KL Rahul: ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్‌కే మద్దతు: కేఎల్ రాహుల్

తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్‌లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 18 May 2024 11:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సునీల్ శెట్టి ఓ యాడ్ చేసిన విషయం గుర్తుందా.. సునీల్ కుమార్తె అథియా శెట్టిని కేఎల్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తన లఖ్‌నవూ జట్టుకు బాలీవుడ్‌ స్టార్‌ మద్దతు తెలుపుతాడని కేఎల్ అనుకుంటాడు. కానీ, రోహిత్ ప్రాతినిధ్యం వహించే ముంబయికే తాను సపోర్ట్‌ చేస్తానని చెప్పడంతో కేఎల్ ఉడుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తాజాగా ముంబయితో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన తర్వాత లఖ్‌నవూ సారథి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇక నుంచి నేను, మా మామ ఒకటే టీమ్‌. మేమిద్దరం రోహిత్ శర్మకు మద్దతు తెలుపుతాం. వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని కేఎల్ వ్యాఖ్యానించాడు.

ప్లేఆఫ్స్‌కు చేరతామనుకున్నా.. 

సీజన్‌లోని ఆఖరి మ్యాచ్‌లో తమ విజయం సాధించడం, టోర్నీలో ఓవరాల్‌ ప్రదర్శన తదితర అంశాలపైనా రాహుల్‌ స్పందించాడు. ‘‘మెగా లీగ్‌ ప్రారంభమైన మొదట్లో మా జట్టు అత్యంత బలమైందిగా భావించా. ఇతర టీమ్‌లకు తీవ్ర పోటీనిస్తామనుకున్నా. కానీ, చివరి ఇలాంటి ఫలితాలను చూశాక తీవ్ర నిరాశకు గురయ్యా. ఆటగాళ్లకు గాయాలు కావడం ప్రతి జట్టులోనూ జరుగుతాయి. కానీ, మేం కలిసికట్టుగా ఆడలేపోయాం. ఇప్పుడు ముంబయిపై నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాం. ఇలాంటి వాటినే మేం మొదటి నుంచి ఆడేందుకు ప్రయత్నించాం. సఫలం కాలేకపోయాం. జట్టులోని ప్రతి ఒక్కరి కోసం లఖ్‌నవూ మేనేజ్‌మెంట్ చాలా సమయం, ఖర్చును వెచ్చించింది. కేవలం రెండు నెలల లీగ్‌లోనే కాకుండా.. ఏడాదిపాటు ప్రతి ఆటగాడిని జాగ్రత్తగా చూసుకుంది. మయాంక్‌, యుధ్‌వీర్‌ వంటి కుర్రాళ్లను దక్షిణాఫ్రికాకూ పంపాం. వారిద్దరు చేసిన శ్రమకు మంచి ఫలితం అందింది. 

భారత జట్టులోకి మళ్లీ వచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తా. వచ్చే నెల నుంచి పొట్టి కప్ జరగనుంది. ఆ తర్వాత ఎక్కువగా టీ20లను ఆడే అవకాశం ఉండదు. నా బ్యాటింగ్‌ విషయంలో నేనెప్పుడూ నిరంతరం నేర్చుకొనేందుకే చూస్తుంటా. టీమ్‌ఇండియాలో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధమే. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఓపెనర్‌గా వస్తున్నా. మా జట్టులోని పూరన్‌, స్టాయినిస్‌ తదితర విదేశీ స్టార్లను వెంటవెంటనే బ్యాటింగ్‌కు పంపించకూడదని అనుకున్నాం. ఒత్తిడి ఎక్కువగా ఉండే పొజిషన్‌లో సీనియర్లను ఆడిస్తే త్వరగా అలవాటు పడతారు’’ అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని