IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్‌’ ఎక్కించింది.. ‘సుడులు’ తిప్పిన బౌలర్లు

భారత్‌ - న్యూజిలాండ్ (IND vs NZ)  జట్ల మధ్య లఖ్‌నవూ వేదికగా (Lucknow) రెండో టీ20 మ్యాచ్ ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. చివరికి టీమ్‌ఇండియా (Team India) విజయం సాధించింది. అయితే పిచ్‌ విపరీతంగా స్పిన్నర్లకు సహకరించడంతో స్వల్ప స్కోర్లు నమోదు కావడం అభిమానులకు రుచించలేదు. 

Updated : 30 Jan 2023 19:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లఖ్‌నవూ పిచ్‌.. బ్యాటర్ల గుండెల్లో ‘సుడులు’ తిప్పేసింది. వంద పరుగుల లక్ష్యమే కదా.. టీ20ల్లో ఆడుతూ పాడుతూ ఛేదించేస్తారని అంతా అనుకొన్నారు. కానీ, బ్యాటర్ల సామర్థ్యానికి సవాల్‌ విసురుతూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్‌లో విజయం భారత పక్షమైనా.. చిన్న లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించిన న్యూజిలాండ్‌ పోరాటం కూడా ప్రశంసలు కురిపించింది. మరి ఇలాంటి పిచ్‌ పరిస్థితిపై ఇరు జట్ల సారథులు ముందే అంచనాకు వచ్చినప్పటికీ.. మరీ ఇలా ఉంటుందని మాత్రం వారు కూడా ఊహించలేకపోయారు. 

‘‘ఇక్కడి పిచ్‌ గణాంకాలను పరిశీలిస్తే ఛేదన కష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే తొలుత మేం బ్యాటింగ్‌ ఎంచుకొన్నాం’’.. ఇదీ కివీస్‌ సారథి మిచెల్ శాంట్నర్ టాస్‌ నెగ్గిన తర్వాత చెప్పిన మాట. అక్షరాలా పిచ్‌ స్వభావం చివరి వరకూ అలాగే సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ వంద లోపు స్కోరుకే పరిమితం కావడంతో సరిపోయింది. కనీసం మరో 10 నుంచి 20 పరుగులు చేసినా పరిస్థితి వేరేలా ఉండేదని భారత అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ‘‘ ఈ పిచ్‌ మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. టర్నింగ్‌ మరీ విపరీతంగా ఉంది. టీ20లకు సరిపోయే వికెట్‌ మాత్రం కాదు. అందుకే క్యురేటర్‌ మంచి పిచ్‌ తయారీపై మరింత దృష్టిపెట్టాలి’’ అని వ్యాఖ్యానించాడు. 

పిచ్‌ రిపోర్ట్‌ ఏం చెప్పింది..?

క్యురేటర్‌, క్రికెట్ విశ్లేషకుల అంచనాలను బట్టి లఖ్‌నవూ పిచ్‌ ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 157 కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 129 మాత్రమే. అందుకే టాస్‌ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొంటుంది. పిచ్‌ మీద పగుళ్లు ఎక్కువగా ఉండటం వల్ల బంతి టర్నింగ్‌ ఎక్కువైంది. స్లో బౌలర్లకు సహకారం లభించింది. అందుకే కివీస్‌ ఎక్కువగా స్పిన్నర్లను ప్రయోగించిన విషయం గమనార్హం. అయితే బ్యాటింగ్‌లో కుదురుకుంటే మాత్రం భారీ ఇన్నింగ్స్‌లూ ఆడొచ్చని క్రీడా పండితుల విశ్లేషణ. లక్ష్యం తక్కువగా ఉంది కాబట్టి.. సూర్య (31 బంతుల్లో 26*), ఇషాన్ (32 బంతుల్లో 19) కొన్ని బంతులను వృథా చేసినా ఇబ్బంది లేకుండాపోయింది. అదే టార్గెట్‌ 120 పరుగులు ఉంటే మాత్రం భారత్‌కు కష్టంగానే మారేది. టీ20ల్లో క్రీజ్‌లో పాతుకుపోయేందుకు సమయం తీసుకోవడం కుదరదు. అందుకే భారత్ - కివీస్ రెండో టీ20 మ్యాచ్ చూశాక.. ఇలాంటి పిచ్‌ పొట్టి ఫార్మాట్‌కు పనికిరాదనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. 

భారత బౌలింగ్‌ కోచ్‌ ఏమన్నాడంటే?

లఖ్‌నవూ పిచ్‌ గురించి కెప్టెన్ హార్దిక్‌ చేసిన వ్యాఖ్యలపై భారత బౌలింగ్‌ కోచ్ స్పందించాడు. ‘‘పిచ్‌ పరిస్థితి గురించి మాట్లాడేందుకు సరైన వ్యక్తి క్యురేటర్ మాత్రమే. అతడే సమాధానం ఇవ్వగలడు. అయితే ఇలాంటి పిచ్‌ మీద ఆడటం మాత్రం పెద్ద సవాలే. అదృష్టవశాత్తూ మ్యాచ్‌ను మనం నియంత్రించాం. ఈ పిచ్‌ మీద 120-130 టార్గెట్‌ను ఛేదించడం చాలా కష్టంగా ఉండేది. టీమ్‌ఇండియా బౌలర్లు అద్భుతంగా బంతులను సంధించి కివీస్‌ను 99కే కట్టడి చేశారు. తొలుత పిచ్‌ను చూసినప్పుడు చాలా పొడిగా ఉంది. మధ్యలోనే కాస్త గ్రాస్‌ ఉంది. కానీ, వికెట్‌కు రెండు వైపులా పగుళ్లు వచ్చాయి. మ్యాచ్‌కు ముందు రోజే పిచ్‌ను చూడగానే.. ఇక్కడ టర్నింగ్‌ బాగుంటుందని, సవాల్‌ తప్పదని అనుకొన్నాం’’ అని పరాస్ మాంబ్రే వెల్లడించాడు. 

అందరిలోనూ ఉత్కంఠ రేపింది..: వాషింగ్టన్

‘‘మాతోపాటు స్టేడియంలో, టీవీల్లో వీక్షించిన అభిమానులు.. అలాగే మీరు (కామెంటేటర్లు) కూడా ఉత్కంఠను అనుభవించారు. మ్యాచ్‌లో విజయం సాధించే వరకు కుదురుగా ఉండలేకపోయాం. ఇలాంటి పిచ్‌పై ఆడటం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అన్ని జట్లూ ఇతర దేశాలకు పర్యటించినప్పుడు కావాల్సినన్ని బౌలింగ్‌ వనరులతో వస్తాయి. అయితే ఇలా ఎక్కువగా స్పిన్‌ పిచ్‌ల మీద ఆడేటప్పుడు నైపుణ్యమంతా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక మ్యాచ్‌లో రనౌట్లు జరగడం సర్వసాధారణం. అయితే క్రీజ్‌లో సీనియర్‌ ఆటగాడు సూర్యకుమార్‌ ఉండటం చాలా ముఖ్యమనిపించింది’’ అని సుందర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని