Longest Sixes: దంచికొట్టారు.. సిక్సర్ల మోత మోగించారు..!

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ పూర్తయింది. జోస్‌బట్లర్‌ (863) అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. బౌండరీలు (83), సిక్సర్ల (45)లోనూ అతడే ముందున్నాడు...

Updated : 30 May 2022 11:42 IST

ఈ సీజన్‌లో అత్యధికం.. భారీ సిక్సర్లు ఇవే

(Photo: Livingstone, Tim David, Dewald Brevis, Nicholas Pooran, Jos Buttler Instagrams)

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ పూర్తయింది. జోస్‌బట్లర్‌ (863) అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. బౌండరీలు (83), సిక్సర్ల (45) జాబితాలోనూ అతడే ముందున్నాడు. మరోవైపు ఈ సీజన్‌లో తొలిసారి వెయ్యికిపైగా సిక్సర్లు నమోదయ్యాయి. మొత్తంగా (1,062) సార్లు బంతి బౌండరీ అవతలికి దూసుకెళ్లింది. అందులో అతి పెద్ద సిక్సర్లు కొట్టిన వాళ్లు ఎవరో.. ఏ జట్టుపై ఎంత దూరం కొట్టారో ఓ లుక్కేద్దాం..


* ఈ సీజన్‌లో అందరికన్నా అత్యధిక దూరం సిక్సర్‌ కొట్టిన ఆటగాడు పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌. గుజరాత్‌తో తలపడిన మ్యాచ్‌లో అతడు మహ్మద్‌ షమి బౌలింగ్‌లో 117 మీటర్ల దూరం బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. ఇది ఈ టోర్నీ చరిత్రలో పదో భారీ సిక్సర్‌గా నిలిచింది.


* ఇక రెండో అత్యధిక దూరం సిక్సర్‌ కొట్టింది ముంబయి బ్యాట్స్‌మన్‌ టిమ్‌ డేవిడ్‌. హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో అతడు నటరాజన్‌ బౌలింగ్‌లో 114 మీటర్ల సిక్సర్‌ సంధించాడు.


* మరో ముంబయి ఆటగాడు డివాల్డ్‌ బ్రెవిస్‌ పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో మూడో భారీ సిక్సర్‌ కొట్టాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో అతడు 112 మీటర్లు దంచికొట్టి అభిమానులను అలరించాడు.


* ఇక నాలుగో పెద్ద సిక్సర్‌ కొట్టింది కూడా లివింగ్‌స్టోన్‌ కావడం విశేషం. ఈసారి చెన్నై జట్టుతో ఆడిన మ్యాచ్‌లో ముఖేశ్‌ చౌదరి బౌలింగ్‌లో అతడు 108 మీటర్ల దూరంలో బంతిని సంధించాడు.


* హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోకపోయినా దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో నార్జే బౌలింగ్‌లో 108 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాడు.  ఈ సీజన్‌లో ఐదో పెద్ద సిక్సర్‌గా నమోదు చేశాడు.


* అత్యధిక పరుగుల వీరుడు జోస్‌ బట్లర్‌ ఈ సీజన్‌లో మొత్తం 45 సిక్సులు బాదినా.. భారీ సిక్సర్‌ మాత్రం 107 మీటర్ల దూరంలోనే దంచికొట్టాడు. దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో దీన్ని సాధించాడు.


* లివింగ్‌స్టోన్‌ మూడోసారి భారీ సిక్సర్‌ కొట్టాడు. హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో అతడు ఈ సీజన్‌లోనే అత్యధిక వేగవంతమైన బౌలింగ్‌ చేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో 106 మీటర్ల సిక్సర్‌ కొట్టాడు. దీన్ని ఏడో మేటి సిక్సర్‌గా నిలిపాడు.


* రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ కూడా మరోసారి భారీ సిక్సర్‌ సంధించాడు. దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో 105 మీటర్ల సిక్సర్‌ బాదాడు. దీన్ని ఎనిమిదో భారీ సిక్సర్‌గా నమోదు చేశాడు.


* లివింగ్‌స్టోన్‌ నాలుగోసారి బెంగళూరు జట్టుపై భారీ సిక్సర్‌ సాధించాడు. అత్యధిక వికెట్లు తీసిన షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అతడు ఈసారి 105 మీటర్ల సిక్సర్‌ బాదాడు.


* లఖ్‌నవూ బ్యాట్స్‌మన్‌ మార్కస్‌ స్టాయినిస్‌ ఈ సీజన్‌లో పదో భారీ సిక్సర్‌ కొట్టాడు. ముంబయితో ఆడిన మ్యాచ్‌లో అతడు మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో 104 మీటర్ల దూరం బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు.


* ఇక పంజాబ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో డివాల్డ్‌ బ్రెవిస్‌, బెంగళూరు పేసర్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో చెన్నై ఆటగాడు శివమ్‌ దూబే, హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో దిల్లీ బ్యాట్స్‌మన్‌ రోమన్‌ పావెల్‌.. 102 మీటర్ల సిక్సర్లు బాది ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని