Sourav Ganguly: దిల్లీలో రెజ్లర్ల నిరసనలు.. గంగూలీ స్పందన ఇదే!

వీలైనంత త్వరగా రెజ్లర్ల సమస్య పరిష్కారం కావాలని భారత మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) ఆకాంక్షించారు. అయితే, ఈ విషయం తనకు పూర్తి స్థాయి అవగాహన లేదని అందుకే ఎలాంటి కామెంట్స్‌ చేయదలచు కోలేదని చెప్పారు.

Published : 05 May 2023 22:03 IST

దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. ఈ అంశంపై మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) స్పందించారు. వాళ్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో తనకు పెద్దగా అవగాహన లేదని అందుకే దీనిపై ఎలాంటి కామెంట్స్‌ చేయదలచుకోలేదని గంగూలీ వ్యాఖ్యానించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 23 నుంచి దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెజ్లర్లు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఏడుగురు మహిళా రెజ్లర్లపై అతడు బెదిరింపులకు పాల్పడ్డారని, అందులో ఒకరు మైనర్‌ కూడా ఉన్నారని దిగ్గజ రెజ్లర్లంతా ఆరోపిస్తున్నారు.

దీనిపై గంగూలీ మాట్లాడుతూ..‘‘ వాళ్ల పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియదు. వార్తాపత్రికల్లో చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నా. కానీ, పూర్తి అవగాహన లేదు. క్రీడా ప్రపంచంలో నాకొక విషయం బోధపడింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలియనప్పుడు.. దాని కోసం మాట్లాడకపోవడమే ఉత్తమం.’’ అని ఓ జాతీయ మీడియాతో అన్నారు. రెజ్లర్ల సమస్య పరిష్కారం అవుతుందనే భావిస్తున్నానని, వాళ్లంతా దేశానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చి, ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రశంసించేలా చేశారని అన్నారు. వాళ్ల సమస్యలు పరిష్కారం వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు గంగూలీ తెలిపారు.

బ్రిజ్‌ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని దేశంలోని ప్రముఖ మహిళా రెజ్లర్లు రెండు వారాల క్రితం జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అతడిపై కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశిస్తూ విచారణను ముగించింది. ఈ మేరకు మైనర్‌ సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో పోక్సో కేసుతోపాటు, మరో కేసును నమోదు చేశారు. దీనిపై రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని, కానీ, తమ నిరసన మాత్రం కొనసాగుతందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు రెజ్లర్లకు ఎదురుదెబ్బ కాదని, ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఏం చేయగలదో.. అదే పని చేసిందని ఆమె చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని