Kolkata vs Lucknow: చెలరేగిన సాల్ట్.. కోల్‌కతా సూపర్‌ విక్టరీ

కోల్‌కతా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 14 Apr 2024 19:31 IST

కోల్‌కతా: కోల్‌కతా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 162 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ (89*; 47 బంతుల్లో  14×4, 3×6)చెలరేగి ఆడాడు. సునీల్‌ నరైన్‌ (6), రఘువంశీ (7) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌ (38*, 38 బంతుల్లో 6×4) మెరుపులు ఆకట్టుకున్నాయి. లఖ్‌నవూ బౌలర్లలో మోసిన్‌ఖాన్‌ రెండు వికెట్లు రాబట్టుకున్నాడు. 

బౌండరీల మోత

లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ నరైన్‌ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. మోసిన్‌ఖాన్‌ వేసిన 1.3వ బంతికి షాట్‌ ఆడి.. స్టాయినిస్‌ చేతికి చిక్కిపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన  రఘువంశీ కూడా విఫలమయ్యాడు. మోసిన్‌ బౌలింగ్‌లోనే కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. వరుస వికెట్లు కోల్పోయినా సాల్ట్‌ ఏమాత్రం తగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి విజయానికి బాటలు వేశాడు. అగ్నికి ఆజ్యం పోసినట్లు రెండో డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తనదైన శైలిలో బ్యాటు ఝలిపించాడు. ఇద్దరూ లఖ్‌నవూ బౌలింగ్‌ను ఎడాపెడా బాదేశారు. దీంతో మరో 26 బంతులు మిగిలుండగానే కోల్‌కతా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మొత్తం 20 ఫోర్లు, 4 సిక్సర్లు నమోదయ్యాయి.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పూరన్‌ (45; 32 బంతుల్లో 2×6, 4×4) దూకుడుగా ఆడాడు. కేఎల్‌ రాహుల్‌ (39), బదోని (29) ఫర్వాలేదనిపించారు. డికాక్‌ (10), హుడా (8), స్టాయినిస్‌ (10) నిరాశపరిచారు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్‌ 3 వికెట్లు తీయగా, వైభవ్‌ అరోడా, నరైన్‌, వరుణ్, రసెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని