MS Dhoni: అప్పుడు అర్థమైంది.. ధోనీ మాస్టర్‌మైండ్‌ పవర్‌: కోల్‌కతా ఓపెనర్

ధోనీ (Dhoni) నాయకత్వ పటిమను ఎంత పొగిడినా తక్కువే. బయట నుంచి చెప్పడం కంటే అతడికి ప్రత్యర్థిగా ఆడిన వారే అభినందించడం విశేషం. తాజాగా కోల్‌కతా యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్ (Venkatesh iyer) తనకు ఎదురైన అనుభవం గురించి వెల్లడించాడు.

Published : 01 Jul 2023 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియాకు టీ20, వన్డే, ఛాంపియన్స్‌ ట్రోఫీ.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు.. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ నాయకుడు ఎవరో? మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2023 సీజన్‌ విజేతగా సీఎస్‌కేను నిలపడంలో ధోనీ నాయకత్వం కీలకం. మరి ప్రత్యర్థిగా ఆడినా ధోనీ మాస్టర్‌ మైండ్‌ గురించి అర్థం చేసుకోవడం ఆటగాళ్లకూ కష్టమే. ఎప్పుడు ఎలాంటి ఎత్తులు వేసి చిత్తు చేస్తాడనేది ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ధోనీకి ప్రత్యర్థికి బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్ ‘కెప్టెన్‌ కూల్’ ప్లానింగ్‌ను చూసి షాక్‌కు గురయ్యాడట. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ధోనీ చేసే ఫీల్డింగ్‌ సెటప్‌ అద్భుతమని కొనియాడాడు. 

‘‘ఐపీఎల్‌లో చెన్నైతో మ్యాచ్‌ సందర్భంగా నేను, మరొకరు క్రీజ్‌లోకి ఉన్నాం. మా కోసం ధోనీ ఫీల్డింగ్‌ను సెట్‌ చేసిన విధానం నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. నేను అప్పటికే నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్నా. స్ట్రైకర్‌ కోసం షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌, కవర్స్‌ వద్ద ఒక్కొక్కరిని ఉంచాడు. బంతిని వేసేందుకు బౌలర్‌ సిద్ధమవుతుండగా ధోనీ మళ్లీ ఫీల్డింగ్‌ను సెట్‌ మార్పు చేశాడు. మరొక ఫీల్డర్‌ను రమ్మని చెప్పి ఓ ప్లేస్‌లో ఉంచాడు. మరుసటి బంతికే ఎక్కడైతే ఫీల్డర్‌ ఉన్నాడో అక్కడికే క్యాచ్‌ ఇచ్చి మా బ్యాటర్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. ‘ధోనీ అలా ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన తర్వాతి బంతికే ఇలా ఎలా జరిగింది? ఓ మూడు లేదా నాలుగు బంతులు తర్వాతైనా జరగొచ్చు కదా.. అని అనిపించింది. ఓహో ఇది కదా నాయకుడిగా ధోనీ ప్రతిభ అని అనిపించింది. దీంతో ధోనీ మాస్టర్‌మైండ్‌ పవర్‌ ఏంటనేది అప్పుడు అర్థమైంది’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు