Shreyas - Venkatesh: ఈ అయ్యర్‌కు.. ఆ అయ్యర్‌కు అదే వ్యత్యాసం..: శ్రేయస్‌

ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా ఫైనల్‌కు చేరుకుంది. లీగ్‌ స్టేజ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు.. తొలి క్వాలిఫయర్‌లోనూ అదే జోరును కొనసాగించింది.

Updated : 22 May 2024 12:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో నాలుగోసారి కోల్‌కతా ఫైనల్‌కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ (58*: 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మరోవైపు వెంకటేశ్‌ అయ్యర్ (51*: 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ఇద్దరి పేర్ల చివర్లో ‘అయ్యర్‌’ ఉండటంపై ఎదురైన ప్రశ్నకు  శ్రేయస్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. మ్యాచ్‌ ప్రదర్శనపైనా స్పందించాడు.

‘‘ప్రతి ఒక్కరూ బాధ్యతలను స్వీకరించి మరీ విజయం కోసం కష్టపడ్డారు. దాదాపు పది రోజుల తర్వాత మేం మ్యాచ్‌ ఆడాం. గత రెండు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. మ్యాచ్‌ల కోసం విభిన్న ప్రాంతాలకు తిరుగుతూ ఆడటం అంత సులువేం కాదు. మాకు ఈ మ్యాచ్‌ ఫలితం అత్యంత విలువైంది. ఇప్పుడు ఏం చేయగలం అనేదానిపై దృష్టిసారించి ఆడాం. వచ్చిన ప్రతి ఛాన్స్‌ను అందిపుచ్చుకోవడానికే ప్రయత్నించాం. బౌలింగ్‌లో వైవిధ్యం చూపిస్తే ఫలితం సానుకూలంగా వస్తుందనేదానికి ఇదొక నిదర్శనం. తొలి మ్యాచ్‌ ఆడిన వికెట్ కీపర్ గుర్బాజ్‌ ప్రభావం చూపించాడు. స్టార్క్‌, సునీల్ నరైన్ వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించారు. బ్యాటింగ్‌లోనూ మేం దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. వెంకటేశ్‌ అయ్యర్ ఆ ఊపును కొనసాగించడంలో కీలక పాత్ర పోషించాడు. నాకు (శ్రేయస్‌ అయ్యర్), వెంకటేశ్‌ అయ్యర్‌కు మధ్య ఒకటే వ్యత్యాసం. అతడు తమిళ్ మాట్లాడతాడు. నేను మాట్లాడలేను, కానీ అర్థం చేసుకోగలను. నాతో అతడు తమిళ్‌లోనే ఏదైనా చెబుతాడు. ఫైనల్‌లోనూ మేం ఇదే జోరును కొనసాగిస్తామనే నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపాడు. కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కుటుంబం ఎప్పుడో ముంబయికి వచ్చి స్థిరపడింది. అతడి పూర్వీకులది తమిళనాడే.

పవర్‌ప్లే ఎంత ముఖ్యమో తెలుసు: స్టార్క్

డేంజరస్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ (0)ను డకౌట్‌ చేసిన మిచెల్ స్టార్క్‌ హైదరాబాద్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. కీలకమైన మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గానూ నిలిచాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘టీ20ల్లో పవర్‌ ప్లే అత్యంత కీలకమని మాకు తెలుసు. ఇరు జట్లూ తొలి ఆరు ఓవర్లలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాయి. కానీ, మేం త్వరగా వికెట్లు తీయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఒత్తిడి పెరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడును చూశాం. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తోపాటు బంతిని స్వింగ్‌ చేస్తే వారిని కట్టడి చేయొచ్చని భావించాం. అందుకు తగ్గట్టుగానే బంతులేశాం. హెడ్‌ను త్వరగా ఔట్‌ చేయగలిగాం. ప్రతిసారి ఇలా చేయడం కష్టమే. కానీ, ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది. ఇప్పటికీ మా జట్టులో చాలామంది అద్భుతమైన నైపుణ్యం కలిగిన బౌలర్లు ఉన్నారు. వారికి ఇంకా అవకాశం రాలేదు’’ అని స్టార్క్‌ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని