Chennai vs Lucknow: శతకంతో అదరగొట్టిన స్టాయినిస్‌.. చెన్నైపై లఖ్‌నవూ థ్రిల్లింగ్‌ విక్టరీ

ఐపీఎల్‌-2024లో లఖ్‌నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది.

Updated : 24 Apr 2024 00:39 IST

చెన్నై: ఐపీఎల్‌-2024లో లఖ్‌నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లఖ్‌నవూ బ్యాటర్లలో మార్కస్‌ స్టాయినిస్ (124*; 63 బంతుల్లో) శతకంతో అదరగొట్టాడు. పూరన్‌ (34; 14 బంతుల్లో), చివర్లో దీపక్‌ హూడా (17*; 6 బంతుల్లో) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లలో పతిరన 2, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 1, దీపక్‌ చాహర్‌ 1 వికెట్ తీశారు.

స్టాయినిస్‌ అదిరిపోయే ఇన్నింగ్స్‌..

211 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. క్వింటన్‌ డికాక్‌ను (0) చాహర్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక ఐదో ఓవర్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (16: 14 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు చిక్కాడు. అప్పటికి లఖ్‌నవూ స్కోర్‌ 33 పరుగులు. దీంతో క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (13: 19 బంతుల్లో)తో కలిసి స్టాయినిస్‌ (124*: 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెళ్లిగా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన స్టాయినిస్‌.. 8 ఓవర్‌లో ఒక సిక్స్‌, తొమ్మిదో ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. పది ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులతో నిలిచింది. అప్పటికే స్టాయినిస్‌ అర్ధశతకం (26 బంతుల్లో) చేశాడు. ఈ క్రమంలో పతిరన వేసిన 11 ఓవర్‌లో పడిక్కల్‌ బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూరన్‌తో కలిసి స్టాయినిస్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. 13వ ఓవర్‌లో మార్కస్‌ సిక్స్‌, ఫోర్‌ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. ఇక 16వ ఓవర్లో శార్దుల్‌ ఠాకూర్‌కు పూరన్‌ విశ్వరూపం చూపాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి.

దీంతో 4 ఓవర్లలో లఖ్‌నవూ విజయ లక్ష్యం 54 పరుగులుగా మారింది. 17వ ఓవర్‌ వేసిన పతిరన తన సూపర్‌ బౌలింగ్‌తో పూరన్‌ను ఔట్‌ చేయడమే కాకుండా కేవలం 7 పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్‌ వేసిన ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన స్టాయినిస్‌ మరో రెండు పరుగులు చేసి ఈ సీజన్‌లో తొలి శతకం (56 బంతుల్లో) చేశాడు. మరో బ్యాటర్‌ హుడా చివరి బంతికి కొట్టడంతో ఈ ఓవర్లో 15 పరుగుల వచ్చాయి. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 32గా మారింది. ఇక 19వ ఓవర్లో స్టాయినిస్‌ ఒక ఫోర్‌ కొట్టగా, హుడా రెండు ఫోర్లతో విరుచుకుపడడంతో ఈ ఓవర్లోనూ 15 పరుగుల వచ్చాయి. ఇక చివరి ఓవర్లో లఖ్‌నవూ లక్ష్యం 17 పరుగులుగా మారింది. స్ట్రైకింగ్‌లో ఉన్న స్టాయినిస్‌.. ముస్తాఫిజుర్‌ వేసిన తొలి బంతికి సిక్స్‌ కొట్టాడు. రెండో బంతిని ఫోర్‌ బాదాడు. మూడో బంతికి స్టాయినిస్‌ మరో ఫోర్‌ కొట్టడంతో పాటు అంఫైర్‌ దాన్ని నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాతి బంతిని ఫోర్‌ కొట్టడంతో లఖ్‌నవూ సంబరాల్లో మునిగితేలింది.  

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (108*), శివం దుబే (66) చెలరేగి ఆడారు. లఖ్‌నవూ బౌలర్లలో హెన్రీ, మోసిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని