T20 League : టీ20 లీగ్‌.. గత వారం అద్భుతాలివే.. వచ్చే వారం ప్రతి జట్టుకూ కీలకమే!

టీ20 లీగ్‌లోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ లక్ష్యాలను ...

Published : 02 May 2022 18:00 IST

ప్లేఆఫ్స్ అవకాశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ లక్ష్యాలను ఛేదించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొన్ని జట్లైతే స్వల్ప స్కోర్లను కాపాడుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పటి వరకు 46 లీగ్‌మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గత వారం (సోమవారం నుంచి ఆదివారం) తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. వాటి సంగతేంటో ఓసారి చూద్దాం.. అలానే ఇవాళ్టి నుంచి వచ్చే ఆదివారం వరకు మరో తొమ్మిది మ్యాచ్‌లు జరుగుతాయి.. ఎవరెవరి మధ్య ఎప్పుడో తెలుసుకుందాం.. 

గత వారం రివ్యూ..

* ముంబయి తొలి విజయం: ఏప్రిల్ 25 నుంచి మే 1వ తేదీ వరకు జరిగిన మ్యాచుల్లో హైలైట్‌గా నిలిచేది ముంబయి X రాజస్థాన్‌ మ్యాచ్‌. వరుసగా ఎనిమిది మ్యాచ్‌లను ఓడిన ముంబయి ఎట్టకేలకు తొమ్మిదో మ్యాచ్‌ (ఏప్రిల్ 30)లో మొదటి విజయం రుచి చూసింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 158 పరుగులు చేయగా.. ముంబయి ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది. 

* కెప్టెన్‌ మారాడు: మిస్టర్‌ కెప్టెన్‌ కూల్‌ మరోసారి చెన్నై సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. మే1న హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ధోనీకే మళ్లీ జట్టు పగ్గాలను యాజమాన్యం అప్పగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 202/2 భారీ స్కోరు చేయగా.. హైదరాబాద్‌ 189/6 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. ఇది చెన్నైకి మూడో విజయం. 

* ప్లేఆఫ్స్‌కు గుజరాత్‌: హైదరాబాద్‌తో మినహా తొమ్మిదికి ఎనిమిది మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్‌ ప్లేఆఫ్స్‌లో బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.  ఏప్రిల్‌ 30న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్‌ కేవలం నాలుగు వికెట్లను కోల్పోయి 174 పరుగులు చేసి విజయం సాధించింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచుల్లో చివరి ఓవర్లలోనే గుజరాత్‌ గెలవడం గమనార్హం. 

* వరుసగా రెండో ఓటమి:  తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన హైదరాబాద్‌ తర్వాత ఐదు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. అయితే ఈ వారంలో జరిగిన రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌ ఓడింది. ఏప్రిల్ 27న గుజరాత్‌పై, మే 1న చెన్నై ఓటమిపాలైంది. దీంతో టాప్‌-4లో ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్‌ అవకాశాలను తగ్గించుకుంటోంది. గుజరాత్‌తో ఆఖర్లో బౌలర్లు తడబడటంతో పరాజయం పాలైంది. ఇక చెన్నైపై భారీ లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చి ఓడింది. అలానే కోల్‌కతా కూడానూ వరుసగా ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.

* మరోసారి బెంగళూరు విఫలం: హైదరాబాద్‌పై ఘోర ఓటమిని చవిచూసిన బెంగళూరు తీరు మారలేదు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బ్యాటర్లు విఫలం కావడం గమనార్హం. 145 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 115 పరుగులకే కుప్పకూలి బెంగళూరు ఓడింది. డుప్లెసిస్‌ (23), రాజత్ పాటిదార్ (16), షాహ్‌బాజ్‌ (17), హసరంగ (18) మినహా ఎవరూ రెండంకెల స్కోరును కూడా నమోదు చేయలేదు. అంతకుముందు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులకే కుప్పకూలి ఘోర అవమానం ఎదుర్కొంది. 

ఈ వారం అసలైన పోరు  

ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఎవరికి ఎలా ఉంటాయో దాదాపుగా ఈ వారం (మే 2 నుంచి మే 8వరకు) తేలిపోనుంది. శని, ఆదివారాల్లో డబుల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో ఉన్న జట్లతోపాటు ఏడో స్థానంలోపు ఉన్న టీమ్‌లకు కీలకం. హైదరాబాద్‌, బెంగళూరు పదేసి పాయింట్లతో ఉన్నాయి. వీటి వెనుకనే దిల్లీ, పంజాబ్‌ ఎనిమిదేసి పాయింట్లతో కాచుకుని ఉన్నాయి. ఏమాత్రం అవకాశం ఇచ్చినా ప్లేఆఫ్స్‌ అవకాశాలు సన్నగిల్లినట్లే.. కోల్‌కతా-రాజస్థాన్‌ (మే 2), గుజరాత్-పంజాబ్ (మే 3), బెంగళూరు-చెన్నై (మే 4), దిల్లీ-హైదరాబాద్ (మే 5), గుజరాత్-ముంబయి (మే 6), పంజాబ్‌- రాజస్థాన్‌ (మే 7), లఖ్‌నవూ-కోల్‌కతా (మే 7), హైదరాబాద్‌-బెంగళూరు (మే 8), చెన్నై-దిల్లీ (మే 8) మ్యాచ్‌లు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని