IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్‌లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?

మెగా లీగ్‌ ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. ఐదు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Updated : 15 May 2024 17:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ లీగ్‌ స్టేజ్‌ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. మరో రెండు బెర్తుల కోసం ఐదు జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు టీమ్‌ల అవకాశాలు దాదాపు ఒక్కశాతం కంటే తక్కువే. మిగిలిన మూడు జట్ల ఛాన్స్‌లు ఎంత పర్సంటేజీలు ఉన్నాయనేది ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌ స్పోర్ట్స్‌ స్పెషల్‌గా పోస్టు చేసింది. 

  • హైదరాబాద్‌: ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న జట్టు హైదరాబాద్. గతేడాది దారుణమైన ఆట తీరుతో ఇబ్బందిపడిన ఎస్ఆర్‌హెచ్‌ సంచలనాలకు వేదికగా మారింది. ఇప్పటివరకు 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించి.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆఖరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే 18 పాయింట్లు అవుతాయి. గుజరాత్, పంజాబ్‌తో ఆడాల్సిఉంది. మరోవైపు రాజస్థాన్‌ (16) తన చివరి రెండు మ్యాచుల్లోనూ ఓడిపోతే సెకండ్‌ ప్లేస్ ఖాయం. అప్పుడు క్వాలిఫయర్‌ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్‌కు చేరుకొనేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌కు 87.3 శాతం అవకాశం ఉంది.

చెన్నై: బలమైన రాజస్థాన్‌ను ఓడించడంతో చెన్నై ప్లేఆఫ్స్‌ రేసులో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తును దక్కించుకుంటుంది. ఒకవేళ ఓడినా.. అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 13 మ్యాచులను ఆడిన సీఎస్కే ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. నెట్‌ రన్‌రేట్‌ (+0.528) ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. స్టార్‌స్పోర్ట్స్‌ లెక్క ప్రకారం చెన్నైకి 72.7 శాతం అవకాశం ఉంది. చివరి మ్యాచ్‌ బెంగళూరుతోనే కావడంతో ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. ఆ జట్టు కూడా ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. 

  • బెంగళూరు ఓడితే.. అంతే..: వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన జట్టు చివరివరకూ ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటుందని అనుకోగలరా? కానీ, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాత్రం ఉంది. గత ఐదు మ్యాచుల్లో గెలిచి నాకౌట్‌ రేసును ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం 13 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌ చెన్నైతో తలపడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే... వారికే ఎక్కువ ఛాన్స్‌ ఉంది. అయితే, సీఎస్కేతో పోలిస్తే ఆర్సీబీకి ఓటింగ్‌లో 39.3 శాతమే వచ్చింది. 
  • ఒక్క శాతం కంటే తక్కువే: దిల్లీ, లఖ్‌నవూ జట్లలో ఎవరు ప్లేఆఫ్స్‌కు వచ్చినా అది సంచలనమే అవుతుంది. దిల్లీ 14 మ్యాచులు ఆడి ఏడు విజయాలు సాధించింది. 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కానీ, ఆర్సీబీ, సీఎస్కే, ఎస్‌ఆర్‌హెచ్‌తోపాటు లఖ్‌నవూ నుంచీ ఆ జట్టుకు ముప్పు ఉంది. నెట్‌ రన్‌రేట్ (-0.377) తక్కువగా ఉండటం డీసీకి ప్రతికూలంగా మారింది. మరోవైపు లఖ్‌నవూ కూడా భారీ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్‌ అవకాశం ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం దిల్లీకి 0.7 శాతం, లఖ్‌నవూకు 0.2 శాతం ఛాన్స్ ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి గుజరాత్, ముంబయి, పంజాబ్‌ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు