KL Rahul: ఇదే మా తొలి మ్యాచ్‌.. తొందరేం లేదు: రెండు బౌన్సర్ల రూల్‌పై కేఎల్ రాహుల్

రాజస్థాన్‌ చేతిలో లఖ్‌నవూ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. పవర్‌ప్లేలో తీవ్రంగా ఇబ్బంది పడిన లఖ్‌నవూ.. వికెట్లు కోల్పోవడంతో లక్ష్య ఛేదనలో వెనుకబడిపోయింది.  

Published : 25 Mar 2024 07:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ సీజన్‌ను లఖ్‌నవూ ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్‌ చేతిలో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్‌ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లఖ్‌నవూ 173 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), నికోలస్‌ పూరన్ (64*), దీపక్ హుడా (26) రాణించినప్పటికీ.. విజయం సాధించలేకపోయింది. పవర్‌ ప్లేలో కీలకమైన మూడు వికెట్లను కోల్పోవడంతోపాటు 47 పరుగులే చేయడంతో ఓటమి తప్పలేదు. ఓవర్‌లో రెండు బౌన్సర్ల రూల్‌ వల్లే లఖ్‌నవూ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారనే వ్యాఖ్యలు వినిపించాయి. ట్రెంట్ బౌల్ట్‌ బౌలింగ్‌లో దేవదత్‌ పడిక్కల్‌, కేఎల్ కంకషన్‌ చెక్‌ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఏ జట్టూ పవర్‌ ప్లేలో భారీగా పరుగులు చేయలేకపోయింది. దీనిపై కేఎల్ రాహుల్‌ స్పందించాడు. 

‘‘ఈ సీజన్‌లో ఇది మేం ఆడిన తొలి మ్యాచ్‌. బౌన్సర్లు, ఇతర అంశాలపై ఆందోళన చెందడం లేదు. ఇప్పుడే దానిపై ఓ అభిప్రాయానికి రావడం సరైందికాదు. అలా చేస్తే తొందరపాటే అవుతుంది. ప్రతి జట్టుకూ పవర్‌ ప్లే (తొలి ఆరు ఓవర్లు) ముఖ్యం. ఈసారి ఏ టీమ్‌ కూడా దూకుడుగా ఆడిన దాఖలాలు లేవు. మా బౌలర్‌ మోహ్‌సిన్‌ తొలి సీజన్‌ పవర్‌ప్లేలో కీలకంగా మారాడు. గత ఎడిషన్‌లో ఫిట్‌నెస్‌ లేకపోవడంతో ఆడలేకపోయాడు. ఇప్పుడు అతడు తిరిగి రావడం బాగుంది. కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నవీనుల్‌ హక్ మా బౌలింగ్‌ విభాగంలో కీలమైన ఆటగాడు. ఈ మ్యాచ్‌లో పరుగులు భారీగా సమర్పించినంత మాత్రాన వారి ప్రదర్శనను తక్కువ చేయడం లేదు. 

రాజస్థాన్‌ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్‌ కూడా పెద్దదేం కాదు. ఓవర్‌కు 10 పరుగులు కంటే తక్కువ చేస్తే చాలు. మా బౌలర్లు, బ్యాటర్లు కొన్ని పొరపాట్లు చేశారు. తర్వాతి మ్యాచుల్లో సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం. బ్యాటింగ్‌లోనూ ఆరంభంలో తడబాటుకు గురయ్యాం. త్వరగా మూడు వికెట్లు కోల్పోవడం కూడా ప్రభావం చూపింది. మ్యాచ్‌లను గెలిచేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తాం. మేం ఎక్కడ బలోపేతం కావాలనే అంశాలపై దృష్టిసారిస్తాం. గత సీజన్‌ మధ్యలోనే నేను వైదొలిగా. ఇప్పుడు మాత్రం మొదటి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించా. విజయం సాధిస్తే ఇంకాస్త సంతోషంగా ఉండేది. మా జట్టు ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు ఎంతో అనుభవం ఉంది. ఆసీస్‌ టీ20 ప్రపంచ కప్‌, యాషెస్‌ సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి కోచింగ్‌ను మేం ఆస్వాదిస్తున్నాం’’ అని కేఎల్ రాహుల్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని