KL Rahul: సైలెంట్‌ కిల్లర్‌.. కేఎల్‌ రాహుల్‌..!

రాహుల్‌కు ఏమైందీ..? బెరుకుగా ఆడుతున్నాడేంటీ..? అబ్బా ఇతడినా ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకొంది..! అంటూ టోర్నీకి ముందు వరకు విమర్శలు చేసిన నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు అదే రాహుల్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌తో జట్టు వెన్నెముకగా మారాడు.

Updated : 18 Nov 2023 10:29 IST

వన్డేల్లో 2021 మార్చి తర్వాత మరో శతకమే లేదు.. ఓపెనర్‌గా సీమర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు.. అబ్బా ఎన్ని బంతులు తింటాడు అంటూ అభిమానుల అసహనం.. నెట్టింట మీమ్స్‌ వెల్లువ..ఆపై గాయంతో కొన్ని నెలల విశ్రాంతి..  ఈ ఏడాది ఆగస్టు వరకు కెరీర్‌లో కష్టకాలం ఎదుర్కొన్న ఓ టీమ్‌ఇండియా ఆటగాడి పరిస్థితి ఇది. కానీ, జట్టు కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ పట్టుబట్టి మరీ అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు రోహిత్‌ తీసుకొనే డీఆర్‌ఎస్‌ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి దూకుడుగా ఆడుతున్నాడు. అతడే సైలెంట్‌ కిల్లర్‌ కేఎల్‌ రాహుల్‌.

ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు జట్టు ఓపెనింగ్‌కు రోహిత్‌ భాగస్వామిగా గిల్‌ పాతుకుపోయాడు. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకొని శ్రేయస్‌ అందుబాటులోకి రావడంతో నాలుగో స్థానంలో అతడి బెర్త్‌ ఖాయమైంది. ఇక కేఎల్‌ రాహుల్‌ కూడా  కోలుకోవడంతో ఇషాన్‌తో పోటీ పడాల్సి వచ్చింది. ఈ సమయంలో సీనియర్‌ కావడంతో కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌ రాహుల్‌కే ఓటు వేశారు. ఇషాన్‌ను బ్యాకప్‌ కీపర్‌-బ్యాటర్‌గా పరిమితం చేశారు. జట్టు మేనేజ్‌మెంట్ తనపై ఉంచిన విశ్వాసాన్ని రాహుల్‌ నిలబెట్టుకొన్నాడు.  

ఆలౌట్‌ వార్‌కు అంతా సిద్ధం.. ఆ ఒక్కటి తప్ప..!

ప్రపంచకప్‌ టోర్నీలో విరాట్‌ కోహ్లీ  రికార్డుల జోరు.. రోహిత్‌, శ్రేయస్‌ సిక్సర్ల జోరులో.. కేఎల్‌ సైలెంట్‌గా ఓ యంత్రంలా తన పని తాను చేసుకు వెళ్లిపోతున్నాడు. టోర్నీ ముందుకు సాగేకొద్ది అతడి ప్రతిభ మరింత పదనుదేలుతోంది. వాస్తవానికి  ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై భారత్‌ 2 పరుగులకే 3 టాప్‌ ఆర్డర్‌ వికెట్లు కోల్పోయిన సమయంలో విరాట్‌తో కలిసి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో 115 బంతులకు 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక టోర్నీ చివరికి వచ్చేసరికి నెదర్లాండ్స్‌పై 62 బంతుల్లోనే మెరుపు శతకం బాది రికార్డు సృష్టించాడు. సెమీస్‌లో కేవలం 20 బంతుల్లో అమూల్యమైన 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 10 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్‌లు ఆడి 77 సగటుతో 386 పరుగులు సాధించాడు.

మిడిలార్డర్‌లో జట్టుకు వెన్నెముకగా..

ఈ టోర్నీలో రాహుల్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మిడిల్‌ ఆర్డర్‌ను శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి దుర్భేద్యంగా మార్చేశాడు. రాహుల్‌ ఓపెనింగ్‌లో కంటే నాలుగు, ఐదు స్థానాల్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఓపెనర్‌గా 23 మ్యాచ్‌ల్లో 915 పరుగులు చేశాడు. దీనిలో మూడు శతకాలు, ఆరు అర్థ శతకాలు ఉన్నాయి. సగటు 43.57 కాగా.. స్ట్రైక్‌ రేట్‌ కేవలం 79 మాత్రమే. పవర్‌ ప్లే సమయంలో ఈ స్ట్రైక్‌ రేట్‌ దారుణమనే చెప్పొచ్చు.  

అదే 4, 5వ స్థానాల్లో అతడు మొత్తం 40 మ్యాచ్‌లు ఆడాడు. సగటు 56కు పైగా ఉంది. 4 శతకాలు,  10 అర్ధ శతకాలు బాది 1674 పరుగులు చేశాడు. 11 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. వాస్తవానికి ఈ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేసరికి పవర్‌ ప్లే ఉండదు.. ఓవర్లు కూడా తక్కువగా ఉంటాయి. కానీ, 5వ స్థానంలో రాహుల్‌  స్ట్రైక్‌ రేటు 98..! అందుకేనేమో ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌లో దిగి చెలరేగిపోతున్నాడు.

రోహిత్‌ డీఆర్‌ఎస్‌ నిర్ణయాల్లో కీపర్‌గా కీలకం..

బ్యాటర్‌గా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడినా.. కీపింగ్‌ విషయంలో రాహుల్‌ ఎక్కడ అలసటగా కనిపించడం లేదు. కీపర్‌గా మైదానంలో చురుగ్గా కదులుతూ.. కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకొన్నాడు. ఇక డీఆర్‌ఎస్‌ నిర్ణయాల్లో తాను బౌలర్‌ని పట్టించుకోనని.. కీపర్‌పైనే ఆధారపడతానని గతంలోనే కెప్టెన్‌ రోహిత్‌ తేల్చిచెప్పాడు. 

ఈ క్రమంలో రోహిత్‌ విశ్వాసాన్ని రాహుల్‌ నిలబెట్టుకొన్నాడనే చెప్పాలి. ముఖ్యంగా.. లీగ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమి వేసిన 12వ ఓవర్‌ రెండో బంతి బ్యాటర్‌ చమీర గ్లౌజును తాకి కీపర్‌ చేతిలోకి వెళ్లింది. అంపైర్‌ కూడా దానిని వైడుగా భావించి సిగ్నల్‌ ఇచ్చాడు. షమీ కూడా నిరాశగా వెనుదిరిగాడు.. కానీ, రాహుల్‌ మాత్రం పట్టు వదలకుండా డీఆర్‌ఎస్‌కు వెళ్లాలని రోహిత్‌ను ఒత్తిడి చేశాడు. చివరికి రివ్యూలో చమీర గ్లౌజుకు బంతి తాకినట్లు స్పష్టం కావడంతో నిర్ణయం టీమ్‌ ఇండియా పక్షాన వచ్చింది. ఇక.. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై తొలి ఓవర్లలో బుమ్రా అప్పీళ్లతో రాహుల్‌ ఏకీభవించలేదు. దీంతో రోహిత్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లలేదు. ఆ తర్వాత అవి నాటౌట్లని రీప్లేలో కనిపించాయి. దీంతో ఇప్పుడు టీమ్‌ ఇండియాలో డీఆర్‌ఎస్‌ అంటే ‘డెసిషన్‌ రాహుల్‌ సిస్టమ్‌’గా మారిపోయింది. ఈ టోర్నీ మొత్తంలో రాహుల్‌ 15 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ చేశాడు. ఈ సైలెంట్‌ కిల్లర్‌ ఇదే జోరును కొనసాగిస్తే భారత్‌కు కీపర్ల కొరతతోపాటు.. మిడిలార్డర్‌ లోటు కూడా తీరిపోయినట్లే.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని