Ankita Bhakat: నాన్న పాలు అమ్మితే.. కష్టాలకు ఓర్చి పతకం గెలిచిన అంకిత

ఆసియా క్రీడల్లో ఆర్చరీలో మహిళల టీమ్‌ విభాగంలో కాంస్యం గెలిచిన అంకిత బాకత్‌ది భిన్నమైన నేపథ్యం. మధ్య తరగతి నుంచి వచ్చిన ఆమె ఎన్నో కష్టాలను ఓర్చుకున మరీ పతకాలను సొంతం చేసుకుంది.

Updated : 18 Jul 2024 14:22 IST

విల్లు కొనుక్కునే స్థోమత లేదు.. ఆటలు ఆడే పరిస్థితి లేదు.. రికర్వ్‌ విల్లు పట్టుకోవడం కోసమే ఆరేళ్లు వేచి చూసింది ఆ అమ్మాయి.. ఎట్టకేలకు ప్రభుత్వ సాయంతో ఈ విల్లుతో సాధన చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ఆసియా క్రీడల్లోనే పతకంతో మెరిసింది. ఆ ఆర్చరే అంకిత బాకత్‌. 

ఆసియా క్రీడల్లో ఆర్చరీలో మహిళల టీమ్‌ విభాగంలో కాంస్యం గెలిచిన అంకిత బాకత్‌ది భిన్నమైన నేపథ్యం. కోల్‌కతాకు సమీపంలో బారానగర్‌కు చెందిన అంకితది మధ్య తరగతి కుటుంబం. ఆమె నాన్న బిదాన్‌ పార్క్‌ ప్రాంతంలో పాలు అమ్మేవాడు. కానీ చిన్నప్పటి నుంచి ఆర్చీరీపై ఇష్టాన్ని పెంచుకున్న అంకిత.. ఈ క్రీడలో ఛాంపియన్‌ కావాలని కలలు కనేది. కానీ రూ.2.5 లక్షల విలువుండే రికర్వ్‌ విల్లును కొనేంత స్థోమత ఆమెకు లేదు. ఇందు కోసం ఆరేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. రికర్వ్‌ విల్లు లేకుండా దేశీ విల్లుతోనే జాతీయ క్రీడల్లోనూ పాల్గొంది. తన కెరీర్‌ అంతటితో ఆగిపోతుందని అనుకుంది. 

2014లో ట్రయల్స్‌ ద్వారా టాటా ఆర్చరీ అకాడమీకి ఎంపిక కావడం అంకిత కెరీర్‌లో కీలక మలుపు. అక్కడే ఆమె ఎంతో ఇష్టపడిన రికర్వ్‌ విల్లుతో సాధన చేసింది. ఆ తర్వాత రెండేళ్లలోనే జాతీయ స్థాయికి ఎదిగింది. జాతీయ స్థాయిలో పతకాలు గెలిచింది. భారత్‌ తరఫున ఆసియాకప్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో ఆడింది. టీమ్‌ స్వర్ణాన్నీ అందుకుంది. ఆ తర్వాత ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో రాణించి ఈ క్రీడలకు ఎంపికైంది. టీమ్‌ పతకం గెలిచి సత్తా చాటింది. 

షాట్‌పుట్‌ నుంచి ఆర్చరీకి

అంకితతో కలిసి టీమ్‌లో కాంస్యం నెగ్గిన 18 ఏళ్ల భజన్‌కౌర్‌ది మరో కథ. ఈ హరియాణా అమ్మాయి అసలు ఆరంభంలో ఆర్చరే కాదు. అథ్లెటిక్స్‌లోకి వెళ్లాలని అనుకుంది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో షాట్‌పుట్‌ ఆడేది. ఒక ఏడాది పాటు ఈ క్రీడలో కొనసాగాక.. విజయవంతం కాకపోవడంతో ఆర్చరీకి మారింది. అలా నెమ్మదిగా ఎదిగిన ఆమె.. ఈ ఏడాదే కీలక విజయాలు సాధించింది. 2023 జులైలో యూత్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన భజన్‌.. ఆగస్టులో ప్రపంచకప్‌లో సీనియర్‌ టీమ్‌ కాంస్యం సాధించి సత్తా చాటింది.

టాప్‌సీడ్‌కు షాకిచ్చి..

ఏప్రిల్‌లో టర్కీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్‌ వరకు వెళ్లింది. ఈ క్రమంలో టాప్‌సీడ్‌ వాలెన్సినాకు షాకిచ్చింది. ఆసియా క్రీడల్లోనూ మహిళల జట్టు కాంస్యం గెలవడంలో భజన్‌ కౌర్‌ కీలకపాత్ర పోషించింది. వియత్నాంతో జరిగిన కాంస్య పోరులో 8 షాట్లలో 6సార్లు 10 పాయింట్లు గెలిచి భారత్‌ ఖాతాలో పతకాన్ని చేర్చింది. 13 ఏళ్లలో రికర్వ్‌లో భారత్‌కు వచ్చిన తొలి పతకం ఇదే అంటే ఈ విజయం ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఫైనల్లో చాలా ఒత్తిడికి గురయ్యా. జట్టులో అందరికంటే నేనే చిన్నదాన్ని. అయితే చివరి షాట్లలో గురి తప్పకుండా ఉంటే కచ్చితంగా పతకం వస్తుందని అనుకున్నా. అంకిత, సిమ్రన్‌జీత్‌ కౌర్‌ నన్ను ప్రోత్సహించారు. ఒత్తిడిని పక్కకి నెట్టి వీలైనంత నేరుగా బాణాలను సంధించా. పతకం సొంతమైంది’’ అని భజన్‌కౌర్‌ ఉద్వేగంగా పేర్కొంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని