Kagiso Rabada: డేంజరస్‌ రబాడ.. ఖాతాలో 500 అంతర్జాతీయ వికెట్లు

తొలి టెస్టులో (SA vs IND) దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఐదు వికెట్ల ప్రదర్శన (5/59) చేశాడు. ఇలా భారత్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అవతరించాడు. ఇదే క్రమంలో అంతర్జాతీయంగా 500+ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Published : 27 Dec 2023 17:36 IST

19 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం.. 21 ఏళ్లు వచ్చేసరికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు.. ఇప్పుడు 28 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు. నిలకడైన వేగం.. గురి తప్పని కచ్చితత్వం.. బ్యాటర్లను బోల్తా కొట్టించే వైవిధ్యం.. బుట్టలో వేసుకునే తెలివి.. ఇవన్నీ కలిపితే కగిసో రబాడ (Kagio Rabada). ఈ దక్షిణాఫ్రికా డేంజరస్‌ పేసర్‌ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ అరంగేట్రం నుంచి సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న ఈ సఫారీ ఎక్స్‌ప్రెస్‌ ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. భారత్‌తో టెస్టులో తొలి రోజు అయిదు వికెట్లు సాధించి.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 500 వికెట్ల క్లబ్‌లో రబాడ చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. 

ఆడటం కష్టం

స్వదేశం, విదేశం అని కాదు.. పరిస్థితులతో సంబంధం లేదు.. రబాడ బంతి పట్టుకుని రనప్‌ అందుకున్నాడంటే, అతని బౌలింగ్‌ను ఆడటం కష్టమే. అందుకే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ప్రమాదకర బౌలర్లలో ఒకడిగా అతను మారాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తన బౌలింగ్‌ తీరును అతను మార్చుకునే విధానం రబాడను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇందుకు భారత్‌తో టెస్టు తొలి రోజు ఆటలో అతని బౌలింగే నిదర్శనం. నిలకడగా 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసే అతను.. మంగళవారం అంత వేగం ప్రదర్శించలేదు. పిచ్‌ను అర్థం చేసుకుని, సరైన ప్రదేశాల్లో బంతి వేసి ఫలితం రాబట్టాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌కు ఫుల్‌షాట్‌ అంటే ఫేవరేట్‌. దీన్ని ఎంత బాగా ఆడతాడో తెలిసిందే. కానీ అదే షాట్‌తో అతణ్ని రబాడ బోల్తా కొట్టించాడు. వేగం తగ్గించి, కాస్త బౌన్స్‌తో అతను వేసిన బంతిని పుల్‌ చేయబోయిన రోహిత్‌ డీప్‌లో ఫీల్డర్‌ చేతికి చిక్కాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ను రబాడ ఆరు సార్లు ఔట్‌ చేశాడు. వేగంతో, తక్కువ ఎత్తుతో వచ్చిన బంతి శ్రేయస్‌ స్టంప్స్‌ను ఎగరగొట్టింది. అప్పటివరకూ లోపలికి బౌలింగ్‌ చేసిన రబాడ.. ఓ బంతి బయటకు వేసి కోహ్లీని వెనక్కిపంపించాడు. ఆ తర్వాత బౌన్సర్లతో చెలరేగాడు. 

సంచలన ప్రయాణం 

2014 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల సంచలన ప్రదర్శనతో రబాడ పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన అతను.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది టీ20 అరంగ్రేటం చేశాడు. 2015లో ఓ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో అత్యుత్తమ గణంకాలు (14/105) నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్‌ తీసిన రెండో పేసర్‌గా నిలిచి ఔరా అనిపించాడు. 2015లో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ సహా 6 వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. భారత్‌లోనే టెస్టు సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన రబాడ ఇక ఆగడం లేదు. మోర్నీ మోర్కెల్, స్టెయిన్, ఫిలాండర్‌ గాయాల కారణంగా నిలకడగా అవకాశాలు అందుకున్న రబాడ.. అత్యుత్తమ ప్రదర్శనతో సఫారీ ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. అత్యంత పిన్న వయస్సులో ఓ టెస్టులో 10 వికెట్లు (ఇంగ్లాండ్‌పై 13/144) పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. 

ఎక్కడైనా తగ్గేదేలే

పేసర్లకు స్వర్గధామం లాంటి దక్షిణాఫ్రికా పిచ్‌లపై రబడాను ఎదుర్కోవడం అంటే కదిలే రైలుకు ఎదురు వెళ్లడం లాంటిదే. పేస్, బౌన్స్, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై రబాడ అత్యంత ప్రమాదకారిగా మారతాడు. అతను సంధించే బుల్లెట్‌ బంతులకు బ్యాటర్ల దగ్గర సమాధానమే ఉండటం లేదు. గాయాలతో మధ్యలో కెరీర్‌ కాస్త నెమ్మదించినా.. మైదానంలో దిగిన ప్రతిసారి తనదైన శైలిలో చెలరేగిపోవడం అతనికి అలవాటు. భారత్‌తో మ్యాచ్‌ ముందువరకూ 60 టెస్టు (108 ఇన్నింగ్స్‌)ల్లో 22.34 సగటుతో రబాడ 280 వికెట్లు పడగొట్టాడు. ప్రతి 39 బంతులకో వికెట్‌ సాధించాడు. 101 వన్డేల్లో 27.77 సగటుతో 157 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ప్రతి 32 బంతులకో వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇక 56 టీ20ల్లో 58 వికెట్లు సాధించాడు. సగటు 29.87గా ఉంది. అయితే ఇతర దేశాల్లోనూ రబాడ అదే స్థాయిలో రాణించడం విశేషం. ప్రత్యర్థి దేశాల్లో ఆడిన 29 టెస్టుల్లో 27.19 సగటుతో 107 వికెట్లు సాధించాడు. 34 వన్డేల్లో 62 వికెట్లు పడగొట్టాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని