Afghanistan: అప్పుడలా కనుమరుగై.. ఇప్పుడిలా తెరపైకి

అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు చాలా ఏళ్ల నుంచే తమదైన ముద్ర వేస్తున్నారు. పసికూన ముద్ర తొలగించుకుని ఒక స్థాయి అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) మాత్రం వారి ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి..

Updated : 05 Nov 2023 15:38 IST

అఫ్గానిస్థాన్‌ మెరుపులతో ట్రాట్, అజయ్‌ జడేజాలపై చర్చ

వాళ్లిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లే. తమ జట్లలో కీలక ఆటగాళ్లుగా కొన్నేళ్లు ఒక వెలుగు వెలిగిన వారే. కానీ వారి కెరీర్‌ అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆట నుంచి వాళ్లిద్దరూ తప్పుకొన్న కారణాలు అనూహ్యమైనవే. అప్పుడలా తెరమరుగైన ఆ ఆటగాళ్ల గురించి చాలా ఏళ్లు చర్చే లేదు. అయితే ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా ఆ ఇద్దరి పేర్లు చర్చనీయాంశం అయ్యాయి. వారి పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఆ ఇద్దరే.. జొనాథన్‌ ట్రాట్, అజయ్‌ జడేజా.

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టుది అత్యుత్తమ ప్రదర్శన కాగా.. అత్యంత ఆశ్చర్యకర మెరుగైన ప్రదర్శన అంటే అఫ్గానిస్థాన్‌దే. అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు చాలా ఏళ్ల నుంచే తమదైన ముద్ర వేస్తున్నారు. పసికూన ముద్ర తొలగించుకుని ఒక స్థాయి అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం వారి ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌నే కాక పాకిస్థాన్, శ్రీలంకలనూ అలవోకగా ఓడించి ప్రకంపనలు రేపింది అఫ్గాన్‌. ఆ జట్టు ప్రదర్శన ఇంతగా మెరుగవవడం, ప్రపంచకప్‌లో ఇంత బాగా ఆడుతుండటంలో ప్రధాన కోచ్‌ జొనాథన్‌ ట్రాట్, మెంటార్‌ అజయ్‌ జడేజాల పాత్ర కీలకమని జట్టు వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ట్రాట్‌ కోచ్‌గా పగ్గాలందుకున్నప్పటి నుంచి అఫ్గాన్‌ బ్యాటింగ్‌ మెరుగవుతూ వస్తోంది. ఇక భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ కోసం అజయ్‌ జడేజాను మెంటార్‌గా నియమించుకోవడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చినట్లు భావిస్తున్నారు. భారత్‌లో పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఉత్తమ ప్రదర్శన చేయడంలో అజయ్‌ తనవంతు తోడ్పాటునందిస్తున్నాడు. ట్రాట్, జడేజా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన కారణాలు భిన్నమైనవి.

ట్రాట్‌ అలా..

దక్షిణాఫ్రికా క్రికెట్లో అవకాశాలు దక్కక ఆ దేశ ఆటగాళ్లు ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌ లాంటి జట్లకు ఆడటం కొత్తేమీ కాదు. కెవిన్‌ పీటర్సన్‌ సహా చాలామంది ఆటగాళ్లు ఈ కోవలో కనిపిస్తారు. ట్రాట్‌ కూడా ఆ జాబితాకు చెందిన వాడే. యుక్త వయసులో అతను ఇంగ్లాండ్‌కు మారిపోయాడు. అక్కడ కౌంటీల్లో ఆడుతూ.. తర్వాత ఇంగ్లాండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు. 2019-13 మధ్య ఇంగ్లిష్‌ జట్టులో అతను కీలక ఆటగాడిగా ఉన్నాడు. టాప్‌ఆర్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. తన మీడియం పేస్‌తోనూ జట్టుకు ఉపయోగపడేవాడు. 52 టెస్టులు ఆడిన ట్రాట్‌.. 44.08 సగటుతో 3835 పరుగులు చేయడం విశేషం. 68 వన్డేలాడి 51.25 సగటుతో 2819 పరుగులు సాధించాడు. ఇంత చక్కటి ప్రదర్శనతో జట్టులో ఉత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న అతను.. 2013లో యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా అర్ధంతరంగా జట్టు నుంచి తప్పుకొన్నాడు. మానసిక సమస్యల కారణంగా ఆట మీద దృష్టిసారించలేకపోవడమే అందుక్కారణం. ఈ కారణంతో రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు. 2015లో ఇంగ్లాండ్‌ జట్టులోకి పునరాగమనం చేసినా ఫామ్‌ అందుకోలేకపోయాడు. అతడి సమస్య కూడా పునరావృతమైంది. దీంతో రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు. కొన్నేళ్ల తర్వాత అతను కోచింగ్‌లోకి వచ్చాడు. నిరుడు అఫ్గానిస్థాన్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలందుకున్నాడు. అఫ్గాన్‌ బౌలింగ్‌లో ముందు నుంచి మెరుగే కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం బలహీనమే. ట్రాట్‌ వచ్చాక ఆ విభాగంలోనూ ఆ జట్టు బలపడింది. టోర్నీలో నిలకడగా విజయాలు సాధించడంలో బ్యాటర్ల పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఆ జట్టును ట్రాట్‌ చక్కగా నడిపిస్తున్నాడు.

అజయ్‌ ఇలా..

90వ దశకంలో భారత క్రికెట్‌ను అనుసరించిన వారికి అజయ్‌ జడేజా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992, 1996 వన్డే ప్రపంచకప్‌ల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ విజయాల్లో అతడి పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా 1996లో 25 బంతుల్లో 45 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌ అప్పట్లో ఓ సంచలనం. ప్రపంచకప్‌ అనే కాక 90వ దశకంలో భారత జట్టులో జడేజా పాత్ర కీలకం. రాబిన్‌ సింగ్‌తో కలిసి మిడిలార్డర్‌ భారాన్ని మోసింది అతనే. ఉపయుక్తమైన పేస్‌ బౌలింగ్‌తోనూ జడేజా తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో పెద్దగా రాణించ‌లేక‌పోయిన అజ‌య్ ఆ ఫార్మాట్లో 15 మ్యాచ్‌లే ఆడాడు. కానీ వ‌న్డేల్లో అత‌ను కీల‌క ఆట‌గాడే. 196 మ్యాచ్‌లు ఆడి 37.47 స‌గ‌టుతో 5359 ప‌రుగులు చేశాడు. 20 వికెట్లు కూడా తీశాడు. జ‌డేజా ఆ రోజుల్లో ఉత్తమ ఫీల్డర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. 1999 ప్రపంచకప్‌లోనూ ఆడిన అజయ్‌.. 2000లో భారత క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకున్నాడు. అజహరుద్దీన్‌తో పాటు జడేజా మీదా ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో వీళ్లిద్దరిపై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. తర్వాత జడేజాపై నిషేధాన్ని అయిదేళ్లకు తగ్గించారు. కేసు నిలవకపోవడంతో తర్వాత బీసీసీఐ నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసింది. కానీ అజయ్‌ తిరిగి భారత జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. చాలా ఏళ్లు అతను క్రికెట్‌ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కూడా భాగం కాలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో నటించిన జడేజా.. 2015లో దిల్లీ జట్టుకు కోచ్‌ అయ్యాడు. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌కు ప్రపంచకప్‌లో మెంటార్‌గా వ్యవహరిస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక్కడి పరిస్థితులను ఆ జట్టు బాగా ఉపయోగించుకోవడంలో అజయ్‌ అనుభవం బాగా ఉపకరిస్తోంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని