Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్‌ పోరాటమిదీ!

మోడల్‌ కాదు అథ్లెటే... హర్మిలన్‌ బైన్స్‌ (Harmilan Bains) ను చూడగానే సగటు క్రీడాభిమాని అనే మాట ఇది. ఎందుకంటే ఆమె మోడల్‌లా ఉంటుంది మరి. ఇంకా ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం...

Published : 04 Oct 2023 15:22 IST

ఆమెను చూస్తే ఎవరీ మోడల్‌ అనిపిస్తుంది.. ఉంగరాల జట్టు.. అందమైన ముఖం.. ఎండకు కలిమిపోతుందా అన్నట్లుండే మేని ఛాయ. ఈ అమ్మాయి వస్తుంటే అందరి చూపులు ఆమె మీదే! విశేషం ఏమిటంటే ఆమె ఓ విజేత! ర్యాంప్‌ మీద కాదు! అథ్లెటిక్స్‌ ట్రాక్‌ మీద! సున్నితంగా అనిపించే ఈ అమ్మాయి పతకాల పంట పండిస్తోంది. తాజాగా ఆసియా క్రీడల్లో (Asian Games 2022) రజతంతో అదరగొట్టింది. ఆ అథ్లెటే హర్మిలన్‌ బైన్స్‌ (Harmilan Bains).

అమ్మా, నాన్న అథ్లెట్లే

ఆసియా క్రీడల్లో 1500 మీటర్ల పరుగులో సత్తా చాటిన పంజాబ్‌ అమ్మాయి హర్మిలన్‌ అథ్లెటిక్స్‌ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లి మాధురి సింగ్‌ కూడా అంతర్జాతీయ అథ్లెటే. హర్మిలిన్‌ కడుపులో ఉండగానే ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రాక్‌లో పరుగులు తీసింది మాధురి. అథ్లెటిక్స్‌ అంటే ప్రాణంగా ఉండే మాధురి.. హర్మిలిన్‌ పుట్టిన నాలుగేళ్ల తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చి 2002 బుసాన్‌ ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగులో రజతం గెలిచింది. విశేషం ఏమిటంటే హర్మిలన్‌ నాన్న అమన్‌దీప్‌ బైన్స్‌ కూడా అథ్లెటే. దక్షిణ ఆసియా క్రీడల్లో పతకం గెలిచాడు. ఇలా అమ్మ, నాన్న స్ఫూర్తితో పరుగును నరనరానా జీర్ణించుకున్న హర్మిలన్‌ ట్రాక్‌లో పతకాల వేటలో సాగుతోంది. 

అనుకోకుండా నిషేధం

13 ఏళ్ల వయసులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిందనే కారణంతో హర్మిలన్‌పై రెండేళ్ల నిషేధం పడింది. స్థానికంగా ఒక వైద్యుడు ఇచ్చిన మందులు వాడడం వల్ల ఆమె అనుకోకుండా నాడా పరీక్షల్లో పట్టుబడింది. దీంతో కుంగిపోయినా.. మళ్లీ ట్రాక్‌లో వచ్చిన ఆమె 2015లో సెలక్షన్స్‌లో సత్తా చాటి సాయ్‌ హాస్టల్‌లో చోటు దక్కించుకుంది. అక్కడ అథ్లెటిక్స్‌లో రాటుదేలింది. సీబీఎస్‌ఈ జాతీయ అథ్లెటిక్స్‌లో 1500 మీటర్లలో పసిడి గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.  

అదే ఏడాది అండర్‌-18 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 500 మీటర్లలో రజతాలు సొంతం చేసుకున్న హర్మిలన్‌ 2016లో వియత్నాంలో జరిగిన ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో 1500 మీ పరుగులో కాంస్యం నెగ్గి అంతర్జాతీయ పతకాల ఖాతా తెరిచింది. అక్కడ నుంచి ఆమె ప్రదర్శన మరింత మెరుగవుతూ వచ్చింది. 2021లో 800, 1500 మీ పరుగులో జాతీయ ఛాంపియన్‌ అయిన హర్మిలిన్‌... ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లలో పసిడి పతకాలతో మెరిసింది. 

గాయంతో దూరమైనా

2022లో మోకాలి గాయం కారణంగా హర్మిలన్‌ జోరుకు బ్రేక్‌ పడింది. కామన్వెల్త్‌ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లాటి ప్రధాన ఈవెంట్లకు దూరమైంది. 10 నెలల విరామం తర్వాత ఈ ఏడాది అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌లో పునరాగమనం చేసిన ఈ పంజాబ్‌ రన్నర్‌...1500 మీ, 800 మీటర్ల పరుగులో రజతాలతో సత్తా చాటింది. ఇదే క్రమంలో ఆసియా క్రీడలకు అర్హత సాధించిన ఆమె హాంగ్‌జౌలోనూ అదరగొట్టింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి సత్తా చాటాలన్నది హర్మిలన్‌ కల. ఆ కలను తీర్చుకునే దిశగా ఇప్పుడు ఆసియా పతకంతో ఓ అడుగు ముందుకేసింది.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని