West Indies: విండీస్‌ క్రికెట్ పతనానికి కారకులు ఎవరు?

48 ఏళ్ల వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) చరిత్రలో తొలిసారి ఓ ఛాంపియన్‌ లేకుండానే మెగా టోర్నీ జరగనుంది. వరుసగా రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆ జట్టు ఇప్పుడు అర్హత కూడా సాధించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 

Updated : 06 Jul 2023 11:28 IST

బ్యాటర్లను వణికించే బౌలర్లు.. ప్రత్యర్థులను హడలెత్తించే బ్యాటర్లు ఆ జట్టు సొంతం.. క్లైవ్‌ లాయిడ్‌, సర్‌ గ్యారీ ఫీల్డ్‌ సోబెర్స్, వివియన్‌ రిచర్డ్స్‌, గార్డన్‌ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, రిచీ రిచర్డ్‌సన్, ఆంబ్రోస్, కోట్నీవాల్ష్, మాల్కం మార్షల్‌, మైఖెల్‌ హోల్డింగ్స్‌.. వీరి పేర్లను వింటేనే ప్రత్యర్థులు భయపడేవారు. నేటితరం క్రికెట్ అభిమానులు వారి ఆటను చూసి ఉండకపోవచ్చు. అయితే, కపిల్‌ సేనపై వచ్చిన ‘83’ సినిమాలో విండీస్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు వచ్చేటప్పటి సీన్లు గుర్తున్నాయి కదా.. వారు క్రీజ్‌లోకి వస్తుంటేనే అభిమానులు, ఆటగాళ్లు భయపడే సన్నివేశాల వలే వాస్తవ పరిస్థితి ఉండేది. ఇవాళ ఎవరు విరుచుకుపడతారు.. ఎవరిని కుప్పకూలుస్తారనే చర్చ సాగేది. అలాంటి భీకర ఆటగాళ్ల వారసత్వాన్ని బ్రయన్‌ లారా, శివ్‌నారయణ్‌ చందర్‌పాల్‌, క్రిస్‌ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్‌ పొలార్డ్, రస్సెల్‌ కొన్నాళ్లు కొనసాగించారు. ఆ తర్వాత క్రమంగా విండీస్ వెలుగులు మసకబారాయి. 

రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లను సొంతం చేసుకున్న ఘన చరిత్ర విండీస్‌కుంది. అయితే.. ఈ సారి వన్డే ప్రపంచకప్‌ అర్హత కూడా సాధించలేని దుస్థితికి దిగజారింది. ఇంతటి ఘోర పరిస్థితి రావడానికి ప్రధాన కారణం మాత్రం ఆ బోర్డు పెద్దలు వ్యవహరించిన తీరేనన్న విమర్శలున్నాయి. కొన్నాళ్లుగా సీనియర్‌ ఆటగాళ్లను పక్కన పెట్టేసి మరీ కఠినంగా వ్యవహరించింది. లీ‌గ్ క్రికెట్‌కు అలవాటుపడిన వారిని జాతీయ జట్టుకు ఆడేలా ప్రోత్సహించడంలో ఘోరంగా విఫలమైంది. ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోతున్న బోర్డుపై బాహాటంగానే వ్యతిరేకతను ప్రదర్శించే స్థాయికి ఆటగాళ్లు వెళ్లారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విండీస్‌ పతనానికి ప్రధాన కారణాల్లో ఇవి కూడా ఉంటాయి..

  • ఒక్కసారి 2015లోకి వెళ్తే.. విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తమ క్రికెట్ బోర్డు తీరుపై విమర్శలు గుప్పించాడు. క్రికెట్‌ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని, ఆటను నాశనం చేసేలా బోర్డు పెద్దలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించాడు. మైదానాల్లో సరైన వసతులు కల్పించడంలేదని, ఆటగాళ్లు-బోర్డుకు మధ్య సంబంధాలు పడిపోయాయని పేర్కొన్నాడు. ఇవన్నీ తమ జాతీయ జట్టు పతనానికి దారితీస్తుందని అప్పుడే జోస్యం చెప్పాడు. 
  • ఆర్థిక సమస్యలు విండీస్‌ క్రికెట్‌ బోర్డును అతలాకుతలం చేశాయి. దీంతో 2012లోనే విండీస్‌ బోర్డు డైరెక్టర్‌గా క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్‌ వైదొలగడం సంచలనం రేపింది. తమ జట్టు మనుగడ అత్యంత కష్టంగా మారిందని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ‘చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌ అయిన నాకు దేశ క్రికెట్‌ పరిస్థితిని చూస్తే బాధేస్తోంది. ఆర్థిక విషయాల్లో జవాబుదారీతనం లేకపోవడం, క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి’ అని లాయిడ్‌ అన్నాడంటే నాటి విండీస్‌ క్రికెట్ పరిస్థితేంటో అర్థమైపోతుంది. బోర్డుపై రాజకీయ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందనేందుకు ఇదొక ఉదాహరణ. 
  • గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఆల్‌రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆ సందర్భంగా చీఫ్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్‌ చేసిన వ్యాఖ్యలు సీనియర్ల క్రికెటర్లను నొప్పించాయి. రస్సెల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, అందుకే జట్టులోకి తీసుకోలేదని వ్యాఖ్యానించాడు. జాతీయ జట్టు తరఫున ఆడేందుకు ఆసక్తిగాలేనని నరైన్‌ చెప్పినట్లు పేర్కొన్నాడు. బోర్డు సభ్యుల ఇటువంటి ప్రవర్తన సీనియర్లలో అసంతృప్తిని పెంచింది.
  • విండీస్‌ క్రికెటర్లకు సరైన వేతనాలను చెల్లించడంలో బోర్డు ఘోరంగా విఫలమైంది. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్‌ విస్తృతమైంది. దీంతో  క్రిస్‌ గేల్, కీరన్ పొలార్డ్, రస్సెల్, డారెన్ సామీ, సునీల్ నరైన్ వంటి స్టార్‌ ఆటగాళ్లు జట్టును వీడారు. లీగ్‌ క్రికెట్‌ వైపు మొగ్గు చూపారు. దీంతో జట్టులోకి వచ్చిన కొత్తతరం ఆటగాళ్లు ఎక్కువ కాలం కుదురుగా లేరు. దీనికి మంచి ఉదాహరణ నికోలస్‌ పూరన్‌. అతడికి గత ఐపీఎల్‌లోనే దాదాపు రూ.16 కోట్ల మొత్తం అందింది. అదే విండీస్‌ బోర్డు నుంచి కేవలం రూ.2 కోట్లను మాత్రం దక్కుతుంది.

ఇప్పుడు ఏమైంది? 

ఇప్పుడున్న జట్టులోనూ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. బ్రాండన్‌ కింగ్, ఛార్లెస్‌, కెప్టెన్ షై హోప్‌, కేల్‌ మేయర్స్, నికోలస్‌ పూరన్, అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్‌తో కూడిన జట్టు బలమైందే. కానీ, మాజీ క్రికెటర్ ఇయాన్‌ బిషప్ చెప్పినట్లుగా విండీస్‌ పతనం ఇప్పటికిప్పుడు జరగలేదని.. గత పదేళ్లుగా పెద్ద టీమ్‌లపై నాసిరకం ఆటతీరు ప్రదర్శించినప్పుడే మొదలైందని వ్యాఖ్యానించాడు. కేవలం ఆర్థిక సంక్షోభం నెపం సరికాదని, ఇంతకంటే తక్కువ వనరులున్న జింబాబ్వే మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఇప్పుడున్న జట్టులో టెస్టు ఫార్మాట్ ఆడే నైపుణ్యం కొరవడిందని, ఇది ఇతర ఫార్మాట్లపైనా పడిందని తెలిపాడు. భవిష్యత్తులోనైనా జట్టు పరిస్థితి మెరుగుపడాలంటే బోర్డుపై రాజకీయ పెత్తనం లేకుండా చేయడంతోపాటు క్రికెటర్లకు ఆర్థికపరమైన భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని