IPL 2024: ఐపీఎల్‌ వేలం సందడి.. ఎప్పుడు ఉండొచ్చంటే?

అంతర్జాతీయ స్థాయిలో టీ20 క్రికెట్‌కు గ్లామర్‌ తీసుకొచ్చిన టోర్నీ ఐపీఎల్. మరి అలాంటి ఐపీఎల్ 2024 కోసం ఆటగాళ్ల వేలం కూడా పెద్ద సంచలనమే అవుతుంది. 

Updated : 27 Oct 2023 17:02 IST

(ఫొటో: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ అభిమానులు ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) మూడ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2024) వచ్చే ఏడాది ఈవెంట్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. పీటీఐ కథనాల ప్రకారం.. ఐపీఎల్‌ 2024 (IPL 2024) సీజన్‌ మెగా వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎడిషన్‌ కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే సొమ్ము కూడా మరికొంత పెరిగే అవకాశం ఉందని ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

‘‘పది జట్లు పాల్గొనే ఐపీఎల్‌ వేలానికి సంబంధించిన ప్రక్రియ నిర్వహణ చాలా క్లిష్టమైంది. ఒకే చోట వందల సంఖ్యలో హోటల్‌ గదులు, సదుపాయాలు కల్పించడం కూడా కష్టమైన విషయం. బీసీసీఐ అధికారులు, ఫ్రాంచైజీలకు సంబంధించిన ప్రతినిధులు, బ్రాడ్‌కాస్ట్‌ సిబ్బంది... ఇలా చాలామంది ఉంటారు. అందుకే దుబాయ్‌ను వేదికగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక గతేడాది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి ఫ్రాంచైజీకి రూ.95 కోట్ల వరకు ఉండేవి. ఇప్పుడా సొమ్మును మరో రూ. 5కోట్లు పెంచేందుకూ ఆలోచన చేస్తున్నాం. అంటే 2024 సీజన్‌ కోసం నిర్వహించే వేలంలో ఫ్రాంచైజీలు రూ. 100 కోట్ల వరకు తమ సొమ్మును వెచ్చించేందుకు అవకాశం దక్కనుంది’’ అని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి.

మహిళా లీగ్ కోసం వేలం.. 

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2024 కోసం వేలం నిర్వహించేందుకూ సన్నాహలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా క్రికెటర్ల కోసం డిసెంబర్‌ 9న ఆ వేలం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకూ ఐపీఎల్ లేదా బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని