదోననేది కూడా అనుమానంగానే ఉంది. ఒక్క మ్యాచ్‌ కూడా పూర్తిగా ఆడకుండానే ఐపీఎల్‌ సీజన్‌ను మిస్‌ కావడం గమనార్హం. 

ఆర్‌సీబీకి టోప్లే దూరం

ఇంగ్లాండ్‌ పేసర్ రీస్‌ టోప్లే కూడా ఈ సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో భుజానికి గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమైపోయాడు. ఇప్పటికే ఆ జట్టుకు రజత్‌ పటీదార్, విల్ జాక్స్‌ ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా వైదొలిగారు. రెగ్యులర్‌ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ నడుముకు గాయం కావడంతో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే వస్తున్నాడు. అతడి స్థానంలో జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. 

వారిద్దరు కొన్ని మ్యాచ్‌లకు.. 

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, దీపక్ చాహర్‌ గాయాల కారణంగా కొన్ని మ్యాచ్‌ల్లో ఆడలేకపోయారు. గొప్పగా ప్రదర్శన కూడా లేకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్ వారిపై ఒత్తిడి తీసుకురావడం లేదు. అయినా సీఎస్‌కే ప్లేఆఫ్స్‌ రేసులోనే ఉంది.  కెప్టెన్ ధోనీ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నా సరే ఇప్పటి వరకు అన్ని మ్యాచుల్లోనూ ఆడాడు. పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ కూడా మూడు మ్యాచుల్లో గాయం కారణంగా దూరమయ్యాడు. అయినా సరే రెండింట్లో విజయం సాధించడం విశేషం.

వ్యక్తిగత కారణాలతో లిటన్.. గాయంతోనే అయ్యర్

కోల్‌కతా ఆటగాడు లిటన్ దాస్‌ వ్యక్తిగత కారణాలతో టోర్నీలోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. కోల్‌కతా ఆడిన 8 మ్యాచుల్లో లిటన్ ఒక్కసారి మాత్రమే ఆడాడు. దిల్లీతో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన లిటన్ కేవలం నాలుగు పరుగులే చేశాడు. అయితే, కుటుంబ సభ్యులకు మెడికల్‌ ఎమర్జెన్సీ ఉండటంతో బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. ఇప్పటికే షకిబ్ దూరం కావడంతో అతడి స్థానంలో జేసన్ రాయ్‌తో కేకేఆర్‌ ఒప్పందం చేసుకుంది. కేకేఆర్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్ కూడా గాయంతోనే మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్నాడు.

ట్రెంట్‌ బౌల్ట్‌ కూడా..

జయపుర వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్‌ ఆడలేదు. గాయం కారణంగానే మ్యాచ్‌కు దూరమైనట్లు రాజస్థాన్‌ ఫ్రాంచైజీ పేర్కొంది. సీఎస్‌కేపై ఆర్‌ఆర్‌ విజయం సాధించింది. అయితే, తదుపరి మ్యాచుల్లోనూ బౌల్ట్‌ ఆడతాడా..? లేడా..? అనేది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు