RCB: అతడి నుంచి ఫోన్‌ వచ్చింది.. సంభ్రమాశ్చర్యానికి గురయ్యా!: కేదార్

వెటరన్ ప్లేయర్‌ కేదార్ జాదవ్‌కు (Kedar Jadhav) చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో (IPL 2023) ఆడేందుకు అవకాశం వచ్చింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులోకి ఆహ్వానం వచ్చింది. తుది జట్టులో అవకాశం వస్తే మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తానని చెప్పాడు.

Published : 04 May 2023 21:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది జరిగిన ఐపీఎల్‌ (IPL) మినీ వేలంలో అన్‌సోల్డ్‌..  ఇక క్రికెట్ కెరీర్‌ ముగిసిందని వ్యాఖ్యాతగా మారిపోయాడు. కట్‌ చేస్తే.. ఐపీఎల్‌లో అత్యంత ఫ్యాన్‌బేస్‌ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి పిలుపొచ్చింది. అదీనూ మిడిలార్డర్‌ను బలోపేతం చేస్తాడనే నమ్మకం ఉందని ఆ ఫ్రాంచైజీనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఇంతకీ ఆ సీనియర్‌ మోస్ట్ ఆటగాడు ఎవరని మీ డౌటు.. అతడే 38 ఏళ్ల కేదార్‌ జాదవ్‌. ఇంతకుముందు ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా అనిపిస్తోందా..? 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు, అంతకుముందు రెండేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాడు. గతంలో 2016, 2017 సీజన్లలోనూ కేదార్‌ ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు మళ్లీ ఆర్‌సీబీ గూటికే చేరాడు. డేవిడ్ విల్లే స్థానంలో కేదార్‌ను ఆర్‌సీబీ తీసుకుంది. ఈ క్రమంలో తాను ఆర్‌సీబీ జట్టులోకి మళ్లీ ఎలా వచ్చాననే విషయాలను వెల్లడించాడు. ఆ వీడియోను ఆర్‌సీబీ తన యూ ట్యూబ్‌లో ఉంచింది. 

ఇటీవల రంజీ ట్రోఫీలో 92.5 సగటుతో పరుగులు రాబట్టిన కేదార్‌ రాకతో తమ మిడిలార్డర్‌ బలోపేతం కావడం ఖాయమని ఆర్‌సీబీ భావిస్తోంది. ‘‘ఆర్‌సీబీ జట్టులోకి పిలుపు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆనందంగానూ ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు బెంగళూరు ఫ్రాంచైజీకి, సహాయ సిబ్బందికి నా ధన్యవాదాలు. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్‌లో 110 శాతం కష్టపడతా’’ అని కేదార్ చెప్పాడు. 

క్రికెట్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా చేస్తున్నప్పుడు ‘కోచ్‌ సంజయ్ బంగర్ కాల్ చేశాడు. ఏం చేస్తున్నావని అడిగాడు. నేను ఇలా కామెంట్రీ చేస్తున్నా ’ అని చెప్పా. 

బంగర్: ‘ప్రాక్టీస్‌ చేస్తున్నావా..?’ 

కేదార్: ‘వారానికి రెండు రోజులు చేస్తున్నా. జిమ్‌కు వెళ్తూ ఫిట్‌నెస్‌ కూడా కాపాడుకుంటూ ఉన్నా’ అని చెప్పా. కాసేపు మళ్లీ ఫోన్‌ చేస్తానని కట్‌ చేశాడు.

‘‘కాసేపటికి బంగర్ ఫోన్ చేసి ‘నువ్వు ఆర్‌సీబీ తరఫున ఆడాలి’ అని చెప్పడంతో ఒక్కసారి ఆశ్చర్యపోయా. దాదాపు సంవత్సరంపైగా ఆటకు దూరంగా ఉన్నా. తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడా. నాకు చాలా అనుభవం ఉంది. 20ఏళ్ల వయసులో ఎలాంటి పరుగుల ఆకలి ఉందో.. ఇప్పుడూ అలానే ఉన్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా’’ అని కేదార్‌ తెలిపాడు. తుది జట్టులో అవకాశం వస్తే అజింక్య రహానెలా కేదార్‌ కూడా చెలరేగిపోవాలని ఆర్‌సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని