Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌కు షాక్‌ తప్పదా? ఈ యువ ఆటగాడికి ఏమైంది?

టీమ్ఇండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan)ను త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

Published : 09 Jan 2024 15:45 IST

ఐపీఎల్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో వెలుగులోకి వచ్చిన ఆ యువ ఆటగాడు.. ఆరంభంలో జాతీయ జట్టులోనూ నిలకడ ప్రదర్శించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో పంత్‌ జట్టుకు దూరం కావడంతో.. ఈ ఆటగాడే జట్టులో వికెట్‌ కీపర్‌గా కొనసాగాడు. కానీ నిలకడ లేమి, మానసిక ఆందోళనతో వెనుకబడ్డాడు. ఇప్పుడు జట్టుకే దూరమై.. టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని చేజార్చుకునేలా కనిపిస్తున్నాడు. ఆ ఆటగాడే ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan). ఈ ఏడాది జూన్‌ 1 ఆరంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియా (Team India) చివరిగా అఫ్గానిస్థాన్‌తో ఆడే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్‌కు చోటు దక్కలేదు. మరి ఈ ఆటగాడికి ఏమైంది? జట్టులో పోటీని తట్టుకోలేకపోతున్నాడా? 

మానసిక ఆందోళన

టీమ్‌ఇండియాలో చోటు కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు ముగ్గురు యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌ మాత్రం నిలకడ లేమితో.. జట్టులోకి వస్తూ, వెళ్తూ ఉన్నాడు. దీంతో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జట్టుతో కొనసాగుతున్నప్పటికీ ఫైనల్‌ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో గిల్‌ అనారోగ్యం కారణంగా ఇషాన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. కానీ ఆ తర్వాత గిల్‌ రావడంతో.. అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో అయిదు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడాడు. చివరి రెండు మ్యాచ్‌లకు జితేశ్‌కు అవకాశం కల్పించడంతో ఇషాన్‌ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కూ అతడిని ఆడించలేదు. దక్షిణాఫ్రికాతో టెస్టులకు కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా ఆడతాడని తెలియడంతో ఇషాన్‌ మరింత కలత చెందినట్లు తెలిసింది. దీంతో ఆ సిరీస్‌కు ముందే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ఆటకు విరామం తీసుకుని, వెకేషన్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌ సెలక్షన్‌కు అతను అందుబాటులో లేడని సమాచారం. 

తీవ్రమైన పోటీ 

అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌ కోసం 16 మంది ఆటగాళ్లతో టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. రోహిత్, యశస్వి, శుభ్‌మన్‌లో ఇద్దరు ఓపెనర్లుగా ఆడతారు. దీంతో ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇషాన్‌కు లేదు. ఇక మూడో స్థానంలో కోహ్లి ఆడతాడు. దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో ఆ స్థానంలో ఆడిన ఇషాన్‌కు ఇక్కడ ఖాళీ లేదు. మిడిలార్డర్‌లో ఆడతారనే కారణంతో వికెట్‌ కీపర్లుగా జితేశ్‌ శర్మ, సంజు శాంసన్‌ను తీసుకున్నారు.

‘‘జట్టులో జితేశ్, శాంసన్‌ వికెట్‌ కీపర్లుగా ఉన్నారు. గత రెండు సిరీస్‌ల్లో శాంసన్‌ వికెట్‌ కీపింగ్‌ చేయలేదు. అప్పుడు ఇషాన్‌ వికెట్‌ కీపర్‌గా ఆడాడు. కానీ ఇప్పుడు అతను జట్టులో లేడు. కారణమేంటో ఎవరికీ తెలియదు. ఓపెనింగ్‌ స్థానాల్లో ఖాళీ లేదు. కోహ్లి నాలుగులో కాకుండా మూడులో ఆడతాడు. కాబట్టి వికెట్‌ కీపర్‌ మిడిలార్డర్‌లో ఆడాల్సి వస్తుంది. అలాంటి ఆటగాళ్లు కాబట్టే జితేశ్, శాంసన్‌ జట్టులో ఉన్నారు’’ అని టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

ఇక కష్టమే

‘‘మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకుండానే జట్టుతో ప్రయాణించడం వల్ల ఇషాన్‌ సంతోషంగా లేడు. ప్రస్తుతం అతను విరామం తీసుకున్నాడు. వెకేషన్‌లో ఉన్నాడు. అయినా సెలక్టర్లు ఇషాన్‌ను దాటి చూస్తున్నారు. కేఎస్‌ భరత్‌ ఉండగా ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌కు ఇషాన్‌ను ఎంపిక చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ అనే కాదు సమీప భవిష్యత్‌లో మూడు ఫార్మాట్లలోనూ ఇషాన్‌ జట్టులోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వన్డేలతో పాటు టెస్టుల్లోనూ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా ఉన్నాడు. టీ20ల్లో జితేశ్‌ వైపు చూస్తున్నారు. పంత్‌ కోలుకుని వస్తే అప్పుడు అతనే వికెట్‌ కీపర్‌ అవుతాడు. దీంతో 25 ఏళ్ల ఇషాన్‌ కెరీర్‌ ఇప్పుడే ప్రమాదంలో పడిందనే చెప్పాలి. ఇప్పటివరకూ టీమ్‌ఇండియా తరపున 32 టీ20లు ఆడిన అతను 25.67 సగటుతో 796 పరుగులు మాత్రమే చేశాడు. గత 10 ఇన్నింగ్స్‌లో అయితే కేవలం 17 సగటుతో 170 పరుగులే సాధించాడు. తిరిగి పుంజుకుని, జట్టులోకి వచ్చేందుకు ఐపీఎల్‌ రూపంలో ఇషాన్‌కు అవకాశం ఉంది. మరి మార్చిలో ఆరంభమయ్యే ఈ లీగ్‌ అతని కెరీర్‌కు అత్యంత కీలకమైందనే చెప్పాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని