Jos Buttler: రాజస్థాన్‌ ఫైనల్‌ చేరాలంటే.. ఈ ఆటగాళ్లు మెరవాల్సిందే..

రాజస్థాన్‌ ఈసారి ప్లేఆఫ్స్ చేరిందంటే ప్రధాన కారణం జోస్‌ బట్లర్‌, యుజ్వేంద్ర చాహల్‌. వీరిద్దరూ సీజన్‌ ఆరంభంలో దుమ్మురేపి ఆ జట్టుకు తొలి 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు అందించారు...

Updated : 24 May 2022 13:21 IST

గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..?

రాజస్థాన్‌ ఈసారి ప్లేఆఫ్స్ చేరిందంటే ప్రధాన కారణం జోస్‌ బట్లర్‌, యుజ్వేంద్ర చాహల్‌. వీరిద్దరూ సీజన్‌ ఆరంభంలో దుమ్మురేపి ఆ జట్టుకు తొలి 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు అందించారు. దీంతో రాజస్థాన్‌ ఈసారి అంచనాలకు మించి రాణించి నేడు ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌తో తలపడనుంది. కీలక పోరులో వీరితో పాటు మిగతా జట్టు సభ్యులు రాణించాల్సిందే. ఎందుకంటే గతంలో రెండు సార్లు ప్లేఆప్స్‌ చేరినా.. ఫైనల్‌కు వెళ్లలేదు.

బట్లర్‌ మరో శతకం సాధించాలి..

(Photo: Jos Buttler Instagram)

ఈ సీజన్‌లో బట్లర్‌ ఇప్పటివరకు మొత్తం 14 లీగ్‌ మ్యాచ్‌ల్లో 629 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అందులో మూడు శతకాలు, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. సగటు 48.38, స్ట్రైక్‌రేట్‌ 146.96గా ఉన్నాయి. అయితే, ఇందులో 566 పరుగులు తొలి 9 మ్యాచ్‌ల్లోనే సాధించడం గమనార్హం. చివరి ఐదు మ్యాచ్‌ల్లో (2, 2, 7, 30, 22) మొత్తం కలిపి 63 పరుగులే చేశాడు. దీంతో బట్లర్‌ చివరి మ్యాచ్‌ల్లో కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించింది. సీజన్‌ ఆరంభంలో ఎంత బాగా ఆడినా.. ఇప్పుడు కీలక సమయంలో రాణించడం ముఖ్యం.

మిగతా వాళ్లు తలా ఓ చేయి..

(Photo: Sanju Samson Instagram)

లీగ్‌ దశలో ఒకరు కాకపోతే మరొకరు రాణించడంతో రాజస్థాన్‌ ఇక్కడిదాకా వచ్చింది. కానీ, ఇప్పుడు ఆడేది ప్లేఆఫ్స్. దురదృష్టంకొద్దీ టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే కప్పు కల దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో ప్లేఆఫ్స్‌లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. అయితే, బట్లర్‌ ఏ సమయంలో ఎలా రెచ్చిపోతాడో ఎవరూ ఊహించలేరు. ఒకవేళ నేటి మ్యాచ్‌లో మళ్లీ అతడు చెలరేగితే రాజస్థాన్‌కు తిరుగుండదు. ఎందుకంటే.. అతడు సెంచరీలు చేసిన ప్రతిసారీ ప్రత్యర్థులపై ఆ జట్టు విజయాలు సాధించింది. దీన్ని బట్టి బట్లర్‌ మరో శతకం సాధిస్తే రాజస్థాన్‌కు ఫైనల్లో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అతడు విఫలమైతే.. పడిక్కల్‌, శాంసన్‌, హెట్‌మెయర్‌, రియాన్‌ పరాగ్‌, అశ్విన్‌ లాంటి ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్లంతా కొన్ని మ్యాచ్‌ల్లో అర్థ శతకాలతో రాణించిన వారే. ఈ నేపథ్యంలో ఈరోజు రాజస్థాన్‌ గెలవాలంటే పరుగుల వరద పారాల్సిందే.

చాహల్‌ మరో మ్యాజిక్‌ ఫిగర్‌..

(Photo: Yuzvendra Chahal Instagram)

బట్లర్‌ లాగే చాహల్‌ సైతం సీజన్‌ ఆరంభంలో అదిరిపోయే బౌలింగ్‌ చేశాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో 7.09 ఎకానమీతో 18 వికెట్లు తీశాడు. అందులో ఒకసారి ఐదు, ఒకసారి నాలుగు, మరోసారి మూడు వికెట్ల ప్రదర్శన చేశాడు. కానీ, చివరి 6 మ్యాచ్‌ల్లో రెండు సందర్భాల్లోనే మెరిశాడు. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో నామమాత్రంగా రాణించాడు. అదే సమయంలో ఎకానమీ(8.45) సైతం కాస్త పెరిగినట్లు అనిపిస్తోంది. అయితే, చాహల్‌ ప్రదర్శన మరీ అంత పేలవమైంది కాదు. దీంతో రాజస్థాన్‌ కంగారు పడాల్సిన పనిలేదు. ఇక లీగ్‌ స్టేజ్‌లో చాహల్‌ ఎక్కువ వికెట్లు తీసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అతడు మళ్లీ మెరిస్తే.. గుజరాత్‌కు ఇబ్బందులు తప్పవు.అతడికి తోడు ప్రసిద్ధ్‌ కృష్ణ (15), ట్రెంట్‌ బౌల్ట్‌ (13), రవిచంద్రన్‌ అశ్విన్‌ (11) సైతం రాణిస్తే రాజస్థాన్‌కు మరింత మంచిది.

ఈ మెగా టోర్నీ తొలి విజేతగా నిలిచిన రాజస్థాన్‌ జట్టు.. 2013, 2015లో ప్లేఆప్స్‌ వరకూ వెళ్లినా ఫైనల్‌కు చేరుకోలేదు. దీంతో ఈసారైనా తుదిపోరుకు చేరి మరోసారి కప్‌ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని