Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2022) రాజేశ్వరి కుమారి (Rajeshwari Kumari) రజత పతకంతో మెరిసింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం. 

Updated : 18 Jul 2024 15:09 IST

రణ్‌ధీర్‌ సింగ్‌.. ఒకప్పుటి స్టార్‌ భారత షూటర్‌! ఏమాత్రం అంచనాలు లేని స్థితిలోనూ అంతర్జాతీయ పతకాలు గెలిచిన ఛాంపియన్‌! 1978, 1982 ఆసియా క్రీడల్లో కాంస్యాలు నెగ్గిన షూటర్‌. రాజేశ్వరి కుమారి.. ఆమె కూడా షూటరే.. ఆమెపై కూడా ఎలాంటి అంచనాలు లేవు. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది! అప్పటి రణ్‌ధీర్‌కి ఇప్పుటి రాజేశ్వరికి సంబంధం ఉంది. రణధీర్‌ కుమార్తే రాజేశ్వరి (Rajeshwari Kumari). నాన్న బాటలో నడిచి.. ఆయన ఆశయాన్ని నిలబెట్టి ఆసియా క్రీడల్లో అదరగొట్టింది ఈ అమ్మాయి.

క్రీడల నేపథ్యం

దిల్లీకి చెందిన రాజేశ్వరి కుమారిది క్రీడల నేపథ్యం. తండ్రి రణ్‌ధీర్‌, తాత బాలీంద్ర సింగ్‌ క్రీడాకారులే.  ఈ నేపథ్యం నుంచి వచ్చిన కుమారి 2014లో షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. త్వరగా ఈ ఆటపై పట్టు సాధించి ఆ ఏడాదే జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ట్రాప్‌లో కాంస్యం నెగ్గింది. 2019లో జాతీయ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. 2021 ఆసియా షూటింగ్‌లోనూ పసిడితో మెరిసింది. ఇలా టాప్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్లలో తన ముద్ర వేస్తూ వచ్చిన రాజేశ్వరి.. ఈ ఏడాది జూన్‌లో జాతీయ సెలక్షన్‌ ట్రయల్స్‌లో ఫైనల్లో సత్తా చాటి ఆసియా క్రీడలకు ఎంపికైంది. ఆసియా క్రీడల్లో ఒత్తిడికి గురి కాకుండా రాణించి పతకాన్ని పట్టేసింది.

ఒలింపిక్‌ పతకమే లక్ష్యం

రాజేశ్వరీ లక్ష్యం ఒలింపిక్స్‌ పతకమే. ఇప్పటికే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకున్న ఆమె.. తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. తన తండ్రి రణ్‌ధీర్‌ మాదిరే ఒలింపిక్స్‌లోనూ పోటీపడాలని రాజేశ్వరి తహతహలాడుతోంది. 

ఆసియా క్రీడల్లో రాజేశ్వరీ పతకం గెలవడం గర్వంగా అనిపిస్తోంది. 1982 దిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్లో రజతం నెగ్గా. ఇప్పుడు రాజేశ్వరి ట్రాప్‌ ఈవెంట్లోనే రజతం గెలవడం చాలా సంతోషాన్నిస్తోంది. అప్పట్లో ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు బాలీంద్ర సింగ్‌ నాకు ఆ పతకాన్ని బహూకరించారు. ఇప్పుడు నేను అదే హోదాలో రాజేశ్వరికి పతకాన్ని అందించడం గొప్ప అనుభూతి

- పుత్రికోత్సాహంతో రణ్‌ధీర్‌ 

ఫ్యాషన్‌ డిజైనర్‌గా

రాజేశ్వరీ కెరీర్‌ షూటింగే కానీ.. షూటింగ్‌ రేంజ్‌ నుంచి బయటకు వస్తే ఆమె ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌. 2021లో చిన్ననాటి స్నేహితుడు సౌరభ్‌ అగర్వాల్‌తో కలసి పటియాల స్టయిల్‌ క్లాత్‌ బ్రాండ్‌ స్టోర్‌ను నెలకొల్పింది రాజేశ్వరి . బాలీవుడ్‌ సినిమా తారలకు ప్రత్యేకంగా దుస్తులు తయారు చేసి ఇస్తుంది రాజేశ్వరీ. ప్రస్తుతం ఆమె తయారు చేసే దుస్తులకు సినిమా తారల్లోనే కాదు బయట మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ ఉంది.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని