Ishan Kishan: హార్దిక్‌కు సవాళ్లంటే ఇష్టం.. ప్రేక్షకులు హేళన చేయడంపై ఇషాన్ కిషన్‌

హార్దిక్‌ పాండ్యతో (Hardik Pandya) కలిసి ఐపీఎల్‌కు ముందు నుంచే ఇషాన్‌ కిషన్ సాధన చేసిన సంగతి తెలిసిందే. అతడి మెంటాలిటీపై పూర్తి అవగాహన ఉంది.  

Published : 12 Apr 2024 16:33 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి జట్టు సారథిగా ప్రస్తుత ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ నుంచి ప్రేక్షకుల నుంచి హేళనలను హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఎదుర్కొంటున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగానూ ఇలాంటి తప్పడం లేదు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆడిన సమయంలోనూ పాండ్యను ఉద్దేశించి దారుణంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా బెంగళూరుతో మ్యాచ్‌లోనూ హార్దిక్‌ను హేళన చేయడంపై విరాట్ కోహ్లీ  (Virat Kohli) కూడా స్పందించాడు. అలాంటివి సరికాదని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు. ఆ సంఘటలనపై ముంబయి బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించాడు. బెంగళూరుపై ఇషాన్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు.

‘‘హార్దిక్‌ పాండ్య మైదానంలో, వెలుపలా నిరంతరం శ్రమిస్తుంటాడు. ప్రేక్షకుల నుంచి వచ్చే వ్యాఖ్యలను పట్టించుకోడు. అతడికి సవాళ్లంటే చాలా ఇష్టం. ఇలాంటి పరిస్థితిని గతంలోనూ అనుభవించాడు. వాటిపై బయటకొచ్చి స్పందించే రకం కాదు. తప్పకుండా అతడూ దీనిని ఆస్వాదిస్తుంటాడు. ఐపీఎల్‌ సందర్భంగా పాండ్యతో చాలా సమయం గడుపుతున్నా. అభిమానుల మీద ఫిర్యాదు చేసే రకం కాదు. తప్పకుండా వారిలోనూ మార్పు వస్తుందని భావిస్తున్నా. రానున్న మ్యాచుల్లో బ్యాట్‌, బాల్‌తో అభిమానులను ఆకట్టుకుంటాడు’’ అని ఇషాన్‌ తెలిపాడు. 

నెట్‌రన్‌రేట్‌ అత్యంత కీలకం: హార్దిక్ పాండ్య

బెంగళూరుపై విజయం సాధించడంలో బుమ్రాతోపాటు టాప్‌ ఆర్డర్‌దే కీలక పాత్ర అని ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్య వ్యాఖ్యానించాడు. ‘‘వరుసగా రెండో విజయం నమోదు చేయడం బాగుంది. మళ్లీ మేము రేసులోకి వచ్చాం. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల అదనంగా బౌలర్‌ లేదా బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటు కలిగింది. రోహిత్-ఇషాన్‌ కిషన్ శుభారంభం ఇవ్వడంతో మిగిలిన పని తేలికైంది. నెట్‌రన్‌రేట్‌ అత్యంత కీలకం. దీంతో సూర్య కుమార్‌ యాదవ్‌తో కలిసి దూకుడుగా ఆడాను. ఈ సీజన్‌లో అతడు ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఇప్పుడు అద్భుతమైన అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చాడు. బౌలింగ్‌లో మా వైపు బుమ్రా ఉండటం సగం బలం. ప్రతి ఓవర్‌లోనూ వైవిధ్యం ప్రదర్శించడం అతడి స్పెషల్’’ అని హార్దిక్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని