Harsha Bhogle: 40 ఏళ్ల క్రికెట్‌ మాటల ప్రవాహం... హర్ష భోగ్లే గురించి ఈ విషయాలు తెలుసా?

హర్ష భోగ్లే.. ఒక స్టార్‌ కామెంటేటర్‌గా మనకు తెలుసు. ఇటీవల 40 ఏళ్ల కామెంటరీ ప్రయాణం పూర్తి చేసుకున్న హర్ష (Harsha Bhogle) గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..

Updated : 27 Oct 2023 16:09 IST

అంతర్జాతీయ స్థాయిలో లేదా దేశవాళీ క్రికెట్‌ ఆడిన క్రికెటర్లలో చాలా మంది.. ఆటకు వీడ్కోలు పలికాక వ్యాఖ్యాతలుగా మారడం సహజమే. కానీ కేవలం విశ్వవిద్యాలయ స్థాయి వరకే క్రికెట్‌ ఆడిన ఓ వ్యక్తి.. ప్రపంచం మెచ్చే వ్యాఖ్యాతగా ఎదగడం అరుదు. కానీ క్రికెట్‌పై ప్రేమతో.. అద్భుతమైన వాక్‌చాతుర్యంతో క్రికెట్‌ వ్యాఖ్యానంపై అతను తనదైన ముద్ర వేశాడు. మైదానంలో స్వయంగా క్రికెట్‌ ఆడి, ఆటపై పరిజ్ఞానం ఉన్న మాజీ క్రికెటర్లతో వ్యాఖ్యానంలో పోటీ పడటమే కాదు.. వాళ్ల కంటే మెరుగ్గా కూడా మాట్లాడగలడనే పేరు తెచ్చుకున్నాడు. 19 ఏళ్ల వయసులో మొదలైన అతని మాటల ప్రవాహం.. 40 ఏళ్లుగా నిరాటంకంగా.. నిరంతరాయంగా.. మనోరంజకంగా సాగుతోంది. అతనే.. హర్ష భోగ్లే (Harsha Bhogle). ఈ పేరు వినని క్రికెట్‌ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా.. ఆటగాళ్లు మారినా.. 62 ఏళ్ల వయసులోనూ తన వ్యాఖ్యానంతో ఉర్రూతలూగిస్తున్నాడీ దిగ్గజ కామెంటేటర్‌. 

మన హైదరాబాదే.. 

హర్ష భోగ్లే పేరు చూసి.. ప్రస్తుతం అతను ఉంటున్న ఊరు చూసి మనవాడు కాదనుకుంటే పొరపడ్డట్టే! హర్ష హైదరాబాద్‌లోనే పుట్టాడు. ఇక్కడ ఇంజినీరింగ్‌ వరకూ చదివాడు. భాగ్యనగరంలో ఉండే మరాఠి కుటుంబంలో 1961లో హర్ష జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ప్రొఫెసర్లే. తండ్రి ఏడీ భోగ్లే.. ఫ్రెంచ్‌ భాష ఆచార్యుడు. తల్లి శాలిని భోగ్లే.. సైకాలజీ బోధించేది. 1947లో దేశ విభజన సమయంలో తన తల్లి కుటుంబం పాకిస్థాన్‌లోని లాహోర్‌ నుంచి వచ్చిందని ఓ సందర్భంలో హర్ష వెల్లడించాడు. హైదరాబాద్‌ పబ్లిక్‌ పాఠశాలలో చదువుకున్న అతను.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం అహ్మదాబాద్‌ ఐఐఎంలో పీజీడీఎం పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఏపీసీఏ తరపున ఎ- డివిజన్‌ క్రికెట్‌ ఆడిన హర్ష.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా ప్రాతినిథ్యం వహించాడు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్, మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ అర్షద్‌ అయూబ్‌తో కలిపి ఆడాడు. కానీ అతని క్రికెట్‌ కెరీర్‌ ముందుకు సాగలేకపోయింది. కానీ ఆటపై ఇష్టంతో వ్యాఖ్యాతగా మారాడు. తనదైన శైలి వ్యాఖ్యానం, విశ్లేషణతో తక్కువ కాలంలోనే గొప్ప గుర్తింపు పొందాడు.  

అలా మొదలై..

మొదట ఆల్‌ ఇండియా రేడియోతో హర్ష కామెంటేటర్‌ ప్రయాణం 19 ఏళ్ల వయసులోనే మొదలైంది. కానీ టీవీ కోసం అతని తొలి వన్డే మాత్రం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్‌ మధ్య కావడం విశేషం. 1983 సెప్టెంబర్‌ 10, 1983లో హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ కోసం దూరదర్శన్‌ తరపున వ్యాఖ్యానం చేసే అవకాశం హర్షకు దక్కింది. అందుకు అతను తీసుకున్న డబ్బు రూ.350. అవకాశం కోసం చూస్తున్న తనకు.. దూరదర్శన్‌ హైదరాబాద్‌ నిర్మాత ఛాన్స్‌ ఇచ్చాడని, ఆ తర్వాత 14 నెలల్లో మరో రెండు వన్డేలు, ఓ టెస్టుకు వ్యాఖ్యాతగా వ్యవహరించానని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో హర్ష పోస్టు పెట్టాడు. 40 ఏళ్ల కిత్రం తొలి వన్డే అని పేర్కొన్నాడు. తన మాటకారితనం, ఆటపై అవగాహనతో వేగంగా ఎదిగాడు. 1992 ప్రపంచకప్‌ కంటే ముందు భారత్‌తో సిరీస్‌ కోసం హర్షను ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఏబీసీ) ఆహ్వానించింది. ఆ ఘనత సాధించిన భారత తొలి వ్యాఖ్యాత అతనే. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలో భారత పర్యటనలకు ఏబీసీ కోసం హర్ష పనిచేశాడు. బీబీసీలో ఎనిమిదేళ్లు బాధ్యతలు నిర్వర్తించాడు. 1996, 1999 ప్రపంచకప్‌ల కోసం బీబీసీ వ్యాఖ్యాతల బృందంతో కలిసి పని చేశాడు. 1995 నుంచి ఈఎస్‌పీఎన్, స్టార్‌ స్పోర్ట్స్‌కు హర్ష మారాడు. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. క్రికెట్‌ గొంతుక (వాయిస్‌ ఆఫ్‌ క్రికెట్‌)గా పేరు పొందాడు.

రచయిత కూడా.. 

‘హర్ష ఆన్‌లైన్‌’, ‘హర్ష అన్‌ప్లగ్‌డ్‌’, ‘స్కూల్‌ క్విజ్‌ ఒలింపియాడ్‌’ లాంటి టీవీ కార్యక్రమాలకు కూడా హర్ష వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ‘హర్షా కి ఖోజ్‌’ అని అతని పేరుతో ఓ టీవీ కార్యక్రమం కూడా నిర్వహించారు. యూట్యూబ్‌లోనూ తన మాటల జోరు కొనసాగిస్తున్నాడు. బీబీసీ కోసం ‘ట్రావెల్‌ ఇండియా’ అనే కార్యక్రమంలోనూ హర్ష అలరించాడు. డిస్కవరీ ఛానెల్‌ ‘ట్రావెల్‌ విత్‌ హర్ష భోగ్లే’ కార్యక్రమంలోనూ ఆకట్టుకున్నాడు. 2008 ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ సలహాదారుగా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన ఓటింగ్‌లో ఇష్టమైన టీవీ క్రికెట్‌ వ్యాఖ్యాతగా హర్ష నిలిచాడు. అతను రచయిత కూడా. మహమ్మద్‌ అజహరుద్దీన్‌ జీవిత కథను హర్ష రాశాడు. తన వ్యాసాలను పుస్తకాల రూపంలో తెచ్చాడు. భార్య అనితతో కలిసి ‘ది విన్నింగ్‌ వే’, ‘ది విన్నింగ్‌ వే 2.0’ పుస్తకాలను రచించాడు.ఐఐఎం అహ్మదాబాద్‌లో కలిసి చదువుకున్న అనితనే అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. 17 ఏళ్ల నుంచి హర్ష పూర్తిగా శాకాహారి. ముంబయిలో కుటుంబంతో కలిసి ఉంటున్న హర్ష.. మరెన్నో ఏళ్లు తన గొంతుతో క్రికెట్‌ మజాను మరింత పెంచే దిశగా సాగుతూనే ఉంటాడు. 

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని