IPL Final: ఆ టెన్షన్‌తో మెలకువగా ఉండటానికి చాలాసార్లు టీ తాగా: సీఎస్కే స్టార్ ప్లేయర్

ఐపీఎల్-16 సీజన్‌ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ ఆలస్యంగా మొదలుకావడంతో మెలకువగా ఉండటానికి చాలాసార్లు టీ తాగినట్లు సీఎస్కే ఓపెనర్ డేవాన్‌ కాన్వే (Devon Conway) వెల్లడించాడు.

Published : 14 Jun 2023 17:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఐపీఎల్-16 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆఖరి రెండు బంతులకు వరుసగా సిక్స్‌, ఫోర్ బాది సీఎస్కేకు మరుపురాని విజయాన్ని అందించాడు.  వర్షం అంతరాయం కలిగించడంతో చాలా ఆలస్యంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే (Devon Conway) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 15 ఓవర్లకు కుదించిన ఈ పోరులో కాన్వే 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 47 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికర విషయాన్ని డేవాన్ కాన్వే ఓ క్రీడా వార్త సంస్థతో పంచుకున్నాడు. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ ఆలస్యంగా మొదలుకావడంతో మెలకువగా ఉండటానికి చాలాసార్లు టీ తాగినట్లు కాన్వే వెల్లడించాడు.

‘‘ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఎమోషనల్ రోలర్ కోస్టర్. మా ఇన్నింగ్స్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం మొదలైంది. అప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరుకున్న మేం మ్యాచ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా.. అని ఎదురుచూశాం. మాకు ఛేజింగ్‌లో ఎన్ని ఓవర్లు వస్తాయో తెలియక ఆ అర్ధరాత్రి మెలకువగా ఉండేందుకు నేను చాలాసార్లు టీ తాగా. ఇది కొంచెం కలవరపెట్టింది. బ్యాటింగ్‌కి వెళ్లే ముందు మైక్ హస్సీ (బ్యాటింగ్ కోచ్) నాతో.. ‘మేట్ మెలకువగా ఉండటానికి రెడ్‌బుల్ డబ్బా కావాలా?’అని అడిగాడు. మ్యాచ్‌కు ఇలాంటి అంతరాయం కలిగినప్పుడు మానసికంగా సిద్ధంగా ఉండటం చాలా కష్టం. దీంతో మళ్లీ హుషారుగా మారడానికి రెడ్‌బుల్ తాగా. ఇది నేను మొదటి బంతి నుంచి అలర్ట్‌గా ఉండేలా చేసింది. ఆ విధంగా మ్యాచ్‌ను పూర్తి చేయడం చాలా బాగుంది. ఎందుకంటే మేము అలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో 10 రన్స్‌ చేసి మ్యాచ్‌ను గెలిపించడం మరింత ఉత్సాహన్ని కలిగించింది. ఆటగాళ్లంతా తెల్లవారుజాము వరకూ సంబరాలు చేసుకున్నారు’’అని కాన్వే పేర్కొన్నాడు. 

ఇదిలా ఉండగా.. కెప్టెన్‌ ధోనీకి సంబంధించిన ఓ వీడియోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తాజాగా పోస్టు చేసింది. ఐపీఎల్-16 సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌, కీపింగ్, ఫీల్డ్ సెట్టింగ్, టాస్‌, డీఆర్‌ఎస్‌ కోరిన సమయాల్లో తీసిన ఫొటోలను ధోనీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తున్న వీడియోతో కలిపి పోస్టు చేస్తూ.. ‘ఓ కెప్టెన్, నా కెప్టెన్!’ అనే క్యాప్షన్‌ను జోడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని