World Para Athletics: మన అమ్మాయి బంగారం

జపాన్‌లో ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్‌లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది.

Published : 21 May 2024 02:52 IST

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ క్రీడాకారిణి దీప్తికి స్వర్ణం
వరల్డ్‌ రికార్డు సొంతం
పారాలింపిక్స్‌కు అర్హత
కోబె (జపాన్‌)

జపాన్‌లో ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్‌లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది. కానీ ఉన్నట్టుండి శక్తి పుంజుకుని ఒక్కో అథ్లెట్‌ను దాటేస్తూ మెరుపులా దూసుకెళ్లింది. అంతేకాదు తనకూ మిగిలిన అథ్లెట్లకు మధ్య దూరాన్ని పెంచుకుంటూపోయి ఏకంగా ప్రపంచరికార్డును బద్దలు కొట్టి ఔరా అనిపించింది.

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి అయిన దీప్తి ప్రపంచ పారా ఛాంపియన్‌గా అవతరించింది. పారాలింపిక్స్‌తో సమానంగా భావించే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. సోమవారం మహిళల టీ20 400 మీటర్ల పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ క్రమంలోనే 20 ఏళ్ల దీప్తి.. నిరుడు పారిస్‌లో బ్రెనా క్లార్క్‌ (55.12 సె- అమెరికా) నమోదు చేసిన రికార్డును తిరగరాసి పారిస్‌ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఐసెల్‌ ఓండర్‌ (55.19 సె- టర్కీ) రజతం, లాజాన్‌షెలా ఆంగులో (56.68 సె- ఈక్వెడార్‌) కాంస్యం నెగ్గారు. ఆదివారం జరిగిన హీట్స్‌లోనూ దీప్తి ఆసియా రికార్డు (56.18) అధిగమించి ఫైనల్‌కు అర్హత సాధించింది. మానసిక లోపమున్న క్రీడాకారులు టీ20 విభాగంలో బరిలో దిగుతారు. పురుషుల విభాగంలో యోగేశ్‌ కథునియా రజత పతకం గెలుపొందాడు. ఎఫ్‌56 డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ (41.80 మీటర్లు) రెండో స్థానం సాధించాడు. మహిళల ఎఫ్‌34 షాట్‌పుట్‌లో భాగ్యశ్రీ జాదవ్‌ (7.56 మీ) రజతం గెలిచింది. ప్రస్తుతం భారత్‌ ఖాతాలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.


గొప్ప ఘనత

‘‘అద్వితీయమైన ఘనత సాధించిన దీప్తికి అభినందనలు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం చాలా పెద్ద ఘనత. అందులోనూ ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకం గెలవడం అసామాన్యం. దేశంలో ఎంతోమంది క్రీడాకారులకు దీప్తి స్ఫూర్తిగా నిలుస్తుంది’’

పుల్లెల గోపీచంద్, ‘లక్ష్య’ మెంటార్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని