Dinesh Karthik: పంతా..? కార్తీకా..? టీ20 ప్రపంచకప్‌లో ఎవరు?

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాక టీమ్‌ఇండియాలో సరైన ఫినిషర్‌ ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. రిషభ్‌ పంత్‌ ఆ సమయంలో టెస్టుల్లో పలు అద్భుతమైన ప్రదర్శనలు చేయడంతో...

Updated : 19 Jun 2022 14:56 IST

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాక టీమ్‌ఇండియాలో సరైన ఫినిషర్‌ ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. రిషభ్‌ పంత్‌ ఆ సమయంలో టెస్టుల్లో పలు అద్భుతమైన ప్రదర్శనలు చేయడంతో ఆ లోటును భర్తీ చేశాడని అంతా అనుకున్నారు. నిజంగానే అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో అదరగొట్టాడు కూడా. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పొట్టి ఫార్మాట్‌లోనే ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. పంత్‌ ఇప్పటిదాకా అంతర్జాతీయ టీ20ల్లో టీమ్‌ఇండియా తరఫున తనదైన ముద్ర వేయలేకపోయాడు.

అభిమానులు ఎవరివైపు?

భారత జట్టు మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యమే కొన్నాళ్లుగా కీలకపోరుల్లో ఓటములకు ప్రధాన కారణంగా మారింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే విషయం స్పష్టమైంది. దీంతో సరైన ఫినిషర్‌ దొరికితే తప్ప ఐసీసీ టోర్నీల్లో జట్టు కష్టాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. అయితే, ఇటీవల భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ బెంగళూరు తరఫున ఫినిషర్‌గా అద్భుత పాత్ర పోషించాడు. దీంతో దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్‌ పర్యటలోనూ రెండు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. మరోవైపు పంత్‌ టీ20 లీగ్‌లో అంతగా మెరవకపోవడం.. తాజా సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గా విఫలమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. దీంతో రాబోయే టీ20 ప్రపంచకప్‌లో అతడి కన్నా డీకేకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు.

డీకే పరిస్థితి ఎలా ఉంది?

దినేశ్‌ కార్తీక్‌ 2006 డిసెంబర్‌లో టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతడు ఆడింది కేవలం 36 మ్యాచ్‌లే. ధోనీ రాకతో డీకేకు అవకాశాలు తగ్గాయి. దీంతో అడపాదడపా అవకాశాలు వచ్చినా వాటిని పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, 2018లో నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో చివర్లో బంగ్లాదేశ్‌పై సంచలన బ్యాటింగ్‌ చేసి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. దాంతో 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, ఆ సిరీస్‌లో కూడా పెద్దగా అవకాశాలు రాకపోయినా సెమీ ఫైనల్‌ లాంటి కీలకపోరులో జట్టు అవకాశం ఇచ్చింది. కానీ, టాప్‌ ఆర్డర్‌ అంతా కుప్పకూలినట్టే డీకే కూడా విఫలమయ్యాడు. దీంతో జట్టులో కనుమరుగయ్యాడు. ఇప్పుడు అనూహ్యంగా రెచ్చిపోతూ మళ్లీ రాబోయే ప్రపంచకప్‌పై ఆశలు పెంచుతున్నాడు.

డీకే గణాంకాలు ఎలా ఉన్నాయి?

ఇక దినేశ్‌ కార్తీక్‌ టీ20 గణాంకాల విషయానికొస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఆడింది తక్కువ మ్యాచ్‌లే. దాంతో చేసిన పరుగులు 491 కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే, సగటు 35.07గా నమోదవ్వగా.. స్ట్రైక్‌రేట్‌ 146.13 సాధించాడు. మొన్ననే తొలి అర్థశతకం సాధించి టీమ్ఇండియా తరఫున అత్యధిక వయసులో ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే భారత టీ20 లీగ్‌లో ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన డీకే 330 పరుగులు చేశాడు. సగటు 55 కాగా, స్ట్రైక్‌రేట్‌ 183.33గా నమోదైంది. అలాగే తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లోనూ 46 సగటుతో 158 స్ట్రైక్‌రేట్‌తో దంచికొడుతున్నాడు. దీన్నిబట్టే అతడు ఇప్పుడెలా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఛేదనల్లో అతడి సగటు 65.25గా చాలా మెరుగ్గా ఉంది. ఇవి మాత్రమే కాకుండా బెంగళూరు తరఫున వికెట్‌ కీపర్‌గానూ ఆకట్టుకున్నాడు.

పంత్‌ పరిస్థితి ఏంటి?


 

పంత్‌ టీమ్‌ఇండియా తరఫున 2017లో టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 47 మ్యాచ్‌లు ఆడి 740 పరుగులే చేశాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌ చేయగల అతడు కేవలం 3 అర్ధశతకాలే సాధించాడు. అత్యధిక స్కోర్‌ 65 నాటౌట్‌. సగటు 23.12, స్ట్రైక్‌రేట్‌ 123.95గా ఉన్నాయి. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడినా ఒక్కదాంట్లోనూ మెరిసింది లేదు. పేలవ షాట్లతో అనసవరంగా వికెట్‌ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ సిరీస్‌లో మొత్తం 57 పరుగులే చేసిన అతడు 14.25 సగటు, 105.59 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 క్రికెట్‌లో పంత్‌ ఇంకా తనదైన ముద్రవేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అతడి ఆటలో నిలకడలేమే ప్రధానంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూసినా పంత్‌ కన్నా డీకేనే మెరుగ్గా ఉన్నాడు.

మాజీలు ఏమంటున్నారు?

అయితే, ఇటీవల దినేశ్‌ కార్తీక్‌ ఆటతీరు చూసిన పలువురు మాజీలు అతడు కచ్చితంగా ప్రపంచకప్‌లో ఉండాలని అంటున్నారు. దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ డీకే కచ్చితంగా మెల్‌బోర్న్‌కు వెళ్లే టీమ్‌ఇండియా విమానంలో ఉండాలన్నాడు. లేకపోతే తనకు పెద్ద ఆశ్చర్యం కలుగుతుందని చెప్పాడు. అలాగే పార్థీవ్‌ పటేల్‌ ఇటీవల ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ డీకే లాంటి అనుభవజ్ఞుడికి బౌలింగ్‌ చేసేటప్పుడు ప్రత్యర్థి బౌలర్లు తప్పులు చేస్తారని అన్నాడు. అంటే అతడి బ్యాటింగ్‌ శైలి ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక పాక్ మాజీ కీపర్‌ రషీద్‌ లతీఫ్‌ సైతం డీకే బ్యాటింగ్‌ తీరును మెచ్చుకుంటున్నాడు. టీ20 లీగ్‌లో బెంగళూరు తరఫున అదరగొట్టిన అతడు ఫినిషర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడని కితాబిచ్చాడు. ప్రపంచంలో చాలా కొద్ది మంది వికెట్‌ కీపర్లే ఇలాంటి స్థానాల్లో రాణిస్తారని అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా డీకే ప్రపంచకప్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఐర్లాండ్‌ పర్యటన తర్వాత టీమ్‌ఇండియాకు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌లతో టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిల్లోనైనా పంత్‌ సత్తా చాటుతాడో లేదో చూడాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని