Kolkata Vs Delhi: దిల్లీ ఆలౌట్‌.. కోల్‌కతా హ్యాట్రిక్‌ విజయం

ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా హ్యాట్రిక్‌ విజయం సాధించింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీపై 106 పరుగుల తేడాతో గెలిచింది.

Updated : 03 Apr 2024 23:43 IST

విశాఖ: ఐపీఎల్ 17 సీజన్‌లో కోల్‌కతా హ్యాట్రిక్‌ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 106 పరుగుల భారీ తేడాతో మరపురాని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. 273 పరుగుల లక్ష్యఛేదనలో దిల్లీ 17.2 ఓవర్లకు 166 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (55; 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్ (54; 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రమే పోరాడారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్‌ అరోరా 3, మిచెల్ స్టార్క్‌ 2, సునీల్ నరైన్‌, రస్సెల్‌ ఒక్కో వికెట్ తీశారు.

నరైన్‌ విధ్వంసం

ఓపెనర్ సునీల్ నరైన్‌ (85; 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. అతడు దిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌలర్‌ ఎవరనేది సంబంధం లేకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాంత్‌ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదిన నరైన్‌.. సలామ్ వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ రాబట్టి 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాటర్ రఘువంశీ (54; 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో చెలరేగాడు. అతడు 25 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత ఆండ్రి రస్సెల్ (41; 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకు సింగ్ (26; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. దిల్లీ బౌలర్లలో నోకియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్‌ తలో వికెట్ పడగొట్టారు. 

హైదరాబాద్‌ రికార్డుకు ఐదు పరుగుల దూరంలోనే..

19 ఓవర్లకు 264/5 స్కోరుతో ఉన్న కోల్‌కతా.. హైదరాబాద్‌ పేరిట ఉన్న అత్యధిక స్కోరు (277) రికార్డును సునాయసంగా బ్రేక్‌ చేసేలా కనిపించింది. కానీ, చివర్లో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు (రస్సెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌) పడగొట్టి ఎనిమిది పరుగులే ఇచ్చి కోల్‌కతా బ్యాటర్లను నిలువరించాడు. దీంతో హైదరాబాద్‌ రికార్డును బ్రేక్‌ చేసే దిశగా దూసుకెళ్లిన కోల్‌కతా కేవలం ఐదు పరుగుల దూరంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక టాప్‌ 5 స్కోర్లు ఇవే..

  • హైదరాబాద్‌ 277/3 Vs ముంబయి
  • కోల్‌కతా 272/7  Vs దిల్లీ
  • బెంగళూరు 263/5 Vs పుణె
  • లఖ్‌నవూ 257/5  Vs పంజాబ్‌
  • బెంగళూరు 248/3 Vs గుజరాత్‌ లయన్స్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని