Jos Buttler: మన మనస్సే అత్యంత శక్తిమంతం.. అదృష్టమూ కలిసిరావాలి: జోస్ బట్లర్

ఐపీఎల్ 17వ సీజన్‌ ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. అందులో ఒకటి విరాట్ కోహ్లీ చేయగా.. మరొకటి జోస్ బట్లర్ బాదాడు. 

Published : 07 Apr 2024 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జైపుర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ (113*) సెంచరీ సాధించాడు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ ఓపెనర్ జోస్ బట్లర్ (100*) శతకంతో జట్టును గెలిపించాడు. గత సీజన్‌లో మొత్తం 10 మ్యాచుల్లో 183 పరుగులు  మాత్రమే సాధించాడు. అందులో మూడు డక్‌లూ ఉన్నాయి. ఈ ఎడిషన్‌లోనూ పెద్దగా రాణించలేదు. తాజాగా సెంచరీతో మళ్లీ ఫామ్‌ అందుకొన్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాక జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ ఈ మ్యాచ్‌లో కాస్త అదృష్టమూ కలిసొచ్చింది. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి ముగించడం బాగుంది. మ్యాచ్‌లు ఆడినంత కాలం ఒత్తిడి, ఆందోళన తప్పదు. మన మనస్సు చాలా శక్తిమంతం. దానిని అదుపులో ఉంచుకుని.. తీవ్రంగా శ్రమించాలి. అదే సమయంలో కాస్త లక్‌ కూడా కావాలి. కొన్నిసార్లు విఫలమైనప్పుడు మనకి మనం సర్దిచెప్పుకోగలగాలి. గత మ్యాచ్‌లోనూ బాగానే ఆడినప్పటికీ త్వరగా (13పరుగులకే) ఔటయ్యా. ఈ లీగ్‌కు ముందు దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో బాగానే ఆడా. ఇప్పుడు ఒక్కసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడితే చాలు.. లైన్‌లోకి రావచ్చని భావించా. మేం ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాం. ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తాం’’ అని జోస్ బట్లర్ తెలిపాడు. 

ఏదైనా జరగొచ్చని ముందే భావించాం: సంజూ శాంసన్

‘‘మంచు ప్రభావం ఉన్నప్పుడు 190 పరుగులు టార్గెట్‌ పెద్ద కష్టమేం కాదు. కానీ, ఏదైనా జరిగొచ్చు. మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ అత్యంత బలంగా ఉంది. ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాం. మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మా బౌలర్లు అద్భుతంగా వేశారు. తదుపరి మ్యాచ్‌కు మాకు చాలా సమయం ఉంది. కాస్త రీఛార్జ్‌ అవుతాం. రాజస్థాన్‌ బౌలింగ్‌కు 9, బ్యాటింగ్‌కు 8.7 రేటింగ్‌ ఇస్తా. అదీనూ జోస్ బట్లర్ వల్ల సాధ్యమైంది’’ అని రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. 

మరో 15 పరుగులు చేయాల్సింది: డుప్లెసిస్‌

‘‘విరాట్‌తో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడే పిచ్‌ చాలా క్లిష్టంగా ఉందని అర్థమైంది. 190 పరుగులు మంచి టార్గెట్‌ అవుతుందని భావించా. కనీసం మరో 15 పరుగులైనా చేస్తామని భావించా. విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా ఆడాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాం. కానీ, పిచ్‌ వల్ల పరుగులు చేయడం కష్టంగానే మారింది. చాలా బంతులు బ్యాట్‌కు అడుగున తాకాయి. బౌలింగ్‌లో మా బౌలర్లు తొలి నాలుగు ఓవర్లు బాగానే వేశారు. ఒక్క ఓవర్‌లో 20 పరుగులు ఇచ్చేయడంతో మాపై ఒత్తిడి పెరిగింది’’ అని బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్‌ తెలిపాడు. 

మరికొన్ని విశేషాలు..

  • ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు దక్కించుకున్న క్రికెటర్‌గా జోస్ బట్లర్ నిలిచాడు. మొత్తం 11 అవార్డులను దక్కింది. అజింక్య రహానె (10) ఆ తర్వాత స్థానంలో నిలిచాడు. 
  • ఐపీఎల్‌లో జైపుర్‌ వేదికగా జరిగిన మ్యాచుల్లో నాలుగో అత్యధిక లక్ష్య ఛేదన (184) ఇదే కావడం విశేషం. బెంగళూరుపై రెండో అత్యధిక టార్గెట్‌ కూడా ఇదే. గతంలో (2014) 191 పరుగులను రాజస్థాన్‌ ఛేదించింది.
  • 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాటర్ జోస్ బట్లర్ (100*). లఖ్‌నవూ ఆటగాడు కేఎల్ రాహుల్ (103*) ముంబయిపై సెంచరీ సాధించాడు. 
  • ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (8) కొనసాగుతున్నాడు. క్రిస్‌ గేల్ (6), జోస్‌ బట్లర్ (6) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఓడిన మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ విరాట్ కోహ్లీనే (3).  
  • ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (110) రికార్డు సృష్టించాడు. సురేశ్‌ రైనా (109)ను అధిగమించాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని