Cricketers - Restaurants: రెస్టారెంట్‌ ఓనర్లుగా క్రికెటర్లు.. ఆ జాబితా చూసేద్దాం!

క్రికెటర్లు రెస్టారెంట్ల యజమానులుగా మారిపోయిన జాబితాలోకి టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా (Suresh Raina) చేరిపోయాడు. నెదర్లాండ్స్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.

Updated : 24 Jun 2023 17:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా తాజాగా రెస్టారెంట్‌ యజమానిగా మారిపోయాడు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.  రైనా కంటే ముందు అంతర్జాతీయ క్రికెటర్లు ‘ఫుడ్‌ బిజినెస్‌’లోకి ప్రవేశించారు. మరి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఓ లుక్‌ వేసేద్దాం.. 

  1. కపిల్ ఎలెవన్: టీమ్‌ ఇండియాకు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన సారథి కపిల్‌ దేవ్‌ (Kapil) 2008లో పట్నాలో ‘ఎలెవన్‌’ పేరిట రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఇండియన్‌, పాన్‌ ఏషియన్‌, కాంటినెంటల్‌ వంటకాలను అక్కడ వడ్డిస్తారు. ఇక్కడ క్రికెట్‌కు సంబంధించిన పరికరాలు, ట్రోఫీల నకళ్లను ఉంచారు. లోపలికి వెళ్లగానే మైదానంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఉంటుంది. 
  2. జడ్డూ ఫుడ్‌ ఫీల్డ్‌: ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పదేళ్ల కిందటే ఫుడ్‌ బిజినెస్‌లోకి దిగాడు. అతడి కుటుంబ సభ్యులతో కలిసి ‘జడ్డూ ఫుడ్‌ ఫీల్డ్‌’ పేరిట రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. రాజ్‌కోట్‌ వేదికగా 2012లో మొదలు పెట్టడం విశేషం. ఇండియన్‌, మెక్సికన్, చైనీస్, థాయ్‌, కాంటినెంటల్‌, పంజాబీ వంటకాలు అందుబాటులో ఉంటాయి. 
  3. వన్‌8 కమ్యూనీ - న్యూవా: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సొంతూరు దిల్లీలో ‘న్యూవా’తో పాటు వన్‌8 కమ్యూనీ అనే పేరుతో రెస్టారెంట్‌ చైన్‌ బిజినెస్‌ను నడిపిస్తున్నాడు. వన్ 8 కమ్యూనీని దిల్లీ, కోల్‌కతాలో నిర్వహిస్తున్నాడు. దేశ, విదేశాలకు చెందిన వంటకాలు, డ్రింక్స్‌ ఇక్కడ దొరుకుతాయి. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ప్రారంభించాడు.
  4. డైన్‌ ఫైన్‌: భారత మాజీ పేసర్ జహీర్‌ ఖాన్‌కూ (Zaheer Khan) హోటల్‌ రంగంపై అమితమైన ప్రేమ ఉంది. పుణెలో 2005లోనే ‘డైన్ ఫైన్‌’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.  2013లో టాస్‌ స్పోర్ట్స్‌ లాంజ్‌ను కూడా  పుణెలోనే విస్తరించాడు. జహీర్‌ ఖాన్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఈ రెస్టారెంట్, లాంజ్‌ ఒక భాగం కావడం విశేషం. 
  5. సచిన్స్‌: క్రికెట్‌లో వంద శతకాలు బాదిన సచిన్‌ తెందూల్కర్‌ (Sachin) కూడా మంచి ‘మాస్టర్‌’ చెఫ్‌. సరదాగా వంటలు చేస్తూ ఇటీవల వీడియోలను కూడా పోస్టు చేస్తుంటాడు. మరి అలాంటి సచిన్‌ కూడా రెస్టారెంట్లను ప్రారంభించాడు. ‘సచిన్స్‌’ పేరిట మొదలు పెట్టినప్పటికీ అనుకున్న విధంగా సక్సెస్‌ కాకపోవడంతో మధ్యలోనే మూసేయాల్సి వచ్చింది.
  6. మినిస్ట్రీ ఆఫ్‌ క్రాబ్: శ్రీలంక మాజీ క్రికెటర్లు మహేల జయవర్థెనె, కుమార సంగక్కర, ప్రముఖ చెఫ్‌ దర్శన్‌ మునిదస కలిసి సంయుక్తంగా రెస్టారెంట్లను ప్రారంభించారు. ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం విశేషం. షాంఘై, మనీలా, కొలంబియా, చెంగ్దు, బ్యాంకాక్‌, ముంబయిలో రెస్టారెంట్లు ఉన్నాయి. సుందరమైన ప్రాంతంలో ఇష్టమైన ఫుడ్‌ను ఆస్వాదించే అర్థం వచ్చేలా రెస్టారెంట్లకు నామకరణం చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని