Hyderabad vs Gujarat: వరుణుడు ఆడుకున్నాడు

ఐపీఎల్‌-17వ సీజన్‌లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్‌ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను తర్వాతి దశకు చేర్చేశాడు.

Updated : 17 May 2024 07:11 IST

గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ వర్షార్పరణం
ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్‌
ఈనాడు - హైదరాబాద్‌

పీఎల్‌-17వ సీజన్‌లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్‌ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను తర్వాతి దశకు చేర్చేశాడు. గురువారం వర్షం కారణంగా గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది. 15 పాయింట్లతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో జట్టుకు మాత్రమే గరిష్ఠంగా 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో సన్‌రైజర్స్‌ మూడో జట్టుగా ముందంజ వేసింది. గత మూడు సీజన్లలో తీవ్రంగా నిరాశపర్చిన సన్‌రైజర్స్‌.. 2020 తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ రద్దవడం ఇదే తొలిసారి. ఉప్పల్‌లో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మొదలైన వర్షం సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. ఆ తర్వాత ఓ రెండు గంటలు తెరిపినివ్వడంతో మ్యాచ్‌ కోసం మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది కృషి చేశారు. ముఖ్యంగా ఔట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే టాస్‌ ఆలస్యమైంది. 8 గంటలకు టాస్‌ వేసేందుకు అంతా సిద్ధమవుతోందని అనుకునేలోపే వరుణుడు మళ్లీ వచ్చాడు. ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ సారి వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో చివరికి 10:10 గంటలకు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌ టికెట్ల ధరను తిరిగి చెల్లిస్తామని ఫ్రాంఛైజీ ప్రకటించింది. మధ్యలో డీజే పాటలు, లైట్ల వెలుగుల్లో స్టేడియం హోరెత్తింది.

ఆ మూడు మ్యాచ్‌లు: లీగ్‌ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దిల్లీ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించింది. శుక్రవారం ముంబయితో మ్యాచ్‌లో లఖ్‌నవూ విజయం సాధించినా.. చెన్నై, బెంగళూరు రన్‌రేట్‌ను అధిగమించే అవకాశం లేనందున ఆ మ్యాచ్‌ నామమాత్రమే. కానీ మిగతా మూడు మ్యాచ్‌లు కీలకమైనవి. శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో ప్లేఆఫ్స్‌ చేరే చివరిదైన నాలుగో జట్టేదో తేలిపోతుంది. ఇక ఆదివారం సన్‌రైజర్స్‌తో పంజాబ్‌, రాజస్థాన్‌తో కోల్‌కతా మ్యాచ్‌లతో వరుసగా టాప్‌-4 స్థానాలు ఖరారు కానున్నాయి. మరే జట్టు కూడా 18 పాయింట్ల కంటే ఎక్కువ సాధించే అవకాశం లేకపోవడంతో 19 పాయింట్లతో ఉన్న కోల్‌కతా అగ్రస్థానం పదిలమైంది. కోల్‌కతాపై రాజస్థాన్‌ గెలిస్తే    18 పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్‌ ఓడి.. పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ గెలిస్తే అప్పుడు హైదరాబాద్‌ 17 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో నేరుగా ఫైనల్లో చోటు కోసం తొలి క్వాలిఫయర్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంటుంది. సన్‌రైజర్స్‌ ఓడి.. ఆర్సీబీపై చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో సీఎస్కే పట్టికలో పైకి వెళ్తుంది. అప్పుడు సన్‌రైజర్స్‌ నాలుగో స్థానంతో ముగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు