Virat Kohli: కోహ్లి మూడులోనే..

ఆర్సీబీ ఓపెనర్‌గా ఐపీఎల్‌లో కోహ్లి గొప్ప ప్రదర్శన చేశాడు. కానీ వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతణ్ని మూడో స్థానంలో ఆడించడమే మంచిదని దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ గ్రేట్‌ ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 23 May 2024 02:37 IST

దిల్లీ: ఆర్సీబీ ఓపెనర్‌గా ఐపీఎల్‌లో కోహ్లి గొప్ప ప్రదర్శన చేశాడు. కానీ వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతణ్ని మూడో స్థానంలో ఆడించడమే మంచిదని దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ గ్రేట్‌ ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. విరాట్‌ను ఓపెనర్‌గా పంపడం మంచి ఎత్తుగడ కాదని అతనన్నాడు. ‘‘కోహ్లి నంబర్‌ 3 బ్యాటర్‌. అతడు ఆ స్థానానికే సరిపోతాడన్నది నా ఉద్దేశం. ఒకరకంగా అతణ్ని బ్యాటింగ్‌ కెప్టెన్‌గా చెప్పొచ్చు. చాలా ప్రశాంతంగా, సంయమనంతో ఉంటాడు’’ అని డివిలియర్స్‌ చెప్పాడు. ‘‘కోహ్లి ఓపెనింగ్‌ను ఆస్వాదిస్తాడని నాకు తెలుసు. అది మంచి విషయమే. అతడు తన ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. కానీ అతణ్ని ఓపెనర్‌గా పంపి ఎడాపెడా బాదేయాలని చెప్పడం సాహసమే. అతడు 4 నుంచి 16-17 ఓవర్ల వరకు ఆడాలని నేను కోరుకుంటా. ఆ ఓవర్లలో అతడు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌. అక్కడ అతడు చాలా ప్రభావం చూపిస్తాడు’’ అని అన్నాడు.

ఆడినంతకాలం ధోనినే కెప్టెన్‌: వచ్చే ఏడాది ధోని ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అన్నది ఇప్పడు చర్చనీయాంశం. ఒకవేళ ధోని కొనసాగితే మాత్రం అతడే చెన్నై కెప్టెన్‌గా ఉండాలని డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఎన్నో ఏళ్లు ధోని ప్రత్యర్థిగా ఆడా. అతడు కెప్టెన్‌గా ఉండడం ప్రత్యర్థులను భయపెడుతుంది. అతడు కెప్టెన్‌గా లేకపోవడం వల్ల ప్రత్యర్థుల్లో ఆ బెరుకు ఉండట్లేదు. అంటే గైక్వాడ్‌ కెప్టెన్సీ బాగా లేదని కాదు. సారథిగా అతడికి మంచి భవిష్యత్తుంది. జట్టును సమర్థంగా నడిపించాడు. కానీ ధోని జట్టులో ఉండి కెప్టెన్‌గా ఉండకపోవడం సరికాదు. ఇంతకుముందు కూడా చెన్నై ఇలా చేసింది. కానీ విజయవంతం కాలేకపోయింది’’ అని డివిలియర్స్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని