Kolkata vs Hyderabad: కోల్‌‘కథ’ ఫైనల్‌కు

క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టే 2018 నుంచి ఐపీఎల్‌ విజేతగా నిలుస్తోంది. 2018లో చెన్నై, 19, 20ల్లో ముంబయి, 21లో చెన్నై, 22లో గుజరాత్, 23లో చెన్నై ఇలాగే గెలిచాయి.

Updated : 22 May 2024 06:46 IST

విజృంభించిన స్టార్క్‌
చెలరేగిన వెంకటేశ్, శ్రేయస్‌
క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ చిత్తు 

క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టే 2018 నుంచి ఐపీఎల్‌ విజేతగా నిలుస్తోంది. 2018లో చెన్నై, 19, 20ల్లో ముంబయి, 21లో చెన్నై, 22లో గుజరాత్, 23లో చెన్నై ఇలాగే గెలిచాయి.

ప్చ్‌.. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసిన పోరు ఏకపక్షం. సన్‌రైజర్స్‌ తేలిపోయింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన ఆ జట్టు.. అసలు పోరులో బోల్తా కొట్టింది. విధ్వంసకారులు హెడ్, అభిషేక్‌ల బ్యాట్లు మూగబోయిన వేళ.. క్వాలిఫయర్‌-1లో కనీస పోటీ అయినా ఇవ్వకుండానే కోల్‌కతాకు హైదరాబాద్‌ తలవంచింది.

టేబుల్‌ టాపర్‌ కోల్‌కతాది తిరుగులేని ఆధిపత్యం. స్టార్క్‌ బంతితో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా, బ్యాటర్లు యథేచ్ఛగా చెలరేగిపోగా.. ఏకపక్ష పోరులో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించిన నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌-17 ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో 6.2 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ ముగిసింది. రెండు సార్లు ఛాంపియన్‌ కోల్‌కతాకు ఇది నాలుగో ఐపీఎల్‌ ఫైనల్‌.అహ్మదాబాద్‌

పీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదిరే ఆట కొనసాగుతోంది. మంగళవారం క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఆ జట్టు.. ఫైనల్లో అడుగుపెట్టింది. స్టార్క్‌ (3/34) విజృంభించడంతో మొదట హైదరాబాద్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్‌ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7×4, 1×6) పోరాటం ఆ జట్టుకు ఆ మాత్రం స్కోరును అందించింది. క్లాసెన్‌ (32; 21 బంతుల్లో 3×4, 1×6), కమిన్స్‌ (30; 24 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. వెంకటేశ్‌ అయ్యర్‌ (51 నాటౌట్‌; 28 బంతుల్లో 5×4, 4×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 24 బంతుల్లో 5×4, 4×6) చెలరేగడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి, మరో 38 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌ చేరడానికి సన్‌రైజర్స్‌కు మరో అవకాశముంది. రాజస్థాన్, బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌లో విజేతతో ఆ జట్టు క్వాలిఫయర్‌-2తో తలపడుతుంది.

కోల్‌కతా ధనాధన్‌: అసలే స్వల్ప లక్ష్యం. ఆపై కోల్‌కతా బ్యాటర్ల దూకుడుతో మరింత తేలికైపోయింది. ఓపెనర్లు గుర్బాజ్‌ (23; 14 బంతుల్లో 2×4, 2×6), నరైన్‌ (21; 16 బంతుల్లో 4×4) ధనాధన్‌ ఆటతో.. గట్టిగా పోటీలో నిలవాలనుకున్న సన్‌రైజర్స్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బ్యాటర్లు ఎడాపెడా బౌండరీలు బాదడంతో కోల్‌కతా  3 ఓవర్లలోనే 44/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే గుర్బాజ్‌ను నటరాజన్‌ను ఔట్‌ చేసినా.. అది కోల్‌కతా పరుగుల వేగంపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. వెంకటేశ్, నరైన్‌ బ్యాట్‌ ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఏడో ఓవర్లో నరైన్‌ను కమిన్స్‌ ఔట్‌ చేసినా సన్‌రైజర్స్‌ ఆశలలో ఎలాంటి మార్పులేదు. వెంకటేశ్‌కు శ్రేయస్‌ తోడవడంతో స్కోరు వేగం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. బ్యాటర్లిద్దరూ పోటీపడి బౌలర్లను ఉతకడంతో కోల్‌కతా వడివడిగా లక్ష్యం దిశగా సాగింది. హెడ్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ వరుసగా 6, 4, 6, 6తో మ్యాచ్‌ను ముగించడం విశేషం. వెంకటేశ్‌ 28 బంతుల్లో, శ్రేయస్‌ 23 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేశారు. ఈ జంట అభేద్యమైన మూడో వికెట్‌కు 44 బంతుల్లో 97 పరుగులు జోడించింది.

స్టార్క్‌ ధాటికి..: విధ్వంసక ఓపెనర్లు హెడ్‌ (0), అభిషేక్‌ శర్మ ఎంత ముఖ్యమో, వారిపై సన్‌రైజర్స్‌ ఎంతగా ఆధారపడి ఉందో మరోసారి రుజువైంది. లీగ్‌ దశలో పరుగుల వరద పారించిన ఈ ద్వయం అసలు పోరులో తడబడడంతో అంతకుముందు హైదరాబాద్‌ తక్కువ స్కోరుతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. స్టార్క్‌ తన పదునైన పేస్‌తో టాప్‌ ఆర్డర్‌ను దెబ్బతీసి ఆ జట్టు పతనంలో కీలక పాత్ర పోషించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌కు ఆరంభం పెద్ద షాక్‌. రెండో బంతికే హెడ్‌ను స్టార్క్‌ బౌల్డ్‌ చేయగా.. రెండో ఓవర్లో అభిషేక్‌ (3)ను అరోరా వెనక్కి పంపాడు. అంతే కోల్‌కతా రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్‌ చేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. స్టార్క్‌ అయిదో ఓవర్లో వరుస బంతుల్లో నితీష్‌ కుమార్‌ (9), షాబాజ్‌ (0)ను ఔట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ 39/4తో కష్టాల్లో కూరుకుపోయింది. మ్యాచ్‌ కోల్‌కతా నియంత్రణలోకి వచ్చింది. అయినా ఓ దశలో సన్‌రైజర్స్‌ 159 కన్నా ఎక్కువ స్కోరే చేసేలా కనిపించింది. కారణం రాహుల్‌ త్రిపాఠి, క్లాసెన్‌. తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ కుప్పకూలే స్థితిలో నిలిచిన జట్టును ఆదుకున్న ఈ జంట 62 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. త్రిపాఠి చకచకా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. అతడికి చక్కని సహకారాన్నిచ్చిన క్లాసెన్‌.. తానూ వీలైనప్పుడు బ్యాట్‌ ఝళిపించడంతో సన్‌రైజర్స్‌ 11వ ఓవర్లో 101/4తో కాస్త మెరుగైన స్కోరుపై కన్నేసింది. క్లాసెన్‌ను వరుణ్‌ (2/26) ఔట్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ మళ్లీ గతి తప్పింది. వికెట్లు టపటపా పడ్డాయి. కాసేపటికే త్రిపాఠి రనౌట్‌ కాగా.. సన్వీర్‌ (0), సమద్‌ (16), భువనేశ్వర్‌ (0) క్యూకట్టారు. ఫలితంగా 126/9తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో చాలా ముందే చేతులెత్తేసినట్లు అనిపించింది. కానీ ఆఖర్లో బ్యాట్‌ ఝళిపించిన కెప్టెన్‌ కమిన్స్‌ జట్టు స్కోరు 150 దాటించాడు. విజయకాంత్‌ (7 నాటౌట్‌)తో ఆఖరి వికెట్‌కు 33 పరుగులు జోడించిన అతడు.. చివరి ఓవర్లో వెనుదిరిగాడు.

స్టార్క్‌ షాక్‌ 

ఐపీఎల్‌ వేలంలో స్టార్క్‌కు పలికిన ధర పెను సంచలనమే రేపింది. కోల్‌కతా నుంచి అతడు అందుకున్నది ఏకంగా  రూ.24.75 కోట్లు. కొన్ని మ్యాచ్‌ల వరకు అతడు సాధించిన వికెట్ల కన్నా.. అతడు ధరకు న్యాయం చేస్తున్నాడా అన్న చర్చనే ఎక్కువ సాగింది. లీగ్‌ దశలో 12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసినా.. భారీగా (ఓవర్‌కు 11కు పైగా) పరుగులిచ్చుకున్నాడు. కోల్‌కతా అంత మొత్తం ఎందుకు పెట్టిందో క్వాలిఫయర్‌-1లో అందరికీ అర్థం అయ్యేవుంటుంది. అంతలా విజృంభించాడు స్టార్క్‌. ఈ మ్యాచ్‌ ఏకపక్షం అవ్వడానికి ప్రధాన కారణం అతడే. పదునైన పేస్‌తో సన్‌రైజర్స్‌ను బెంబేలెత్తించాడు. కోల్‌కతా పేస్‌ దాడిని ఆరంభించిన అతడు.. తన తొలి మూడు ఓవర్లలో 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను చావు దెబ్బతీశాడు. తొలి ఓవర్లో విధ్వంసక ఓపెనర్‌ హెడ్‌ను ఔట్‌ చేసి పరుగుల వేగానికి బ్రేకులు వేసిన అతడు.. ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో నితీష్‌ కుమార్‌ రెడ్డి, షాబాజ్‌లను ఔట్‌ చేసి సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఆ దెబ్బతో హైదరాబాద్‌కు తక్కువ స్కోరుతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఫలితంగా కోల్‌కతా పని తేలికైపోయింది. ఫైనల్‌కు ముందు స్టార్క్‌ ఫామ్‌ నైట్‌రైడర్స్‌కు గొప్ప సానుకూలాంశమే.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) స్టార్క్‌ 0; అభిషేక్‌ (సి) రసెల్‌ (బి) అరోరా 3; త్రిపాఠి రనౌట్‌ 55; నితీష్‌కుమార్‌ (సి) గుర్బాజ్‌ (బి) స్టార్క్‌ 9; షాబాజ్‌ (బి) స్టార్క్‌ 0; క్లాసెన్‌ (సి) రింకు (బి) వరుణ్‌ 32; సమద్‌ (సి) శ్రేయస్‌ (బి) హర్షిత్‌ 16; సన్వీర్‌ (బి) నరైన్‌ 0; కమిన్స్‌ (సి) గుర్బాజ్‌ (బి) రసెల్‌ 30; భువనేశ్వర్‌ ఎల్బీ (బి) వరుణ్‌ 0; విజయకాంత్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 159; వికెట్ల పతనం: 1-0, 2-13, 3-39, 4-39, 5-101, 6-121, 7-121, 8-125, 9-126; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-34-3; వైభవ్‌ 2-0-17-1; హర్షిత్‌ 4-0-27-1; నరైన్‌ 4-0-40-1; రసెల్‌ 1.3-0-15-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-26-2

కోల్‌కతా ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) విజయకాంత్‌ (బి) నటరాజన్‌ 23; నరైన్‌ (సి) విజయకాంత్‌ (బి) కమిన్స్‌ 21; వెంకటేశ్‌ నాటౌట్‌ 51; శ్రేయస్‌ నాటౌట్‌ 58; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (13.4 ఓవర్లలో 2 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-44, 2-67; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-28-0; కమిన్స్‌ 3-0-38-1; నటరాజన్‌ 3-0-22-1; విజయకాంత్‌ 2-0-22-0; హెడ్‌ 1.4-0-32-0; నితీష్‌కుమార్‌ 1-0-13-0

4

ఐపీఎల్‌లో ఫైనల్‌కు వెళ్లడం కోల్‌కతాకు ఇది నాలుగోసారి. 2012లో గంభీర్‌ సారథ్యంలో తొలిసారి తుదిపోరుకు చేరిన కేకేఆర్‌.. తర్వాత 2014లోనూ ఫైనల్‌కు వెళ్లింది. ఈ రెండు సందర్భాల్లో కప్‌ గెలిచింది. చివరిగా 2021లోనూ తుదిపోరుకు చేరినా.. చెన్నై చేతిలో ఓడిపోయింది. 2022, 23 టోర్నీల్లో ఆ జట్టు ఏడో స్థానంలో నిలిచింది. ఈసారి గంభీర్‌ మార్గనిర్దేశకంలో ఆ జట్టు అదిరే ప్రదర్శన చేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని