వానా వానా వద్దప్పా!

అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్‌ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్‌ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..!

Updated : 18 May 2024 07:14 IST

చెన్నై × బెంగళూరు మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఆఖరి ప్లేఆఫ్స్‌ బెర్తు తేలేది నేడే
రాత్రి 7.30 నుంచి
బెంగళూరు

సలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్‌ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్‌ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! ఇప్పుడు క్రికెట్‌ అభిమానుల చర్చ అంతా చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌పైనే. ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును సొంతం చేసుకోవాలంటే ఈ రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. రన్‌రేట్‌లో వెనకబడ్డ బెంగళూరు మామూలుగా గెలిస్తే సరిపోదు. ఇంత ఆకర్షణీయ మ్యాచ్‌ పూర్తిగా సాగుతుందా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం రాత్రి 8 నుంచి 11 మధ్య బెంగళూరులో వర్షం పడేందుకు 75 శాతం అవకాశముందని సమాచారం. నీరు వేగంగా ఇంకిపోయే అత్యుత్తమ వ్యవస్థ కలిగిన చిన్నస్వామి స్టేడియంలో.. వర్షం నిలిచాక అరగంటలో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయొచ్చు. కనీసం అయిదు ఓవర్ల ఆటైనా సాగితే విజేతను నిర్ణయించొచ్చు. అలాంటి పరిస్థితి లేకపోతే మాత్రం.. ప్లేఆఫ్స్‌ బెర్తు చెన్నై సొంతమవుతుంది. 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించిన చెన్నై (0.528 రన్‌రేట్‌) ముందుకు వెళ్లాలంటే ఒక్క పాయింటు లభించినా సరిపోతుంది. బెంగళూరుకు భారీ విజయం తప్పనిసరి. 8 మ్యాచ్‌ల్లో ఒకే గెలుపుతో ప్లేఆఫ్స్‌ పోటీలో లేనట్లే అనుకున్న బెంగళూరు.. అద్భుతంగా పుంజుకుని వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు రన్‌రేట్‌లో (0.387) వెనకబడివుంది. చెన్నైని అధిగమించి ప్లేఆఫ్స్‌ బెర్తు సంపాదించాలంటే.. మొదట బ్యాటింగ్‌ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదంటే 11 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాలి. విరాట్‌ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం లీగ్‌లో టాప్‌ స్కోరర్‌ కోహ్లి(661)నే. రజత్‌ పటిదార్, కామెరూన్‌ గ్రీన్, డుప్లెసిస్‌ సత్తా చాటితే లక్ష్యాన్ని అందుకోవడం ఆ జట్టుకు కష్టమేం కాకపోవచ్చు. మరోవైపు అయిదుసార్లు ఛాంపియన్‌ చెన్నై ఇంకో కప్పుతో ధోనికి ఘన వీడ్కోలు ఇవ్వాలని కోరుకుంటోంది. ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అని భావిస్తున్న నేపథ్యంలో ఫైనల్‌ చేరాలని చెన్నై పట్టుదలగా ఉంది. వర్షం అంతరాయం లేకపోతే ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయం. మరి వరుణుడు ఏం చేస్తాడో..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని