Heinrich Klaasen : అది క్లాసిక్‌ ప్రదర్శన.. క్లాసెన్‌ సెంచరీపై సచిన్‌ ప్రశంసలు

ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ క్లాసెన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌(Sachin Tendulkar) కూడా అతడి ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు.

Updated : 19 May 2023 19:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) తరఫున నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది హెన్రిక్‌ క్లాసెన్‌ (Heinrich Klaasen) మాత్రమే. గురువారం బెంగళూరు (Royal Challengers Bangalore)పై మ్యాచ్‌ ఓడిపోయినా క్లాసెన్‌ శతకాన్ని(104; 51 బంతుల్లో 8×4, 6×6) ఎవరూ మర్చిపోలేరు. అతడి అద్భుత ఇన్నింగ్సే జట్టుకు మెరుగైన స్కోరు సాధించి పెట్టింది. దాదాపు 200 స్ట్రైక్‌ రేట్‌తో అతడు సాధించిన ఈ సెంచరీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌(Sachin Tendulkar) కూడా అతడిని మెచ్చుకున్నాడు. ఇటీవల చూసిన ఉత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటని ప్రశంసించాడు.

‘ఐపీఎల్‌ అనేది క్రియేటివ్‌, ట్రెడిషనల్‌ బ్యాటింగ్‌ల కలయిక. నేడు ట్రెడిషనల్‌ బ్యాటింగ్‌ క్లాసిక్‌ ప్రదర్శనను చూశా. క్లాసెన్‌ ఫుట్‌ వర్క్‌ చాలా సరళంగా కనిపించింది. ఈ మధ్య కాలంలో చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి’ అంటూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. 

ఇక క్లాసెన్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి శతకం. గత మ్యాచ్‌లో గుజరాత్‌పై కూడా మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్యాటర్లందరూ విఫలమైన వేళ.. 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇలా ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 2 అర్ధ శతకాలు, ఒక శతకంతో మొత్తం 430 పరుగులు చేశాడు. సన్‌ రైజర్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ కొనసాగుతున్నాడు.

ఇక సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగింది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో  కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టిక చివర్లో ఉంది. ముంబయి ఇండియన్స్‌తో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని