IPL : ఐపీఎల్‌ టు టీమ్‌ఇండియా.. ఈసారి వీరికి అవకాశం దక్కేనా..?

ఈ ఐపీఎల్‌(IPL 2023) సీజన్‌లో పలువురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. భవిష్యత్‌లో టీమ్‌ఇండియాకు ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరచుకుంటున్నారు.

Updated : 02 May 2023 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఐపీఎల్‌(IPL) క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఈ మెగా టోర్నీ.. ఎందరో యువకుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన చాలా మందికి జాతీయ జట్టు(Team India)లోనూ చోటు దక్కింది. గతంలో చెన్నై ఆటగాళ్లు శివమ్‌ దూబే, రుతురాజ్‌ గైక్వాడ్‌ అలా వచ్చినవారే. ఈ సీజన్‌లోనూ అలా మంచి ప్రదర్శన ఇస్తూ అందరి దృష్టిలో పడ్డ అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు(uncapped players) ఉన్నారు. భవిష్యత్‌లో టీమ్‌ఇండియా జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న ఆ ఆటగాళ్లపై ఓ లుక్కేస్తే..

  1. యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) : ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వి ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓటమిపాలైనప్పటికీ.. అతడి సెంచరీ (124; 62 బంతుల్లో 16×4, 8×6)యే మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇది. ఇక ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ.. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులోనూ నిలిచాడు. మే 2 నాటికి 428 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇందులో మూడు అర్థ శతకాలు, ఒక శతకం ఉంది. ఇతడి ప్రతిభను మెచ్చుకున్న పలువురు మాజీలు.. ఈ సీజన్‌ అనంతరం టీమ్‌ఇండియాలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొనియాడుతున్నారు.
  2. రింకు సింగ్‌ (Rinku Singh) : ఆఖరి ఓవర్లో ఒత్తిడిని అధిగమించి.. వరుసగా ఐదు సిక్స్‌లు బాది కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన రింకు అద్భుత ఇన్నింగ్స్‌ను ఐపీఎల్‌ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేం. అతడి ఇన్నింగ్స్‌ చూసిన తర్వాత ఐపీఎల్‌లో ఏదైనా సాధ్యమే.. చివరి బంతి వరకూ ఓటమిని అంగీకరించకూడదు అనే పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే అందరి దృష్టిలో పడ్డ ఈ ఆటగాడు.. తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 151 స్ట్రైక్‌ రేట్‌తో ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 270 పరుగులు చేశాడు. ఇందులో 19 సిక్స్‌లు, 15 ఫోర్లు ఉన్నాయి. టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌లో ఫైర్‌పవర్‌ కావాలనుకుంటే.. రింకు ఆ ప్లేస్‌కు సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
  3. తిలక్‌ వర్మ (Tilak Varma) : ఐపీఎల్‌ ఆడుతున్న అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లలో ఎక్కువగా చర్చ జరుగుతున్న ఆటగాళ్లలో మన తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ ఒకడు. ముంబయి జట్టులో అతడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. గత ఏడాది ముంబయి తరఫున అరంగ్రేటం చేశాడు ఈ కుర్రాడు. 2022వ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ముంబయి తీవ్రంగా నిరాశపర్చినప్పటికీ.. ఆ జట్టులో తిలక్‌ మంచి ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆడిన తొలి సీజన్‌లో మొత్తం 397 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ సీజన్‌లోనూ ముంబయికి కీలక బ్యాటర్‌గా మారాడు. ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్‌లోనే 84 పరుగులతో బెంగళూరుపై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడి మొత్తం 248 పరుగులు చేశాడు. అతడి హార్డ్‌ హిట్టింగ్‌ పవర్‌ టీమ్‌ఇండియాకు పనికివస్తుందని పలువురు భావిస్తున్నారు.
  4. తుషార్‌ దేశ్‌పాండే (Tushar Deshpande): ఈ జాబితాలో ఉన్న ఏకైక బౌలర్‌ దేశ్‌పాండేనే. ఈ చెన్నై బౌలర్‌ ఈ సీజన్‌లో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ రేస్‌లోనూ నిలిచాడు. అప్పడప్పుడూ ఎక్స్‌పెన్సివ్‌గా మారుతున్నా.. ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. డెత్‌ ఓవర్లలోనూ బౌలింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ధోనీ సారథ్యంలో మరింత మెరుగవుతున్నాడు.
  5. సాయి సుదర్శన్‌ (Sai Sudharsan) : గుజరాత్‌ ఆటగాడు సాయి సుదర్శన్‌ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 5 మ్యాచ్‌లు ఆడి 176 పరుగులు చేశాడు. అతడి ఆటతీరుపై పలువురు ప్రంశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్‌లో సాయి.. టీమ్‌ఇండియాలో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు సారథి హార్దిక్‌ పాండ్య కూడా మెచ్చుకున్నాడు.

వీరే కాకుండా కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మ, సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్ శర్మ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇక చెన్నై స్టార్‌ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే లాంటి ఆటగాళ్లు ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. గతంలో వీరు టీమ్‌ఇండియాకు ఆడినవారే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని