KL Rahul: ‘వైస్‌ కెప్టెన్’ పదవి హుళక్కేనా... ఇది కేఎల్‌కు మొదటి హెచ్చరికనా..?

ఇప్పుడందరి నోటా ఒకటే చర్చ.. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)కు అవకాశాలు ఎందుకిస్తున్నారు..? సోషల్‌ మీడియాలోనూ ఇదే అంశంపై మీమ్స్‌, కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆసీస్‌తో (IND vs AUS) మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో రాహుల్‌కు ఉన్న ‘వైస్‌ కెప్టెన్‌’ ట్యాగ్‌ను తీసేయడం గమనార్హం.

Published : 20 Feb 2023 16:18 IST

71 బంతుల్లో 20 పరుగులు.. 41 బంతుల్లో 17 పరుగులు.. 3 బంతుల్లో ఒక్క పరుగు.. ఇవీ టీమ్‌ఇండియా (Team India) ‘వైస్‌ కెప్టెన్‌’గా గత మూడు ఇన్నింగ్స్‌ల్లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) గణాంకాలు. ఓసారి గత పది ఇన్నింగ్స్‌లను తరిచిచూసినా గొప్ప ప్రదర్శనేం లేదు. గత పది ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క అర్ధ శతకం నమోదు చేయలేదు. అత్యధిక స్కోరు ఎంతో తెలుసా.. 23 పరుగులు.. అదీనూ బంగ్లాదేశ్‌పై సాధించడం గమనార్హం. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగలింది. 

ఇంటర్నెట్ డెస్క్‌:  జట్టులో వైస్‌ కెప్టెన్‌ది (Vice Captain) చాలా కీలక పాత్ర.. క్లిష్టసమయాల్లో కెప్టెన్‌గా సూచనలు, సలహాలు ఇస్తూ ఉండాలి. ఇక ఓపెనర్‌ అయితే మాత్రం బ్యాటింగ్‌లో అండగా నిలవాల్సిన బాధ్యత ఉంటుంది. సారథితో పోల్చుకుంటే ఒత్తిడి పెద్దగా ఏమీ ఉండదు. కానీ, ఇటీవల వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత నుంచి కేఎల్ రాహుల్‌ (KL Rahul) సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్‌పైనా ఏదోలా ఆడాడు. ఆసీస్‌తో జరుగుతున్న (IND vs AUS) కీలకమైన బోర్డర్ - గావస్కర్‌ (Boder-Gavaskar Trophy) ట్రోఫీలోనూ ఘోరాతిఘోరంగా విఫలం కావడం అభిమానులను కలవరపెడుతోంది. ఈ టోర్నీలో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు. 

ఆ పేరు పోయింది.. 

ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ‘వైస్ కెప్టెన్‌’గా ఉన్న కేఎల్ రాహుల్‌ (KL Rahul).. తాజాగా చివరి రెండు టెస్టులకు ప్రకటించిన స్క్వాడ్‌లో మాత్రం ‘వైస్‌ కెప్టెన్’ అనే ట్యాగ్‌ లేకపోవడం గమనార్హం. మరి మూడో టెస్టు ముందు బీసీసీఐ అతడికే అవకాశం ఇస్తుందా...? లేదా..? అనేది వేచి చూడాలి. ఉపసారథిగా ఉంటూ అత్యంత దారుణ ప్రదర్శన చేస్తున్న రాహుల్‌ను జట్టులో నుంచే తీసేయాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి. కానీ, ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) మాత్రం ‘మేం కేఎల్‌కు మద్దతుగా నిలుస్తాం.. తిరిగి గాడిలో పడగల నైపుణ్యం అతడిలో ఉందని నమ్ముతున్నాం’’ అని రెండో టెస్టు మ్యాచ్‌ అనంతరం చెప్పాడు. అయితే, చివరి రెండు టెస్టులకు (Team India Squad) ప్రకటించిన జాబితాలో ‘వైస్‌ కెప్టెన్సీ’ పోవడం మాత్రం అతడికి హెచ్చరికలాంటిదే. ఇలాగే కొనసాగితే జట్టులో స్థానం కూడా చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. 

ఎందుకిలా.. ఏ స్థానంలో అయితే బెటర్...?

టీ20ల్లో ఓపెనర్‌గా రాణించిన కేఎల్ రాహుల్‌.. టెస్టుల్లోకి వచ్చేసరికి  ఆడలేకపోతున్నాడు. నిప్పులు చేరిగే కొత్త బంతులను అడ్డుకోవడంలో విఫలం కావడం మరింత కలవరపెడుతోంది. ఆరంభంలో ఆచితూచి ఆడి.. క్రీజ్‌లో పాతుకుపోయిన తర్వాత బ్యాట్‌ను ఝుళిపించడం సర్వసాధారణం. కానీ, రాహుల్‌ మాత్రం అటు డిఫెన్స్‌ ఆడలేక.. దూకుడుగా బ్యాటింగ్‌ చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఉదాహరణకు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దాదాపు 12 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలబడిన రాహుల్‌ కేవలం 20 పరుగులను మాత్రమే సాధించాడు. బంతి ఎలా వస్తుందో ఓ అంచనాకు వచ్చినా సరే ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించలేకపోతున్నాడు.  మరోవైపు కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం సెంచరీ బాదేశాడు. ఒత్తిడి లేనప్పుడే రాహుల్‌ సరిగా ఆడకపోతే ఎలా అనేది మాజీల ప్రశ్న. అయితే, అతడిని మిడిలార్డర్‌ పంపితే బెటర్‌ అనే వాదనా చర్చకు తెరలేసింది. ఓపెనర్‌గా మరొకరిని ఎంపిక చేసి.. ఎలాగూ కీపింగ్‌ చేస్తాడు కాబట్టి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలనే సూచనలూ వచ్చాయి. పెద్దగా ఒత్తిడి ఉండదు కాబట్టి, ఫామ్‌ను అందుకోవడానికి అవకాశం ఉంటుందనేది వారి అభిప్రాయం. 

మరి శ్రీకర్‌ స్థానానికి ముప్పు తప్పదా..?

ఇప్పటికే టీమ్‌ఇండియాలో స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయినా సరే, వరుసగా విఫలమవుతున్న రాహుల్‌ను కొనసాగించడం సరైన నిర్ణయం కాదనే విమర్శ ఉంది. కనీసం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేస్తే అయినా ఫామ్‌ అందిపుచ్చుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పుడున్న జట్టులో రాహుల్‌ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి యువ ఆటగాడు శ్రీకర్‌ భరత్‌కే (Srikar Bharat) ఉంటుంది. రాహుల్‌ స్వతహాగా కీపర్‌.. కాబట్టి తుది జట్టులో అదొక్క స్థానమే ఖాళీ అయ్యే అవకాశం ఉంది. శ్రీకర్‌ను పక్కన పెట్టి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తే.. ఓపెనర్‌గా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌కు (Shubman Gill) అవకాశం వస్తుంది. గిల్‌  ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకొన్నాడు. కొత్తగా ప్రయత్నించాలని బీసీసీఐ భావిస్తే మాత్రం సూర్యకుమార్‌ను (Surya Kumar Yadav) కూడా ఓపెనర్‌గా తీసుకురావచ్చు. అయితే, ఇటీవల కాలంలో టెస్టు ఫార్మాట్‌లో రాహుల్‌ పెద్దగా వికెట్‌ కీపింగ్‌ చేసిన దాఖలాలు లేవు. దాదాపు మూడు రోజులపాటు, అదీనూ స్పిన్‌ పిచ్‌లపై కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం కఠినమైందే. అందుకే, ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, రెండో టెస్టులో స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీకర్ భరత్‌ దూకుడుగా ఆడటం అభిమానులను అలరించింది. దీంతో అతడిని ఓపెనర్‌గా పంపి, రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తే మంచిదనే సూచనలు వచ్చాయి.

ఈ క్రమంలో మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో రాణిస్తేనే రాహుల్‌ ‘టెస్టు’ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. లేకపోతే చేజేతులా వచ్చిన అవకాశాలను చేజార్చుకొన్న ఆటగాడిగా మారిపోయే పరిస్థితి తలెత్తడం ఖాయం. ఇప్పటి వరకు 47 టెస్టులను ఆడిన కేఎల్ రాహుల్‌ 33.34 సగటుతో 2,642 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు, 13 అర్ధశతకాలు ఉన్నాయి. రాహుల్‌ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 199 పరుగులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని