Chris Gayle: ఆర్సీబీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రిస్‌గేల్‌: జెర్సీ ఇంకా ఫిట్‌గానే ఉందన్న యూనివర్స్‌ బాస్‌

ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్‌గేల్‌ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్‌నే అని వెల్లడించాడు.

Updated : 19 May 2024 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ఫార్మాట్‌లో క్రిస్‌గేల్‌ పేరు చెబితే ఎంతటి బౌలర్‌కైనా ముచ్చెమటలు పట్టాల్సిందే. ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో అతడు సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోవడానికి మరో దశాబ్దం పడుతుందేమో. తాజాగా ఈ యూనివర్స్‌ బాస్‌ అవసరమైతే ఆర్సీబీ తరఫున ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడటానికి సిద్ధమే అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది.

బెంగళూరులో ఆర్సీబీ జట్టు చైన్నైను ఓడించి.. ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌ సమయంలో గేల్‌ మ్యాచ్‌ చూస్తూ.. మైదానంలోనే ఉన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మీరు చూస్తున్నారుగా.. నా జెర్సీ ఇంకా ఫిట్‌గానే ఉంది. వాళ్లకు (ఆర్సీబీ) అదనపు ఆటగాడు కావాలంటే నేను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడతాను (సరదాగా నవ్వుతూ). ఫ్యాన్స్‌ను చూడటం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఎప్పటికీ ఆర్సీబీ అభిమానినే. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం బాగుంటుంది. కీలక మ్యాచ్‌లో మా కుర్రాళ్లు రాణించడంతో హ్యాపీగా ఉంది. ఈ సమయంలో చిన్నస్వామి మైదానంలో ఉండటం నాకు చాలా ప్రత్యేకం. ఈ గ్రౌండ్‌ పైకప్పు కొత్తగా ఉండటాన్ని గమనించాను. గతంలో దానిని నేను చాలా ధ్వంసం చేశాను. ఇప్పుడు ఎవరైనా బంతిని దానికి కొట్టి ఫ్యాన్స్‌ను యూనివర్స్‌ బాస్‌ వలే ఎంటర్‌టైన్‌ చేస్తారని ఆశిస్తున్నాను. క్రికెట్‌ ఆడటానికి ఇది అద్భుతమైన ప్లేస్‌’’ అని గేల్‌ పేర్కొన్నాడు. ఈ వీడియోను ఆర్సీబీ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. 

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును గేల్‌ ఇదే మైదానంలో సృష్టించాడు. ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. 2013లో పుణె వారియర్స్‌పై కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేశాడు. లీగ్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు.. 17 సిక్సర్లతో బౌలర్లను గజగజలాడించాడు. 2024 సీజన్‌ ఆరంభంలో ఆర్సీబీ తొలి ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని