Pat Cummins: అంతర్జాతీయ క్రికెట్‌ గుత్తాధిపత్యానికి ఐపీఎల్‌ ముగింపు పలికింది : ఆసీస్‌ కెప్టెన్‌

ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆసీస్‌(Australia) కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌(Pat Cummins). ఆటలో అది ఏవిధంగా మార్పులు తీసుకువచ్చిందో వివరించాడు.

Published : 04 Jun 2023 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఐపీఎల్‌(IPL 2023) ముగియడంతో.. తాజగా డబ్ల్యూటీసీ ఫైనల్‌(WTC Final) కోసం క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దిగ్గజ జట్లైన ఆస్ట్రేలియా, భారత్‌(Australia vs India) ఈ టెస్టు మహా సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆసీస్‌(Australia) కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌(Pat Cummins).. ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లో ఐపీఎల్‌ ఎన్నో మార్పులు తీసుకు వచ్చిందన్నాడు.

ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్‌ గుత్తాధిపత్యానికి ఐపీఎల్‌ ముగింపు పలికిందని కమిన్స్‌ పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌ కంటే.. జాతీయ జట్టు కోసం ప్రధాన్యత ఇచ్చేలా ఆటగాళ్లను ఒప్పించడం సవాల్‌గా మారనుందని అభిప్రాయపడ్డాడు. లాభదాయక టీ20 లీగ్‌ల కారణంగానే న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రక్ట్‌ను కూడా ట్రెంట్‌ బౌల్ట్‌ వద్దన్నాడన్న విషయాన్ని కమిన్స్‌ అంగీకరించాడు. దశాబ్దం క్రితమే ఐపీఎల్‌ క్రికెట్‌ రూపురేఖలను మార్చివేసిందని చెప్పాడు.

‘గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్‌కు గుత్తాధిపత్యం లేదు. దశాబ్దం క్రితమే దీనిని ఐపీఎల్‌ మార్చివేసింది. దీని గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక నా జట్టు సహచరులు ఇతర విషయాలకంటే జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. అయితే, ఎక్కువ లాభదాయకత ఉండే ఫ్రాంఛైజీ లీగ్‌ల కారణంగా ఇది సవాలుతో కూడుకున్న అంశం’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు.

‘ఆస్ట్రేలియా తరఫున ఆడటం ప్రత్యేకం. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలి. ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాలి. కొన్నేళ్లు గడిస్తే.. 12 నెలల అంతర్జాతీయ క్యాలెండర్‌ కొద్దిగా భిన్నంగా కనిపించవచ్చు’ అని కమిన్స్‌ వివరించాడు. ఇక క్రికెట్‌ సాకర్‌ మార్గంలో వెళ్తోందని.. జాతీయ జట్టుకు ఆడేందుకు ఫ్రాంఛైజీల నుంచి అనుమతులు అవసరమయ్యే పరిస్థితులు వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పాడు.

ఇక WTC Final కోసం తాను ఎదురుచూస్తున్నట్లు కమిన్స్‌ చెప్పాడు. గత ఎడిషన్‌లో ఫైనల్‌ వరకూ వెళ్లిన ఇండియాతో తాము తలపడబోతున్నామన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని