పూరన్‌ దంచెన్‌

ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్‌ సీజన్‌ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్‌నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది.

Updated : 18 May 2024 06:39 IST

రాణించిన రాహుల్, బిష్ణోయ్‌
ముంబయిపై లఖ్‌నవూ గెలుపు

ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్‌ సీజన్‌ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్‌నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. పూరన్‌ విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు చేసిన లఖ్‌నవూ విజయాన్ని సొంతం చేసుకుంది. 14 పాయింట్లతో ప్రస్తుతానికి చెన్నైతో సమానంగా నిలిచినా.. రన్‌రేట్‌లో వెనకబడివున్న లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

ముంబయి

ఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ అదరగొట్టింది. హ్యాట్రిక్‌ ఓటములతో ఉక్కిరిబిక్కిరైన ఆ జట్టు.. సీజన్లో ఆఖరి మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఆ జట్టు 18 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. మొదట ఎల్‌ఎస్‌జీ 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. పూరన్‌ (75; 29 బంతుల్లో 5×4, 8×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ రాహుల్‌ (55; 41 బంతుల్లో 3×4, 3×6) కూడా రాణించాడు. ఛేదనలో ముంబయి 196/6కే పరిమితమైంది. రోహిత్‌శర్మ (68; 38 బంతుల్లో 10×4, 3×6), నమన్‌ ధీర్‌ (62 నాటౌట్‌; 28 బంతుల్లో 4×4, 5×6) పోరాటం సరిపోలేదు. రవి బిష్ణోయ్‌ (2/37) రాణించాడు.

రోహిత్‌ బాదినా..: భారీ ఛేదనలో ముంబయి కూడా ధాటిగానే మొదలుపెట్టింది. ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్‌ రోహిత్‌ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. హెన్రీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. 3.5 ఓవర్లలో 33/0తో ముంబయికి శుభారంభం లభించింది. ఈ స్థితిలో వర్షం రావడంతో మ్యాచ్‌ కాసేపు ఆగింది. మ్యాచ్‌ తిరిగి మొదలయ్యాక రోహిత్‌ అదే జోరు కొనసాగించాడు. మోసిన్‌ఖాన్‌ వేసిన ఏడో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదిన అతడు 28 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాతా అతడి దూకుడు కొనసాగింది. దీంతో ముంబయి 8 ఓవర్లకు 78/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ మూడు ఓవర్ల వ్యవధిలో బ్రెవిస్‌ (23), సూర్యకుమార్‌ (0)తో పాటు కుదురుకున్న రోహిత్‌ కూడా ఔట్‌ కావడంతో ముంబయి 10.5 ఓవర్లలో 97/3తో ఇబ్బందుల్లో పడింది. వికెట్లు పడుతూనే పోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. నమన్‌ ధీర్‌ దూకుడుగా ఆడి ముంబయిలో ఆశలు రేపాడు. నవీనుల్‌ వేసిన ఆఖరి ఓవర్లో 34 పరుగులు అవసరం కాగా.. ఇషాన్‌ (14) వికెట్‌ కోల్పోయిన ముంబయి 15 పరుగులే చేయగలిగింది. 

పూరన్‌ ధనాధన్‌: అంతకుముందు లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరుకి.. ముగిసిన విధానానికి పొంతనే లేదు. 10 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 69/3. కానీ మరో 10 ఓవర్లలో ఏకంగా 145 పరుగులు రాబట్టింది. స్కోరు 200 దాటేసింది. దీనికి కారణం నికోలస్‌ పూరన్‌! విధ్వంసక విన్యాసాలతో చెలరేగిపోయిన ఈ కరీబియన్‌ స్టార్‌.. లఖ్‌నవూకు ఊహించని స్కోరు అందించాడు. అంతకుముందు ఇన్నింగ్స్‌ మూడో బంతికే పడిక్కల్‌ (0) వికెట్‌ కోల్పోయిన ఎల్‌ఎస్‌జీ.. 3 ఓవర్లకు చేసింది స్కోరు 14 పరుగులే. రాహుల్, స్టాయినిస్‌ (28) కాస్త బ్యాట్‌ ఝళిపించడంతో స్కోరు కదలింది. స్టాయినిస్‌ ఔటయ్యాక పరుగుల రాక మళ్లీ తగ్గిపోయింది. లఖ్‌నవూను చూస్తే కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ స్థితిలో వీర విధ్వంసం సృష్టించిన పూరన్‌.. ముంబయి బౌలర్లను ఉతికారేశాడు. సిక్స్‌లు కొట్టడమే పని అన్నట్టుగా ఆడిన అతడు.. స్కోరును అనూహ్యంగా పెంచేశాడు. అన్షుల్‌ కాంభోజ్‌ వేసిన 13వ ఓవర్‌ నుంచి మొదలైంది పూరన్‌ దాడి. ఆ ఓవర్లో అతడి దెబ్బకు 22 పరుగులొచ్చాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అర్జున్‌ తెందుల్కర్‌ వేసిన 14వ ఓవర్లో తొలి రెండు బంతులను పూరన్‌ స్టాండ్స్‌లోకి పంపాడు. ఆపై కండరాలు పట్టేయడంతో అర్జున్‌ డగౌట్‌కు వెళ్లిపోతే మిగిలిన బంతులను నమన్‌ ధీర్‌ వేశాడు. అతడినీ పూరన్‌ వదల్లేదు. 4 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాది మొత్తంగా 29 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే అతడి అర్ధసెంచరీ పూర్తపోయింది. పూరన్‌ ధాటికి లఖ్‌నవూ 5 ఓవర్ల వ్యవధిలో 90 పరుగులు రాబట్టింది. అతడికి తోడు రాహుల్‌ కూడా ఓ చేయి వేయడంతో స్కోరు దూసుకెళ్లింది. పూరన్‌తో పాటు అర్షద్‌ఖాన్‌ (0), రాహుల్‌ ఓవర్‌ వ్యవధిలో ఔటైనా.. ఆయుష్‌ బదోని (22 నాటౌట్‌) దూకుడుగా ఆడి లఖ్‌నవూ స్కోరు 200 దాటించాడు. తుషార (3/28), చావ్లా (3/29) సత్తా చాటారు.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) తుషార (బి) చావ్లా 55; పడిక్కల్‌ ఎల్బీ (బి) తుషార 0; స్టాయినిస్‌ ఎల్బీ చావ్లా 28; దీపక్‌ హుడా (సి) వధేరా (బి) చావ్లా 11; పూరన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) తుషార 75; అర్షద్‌ (సి) వధేరా (బి) తుషార 0; బదోని నాటౌట్‌ 22; కృనాల్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214; వికెట్ల పతనం: 1-1, 2-49, 3-69, 4-178, 5-178, 6-178; బౌలింగ్‌: తుషార 4-0-28-3; అర్జున్‌ తెందుల్కర్‌ 2.2-0-22-0; అన్షుల్‌ 3-0-48-0; చావ్లా 4-0-29-3; వధేరా 2-0-13-0; హార్దిక్‌ 2-0-27-0; నమన్‌ ధీర్‌ 0.4-0-17-0; షెపర్డ్‌ 2-0-30-0

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మోసిన్‌ (బి) బిష్ణోయ్‌ 68; బ్రెవిస్‌ (సి) కృనాల్‌ (బి) నవీనుల్‌ 23; సూర్యకుమార్‌ (సి) బిష్ణోయ్‌ (బి) కృనాల్‌ 0; ఇషాన్‌ (బి) నవీనుల్‌ 14; హార్దిక్‌ (సి) నవీనుల్‌ (బి) మోసిన్‌ 16; వధేరా (సి) కృనాల్‌ (బి) బిష్ణోయ్‌ 1; నమన్‌ నాటౌట్‌ 62; షెపర్డ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు: 11 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196; వికెట్ల పతనం: 1-88, 2-89, 3-97, 4-116, 5-120, 6-188; బౌలింగ్‌: అర్షద్‌ 2-0-11-0; హెన్రీ 2-0-24-0; కృనాల్‌ 4-0-29-1; మోసిన్‌ 4-0-45-1; నవీనుల్‌ హక్‌ 4-0-50-2; రవి బిష్ణోయ్‌ 4-0-37-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు