FIFA World Cup: ఆట మధ్యలో.. మైదానంలోకి దూసుకొచ్చి నిరసన..

సోమవారం పోర్చుగల్‌, ఉరుగ్వే మధ్య  పోరు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చి పలు అంశాలపై నిరసన వ్యక్తం చేశాడు.

Updated : 29 Nov 2022 11:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీకి పాకింది. సోమవారం పోర్చుగల్‌, ఉరుగ్వే మధ్య  పోరు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చి ఇరాన్‌ ఆందోళనలు సహా పలు అంశాలపై నిరసన వ్యక్తం చేశాడు.

మ్యాచ్‌ రెండో అర్ధభాగంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. ‘ఇరాన్‌ మహిళలను గౌరవించండి’ అని రాసి ఉన్న టీషర్ట్‌ ధరించి.. రెయిన్‌బో రంగుల జెండా పట్టుకుని దాదాపు 30 సెకన్లపాటు మైదానంలో పరిగెత్తాడు. అతడి టీషర్ట్‌ ముందుభాగంపై ‘సేవ్‌ ఉక్రెయిన్‌’ అని కూడా రాసి ఉంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది అతడిని వెంబడించి మైదానం వెలుపలికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో అసలు ఏం జరిగిందోనని ఆటగాళ్లు కాసేపు కంగారు పడ్డారు.

‘ఈ ప్రపంచకప్‌ చుట్టూ ఏం జరుగుతుందో మాకు తెలుసు..ఇలాంటి ఘటనలు మామూలే. ఆ నిరసనకారుడి ఉద్దేశాన్ని మేం అర్థం చేసుకున్నాం. మనమందరం ఇరాన్‌, ఇరాన్‌ మహిళలకు మద్దతుగా ఉన్నాం. ఇలాంటివి మరోసారి జరగవని ఆశిస్తున్నాం’ అని పోర్చుగల్‌ ఆటగాడు రూబెన్‌ అన్నాడు. మైదానంలో నిరసన చేపట్టిన వ్యక్తిని ఇటలీకి చెందిన మారియో ఫెర్రీగా గుర్తించారు. గత ప్రపంచకప్‌ టోర్నీల్లో కూడా అతడు ఇలాగే నిరసన ప్రదర్శనలు చేపట్టినట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.

స్వలింగ సంపర్కం ఖతార్‌లో చట్ట విరుద్ధం. వారి హక్కుల కోసం ఇలా రెయిన్‌బో జెండాతో ఈ ప్రపంచకప్‌లో నిరసనలు చేపట్టడం నిర్వహకులకు తలనొప్పిగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని