Shreyas Iyer: ఎదురులేని జట్టుగా కనిపించింది: శ్రేయస్‌

ఐపీఎల్‌-17లో టోర్నీ ఆసాంతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అజేయ జట్టుగా కనిపించిందని ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు.

Published : 28 May 2024 02:49 IST

కోల్‌కతా: ఐపీఎల్‌-17లో టోర్నీ ఆసాంతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అజేయ జట్టుగా కనిపించిందని ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. ‘‘ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచాక ఆ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కోల్‌కతా ఈ సీజన్‌ మొత్తం ఎదురులేని జట్టుగా కనిపించింది’’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతాను విజేతగా నిలబెట్టిన శ్రేయస్‌ గత కొన్ని నెలలుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. శారీరకంగానే కాక మానసికంగానూ ఇబ్బంది పడ్డాడు.. వెన్ను గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కోలుకునే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఒక దశలో అసలు ఐపీఎల్‌ ఆడతాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయాడు. చివరికి ముంబయి తరఫున రంజీ ట్రోఫీ సెమీస్, ఫైనల్లో ఆడి జట్టు 42వసారి టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. విదర్భతో ఫైనల్లో రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులు చేసి ఫామ్, ఫిట్‌నెస్‌ చాటుకున్నాడు. గత ఐపీఎల్‌కు గాయంతో దూరమైన శ్రేయస్‌.. ఈసారి కోలుకుని కోల్‌కతా కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు అందుకుని జట్టును గొప్పగా నడిపించాడు. మార్గనిర్దేశకుడు గౌతమ్‌ గంభీర్, కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌లను సమన్వయం చేసుకుంటూ వనరులను తెలివిగా ఉపయోగించుకుని ఆ జట్టు పదేళ్ల నిరీక్షణకు తెరదించాడు. బ్యాటర్‌గానూ కీలక సమయంలో రాణించాడు. హైదరాబాద్‌తో క్వాలిఫయర్‌-1లో అజేయంగా 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. మొత్తంగా 2 అర్ధసెంచరీలతో సహా 351 పరుగులు సాధించాడు. ‘‘కోల్‌కతాను శ్రేయస్‌ నడపించిన తీరు అద్భుతం. నాయకుడిగా అతడెంతో మెరుగయ్యాడు. అతడి చేతిలో మంచి జట్టు ఉందన్నది నిజమే అయినా.. వారి నుంచి తనకు కావాల్సింది రాబట్టాడు’’ అని మాజీ ఆటగాడు ప్రవీణ్‌ ఆమ్రే అన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని