IPL 17: మెరుపులు కొన్ని.. తడబాట్లు మరికొన్ని.. ఒక్కో జట్టుది ఒక్కో కథ

ఐపీఎల్‌ టోర్నీ ముగిసింది. కోల్‌కతా విజేతగా నిలిచింది. హైదరాబాద్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Published : 27 May 2024 12:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్‌ ముగిసింది. కొన్ని జట్లు అంచనాలకు మించి రాణించగా.. మరికొన్ని చివర్లో తడబడ్డాయి. ఇంకొన్ని ఎప్పటిలానే నిరాశపరిచాయి. ఇలా ఒక్కో జట్టుది ఒక్కో కథ. ఏదైతేనేం.. ఈ టోర్నీ కోట్లాది క్రీడాభిమానులకు ఎన్నో మధురానుభూతులను పంచింది.

కోల్‌‘కథా’ మారింది..

గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేని జట్టు. ఈ టోర్నీకి ముందు పెద్దగా అంచనాలు లేని జట్టు. అయితే.. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చి కప్‌ను ఎగరేసుకుపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇలా కోల్‌కతా ‘కథ’ను మార్చిన క్రెడిట్‌ మాత్రం జట్టును వెనకుండి నడిపించిన మాస్టర్‌ మైండ్‌ గంభీర్‌కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ శ్రేయస్‌ కూడా బ్యాటింగ్‌తోపాటు సారథిగానూ కీలక పాత్ర పోషించాడు.

చివరి మెట్టుపై బోల్తా.. హైదరా‘బాధ’

పాయింట్ల పట్టికలో చివరిలో ఉండి గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుకు ఈసారి దూకుడును తీసుకొచ్చింది కెప్టెన్‌ పాట్‌ కమిన్సే. ఓ బలమైన సారథి ఉంటే జట్టు ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆరంభంలో బీభత్సమైన బ్యాటింగ్‌తో రికార్డులను తిరగరాస్తూ చెలరేగిన కమిన్స్‌ సేన.. ఫైనల్స్‌లో చివరి మెట్టుపై తడబడింది. కప్‌ గెలవకపోయినా తన ఆటతీరుతో అభిమానుల మనసులు గెలుచుకుంది.

ఆ ‘రాజ’సం ఏది..?

ఎప్పుడో తొలి ఐపీఎల్‌ టోర్నీని ముద్దాడిన జట్టు అది. ఈసారైన కప్‌ అందిస్తుందా.. అని అభిమానుల ఎదురుచూపులు.. అందుకు తగ్గట్టే ఆడిన మొదటి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో రాజస్థాన్‌ రాజసం ప్రదర్శించింది. ఆ తర్వాత వరుస అపజయాలతో చతికిలబడింది. ప్లేఆఫ్స్‌ చేరినా క్వాలిఫయర్‌ 2లో ఓటమితో నిష్క్రమించింది.

ఓటములతో డీలాపడి.. ఉవ్వెత్తున ఎగసిపడి..

ఆర్సీబీ ఈసారి ప్లేఆఫ్స్‌నకు చేరడమే ఓ అద్భుతం. వరుస ఓటములతో డీలాపడిన ఆ జట్టు తిరిగి పుంజుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్లే ఆఫ్స్‌ వరకూ వచ్చినా.. రాజస్థాన్‌ చేతిలో ఓటమి తప్పలేదు. టోర్నీ మొదట్లో నిరాశపరిచినా.. ఆఖర్లో మాత్రం అభిమానులను ఆకట్టుకుందనే చెప్పాలి.

ధోనీ కోసమే..

ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలిచిన  చెన్నై ఈ సారి ప్లేఆఫ్స్‌ చేరనప్పటికీ.. ధోనీ ఆటతీరు ఆ జట్టు అభిమానులను మైమరపించింది. కేవలం మహీని చూడడానికే పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియాలకు తరలివచ్చారు. ఇన్నింగ్స్‌ చివర్లో వచ్చి అతడు కొట్టిన సిక్స్‌లు చూసి మురిసిపోయారు.

దిల్లీకి పంత్‌ బలం..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్‌ పంత్‌.. తిరిగి మైదానంలోకి అడుగుపెడతాడా..? అసలు బ్యాటింగ్‌ చేస్తాడా..? కీపింగ్‌ చేయగలుగుతాడా..? ఇలా ఎన్నో అనుమానాలు. అయితే.. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ పంత్‌.. మునుపటి మెరుపులు మెరిపించాడు. దిల్లీ ఈ సీజన్‌లో నిరాశపరిచినా ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ పంతే.

లఖ్‌నవూ ఆ లక్కేది..

గత సీజన్‌లో అద్భుత ఆటతీరుతో టాప్‌ 4లో నిలిచిన లఖ్‌నవూ ఈ సారి తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఆ టీమ్‌ ఆటతీరు కంటే.. కెప్టెన్‌కు, జట్టు యజమానికి మధ్య జరిగినే వాదనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గుజరాత్‌.. మెరుపులేవీ..

ఆడిన తొలి టోర్నీలో కప్‌ కొట్టి.. ఆ తర్వాత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు అది. ఈ సారి అలాంటి ప్రదర్శన చూస్తామని భావించిన అభిమానులను పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది గుజరాత్‌. కొత్త కెప్టెన్‌ గిల్‌ కూడా ఆ జట్టును ముందుకు తీసుకెళ్ల లేకపోయాడు.

వీళ్లు ‘కింగ్స్‌’ అయ్యేదెప్పుడు..?

ఒక్కసారి కూడా కప్‌ గెలవని జట్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. ఈసారి దీనిపై ఎలాంటి అంచనాలు లేనప్పటికీ.. కొద్దోగొప్పో రాణిస్తుందనుకున్నారు. శిఖర్‌ ధావన్‌ గాయంతో వెనుదిరగడం ఆ జట్టుకు పెద్ద లోటు. సామ్‌ కరన్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా.. ఆ జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయాడు.

కొంపముంచిన కెప్టెన్సీ మార్పు..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఏ జట్టుపై జరగని చర్చ ఒక్క ముంబయిపైనే జరిగింది. దీనికి కారణం కెప్టెన్సీ మార్పు. రోహిత్‌ను కాదని హార్దిక్‌ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ఆ జట్టుకు కలిసి రాలేదు సరికదా.. టీమ్‌లో అంతర్గత విభేదాలకు దారి తీసింది. దీంతో ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం ఏర్పడి.. జట్టు ఫలితాలపైనా ప్రభావం చూపించింది. చివరికి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని