WPL 2024: ఈ కప్‌ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన

మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL) ఫైనల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. 

Updated : 18 Mar 2024 12:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో 16 సీజన్లలో పురుషుల జట్టుకు సాధ్యం కాని కలను రెండో సీజన్‌లోనే రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మహిళా జట్టు నెరవేర్చింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) ఫైనల్‌లో దిల్లీని చిత్తు చేసి సగర్వంగా కప్‌ను అందుకొంది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన స్పందిస్తూ.. ఈ విజయం జట్టుకు అత్యంత నమ్మకమైన అభిమానుల కోసమేనని వ్యాఖ్యానించింది. 

‘‘మేం విజయం సాధించామనే వాస్తవాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాం. కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఛాంపియన్‌గా నిలవడంపై ఎలా స్పందించాలో తెలియడం లేదు. కానీ, ఒక మాట చెబుతా. మా ఆటపై గర్వంగా ఉంది. ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాం. గతాన్ని మరిచి ఇప్పుడు విజేతగా నిలిచాం. ఇదొక అద్భుతమైన అనుభూతి. మాకు లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ క్వార్టర్ ఫైనల్‌ లాంటిది. దానిని అధిగమించాం. తర్వాత సెమీస్‌, ఫైనల్‌లోనూ విజేతగా నిలిచాం. ఇలాంటి పెద్ద టోర్నీల్లో సరైన సమయంలో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. గతేడాది నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకున్నాం. మేనేజ్‌మెంట్ మామీద నమ్మకం ఉంచింది. జట్టుగా మేం ఆర్సీబీ తరఫున టైటిల్‌ సాధించాం. తప్పకుండా టాప్‌ -5 అద్భుత విజయాల్లో ఇదొకటి. వరల్డ్‌ కప్‌ ఎప్పటికీ టాప్‌. ఆర్సీబీ అభిమానుల నుంచి చాలా మెసేజ్‌లు వచ్చాయి. ‘ఈ సాలా కప్‌ నమదే’ ప్రతిసారి వినిపించే నినాదం. ఇప్పుడు దానిని నిజం చేసి నిరూపించాం’’ అని స్మృతి మంధాన వెల్లడించింది. 

వీడియో కాల్‌లో విరాట్

తొలిసారి ఛాంపియన్‌ కావడంపై ఆర్సీబీపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ స్మృతి మంధానతో విరాట్ కోహ్లీ వీడియో కాల్‌లో మాట్లాడాడు. అందరికీ శుభాకాంక్షలు చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అతడు తన ఇన్‌స్టా స్టోరీస్‌లోనూ ‘సూపర్ వుమెన్‌’ అంటూ జట్టు ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.

జట్టు మాజీ యజమాని విజయ్‌ మాల్యా కూడా ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ‘‘ఆర్సీబీ మహిళా జట్టుకు అభినందనలు. డబ్ల్యూపీఎల్‌ విజేతగా నిలవడం అద్భుతం. పురుషుల జట్టు కూడా ఐపీఎల్‌ గెలిస్తే డబుల్‌ బొనాంజా అవుతుంది. గుడ్‌ లక్‌’’ అని ట్వీట్ చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని