Messi vs Ronaldo: మెస్సి vs రొనాల్డో.. ఇద్దరిలో ఎవరు గొప్ప?

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో చాలా ఏళ్ల పాటు ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగిపోయిన మెస్సీ, రొనాల్డోలు.. కెరీర్ చరమాంకంలోకి వచ్చేసరికి భిన్నమైన ఆటను ప్రదర్శిస్తున్నారు. తాజాగా బాలెన్‌ డోర్‌ పురస్కారం నేపథ్యంలో వీరిలో ఎవరు గొప్ప అనే దానిపై చర్చ మొదలైంది.

Published : 04 Nov 2023 10:17 IST

బాలెన్ డోర్ పురస్కారం నేపథ్యంలో మరోసారి చర్చ

గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఫుట్‌బాల్‌ (Football)లో ఆట పరంగా చూసినా.. ఆకర్షణ పరంగా చూసినా లియొనల్ మెస్సి (Lionel Messi), క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)లకు సాటి వచ్చే ఆటగాళ్లు ఇంకెవరూ కనిపించరు. నెయ్‌మార్ జూనియర్, కిలియన్ ఎంబాపె.. ఇలా ఎంతోమంది యువ ప్రతిభావంతులు ప్రపంచ ఫుట్‌బాల్ యవనిక పైకి దూసుకొచ్చినా.. వీరి స్థాయిని అందుకోలేకపోయారు. వయసు పెరిగినా వన్నె తగ్గని ఆట, ఆకర్షణ వారిది. వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప?అనే చర్చ ఇప్పటిది కాదు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోనే కాక క్లబ్ ఫుట్‌బాల్‌లో ఎవరికి వారే అన్నట్లు సాగిపోతుండేది ఈ జంట. చాలా ఏళ్ల పాటు ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగిపోయిన ఈ ఇద్దరూ.. కెరీర్ చరమాంకంలోకి వచ్చేసరికి భిన్నమైన ఆటను ప్రదర్శిస్తున్నారు. మెస్సి తిరుగులేని ఆధిపత్యంతో ‘మోడర్న్ ఆల్ టైం గ్రేట్’ కిరీటాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

బాలెన్ డోర్.. ప్రతి సంవత్సరం ప్రపంచ ఉత్యుత్తమ ఫుట్‌బాలర్ ఎవరో తేల్చే పురస్కారం. ఈ అవార్డును అందుకోవడాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు ఫుట్‌బాలర్లు. అంతర్జాతీయ ప్రదర్శనతో పాటు క్లబ్ ఫుట్‌బాల్‌‌లో ఆటను కూడా దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పురస్కారాన్ని రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి అందుకుని చరిత్ర సృష్టించాడు మెస్సి. చరిత్రలో మరే ఆటగాడూ ఇన్నిసార్లు ఈ పురస్కారాన్ని అందుకోలేదు. 2017లో అతను, రొనాల్డో అయిదేసి అవార్డులతో సమానంగా ఉండేవారు. అప్పుడు వారి ప్రదర్శన నువ్వా నేనా అన్నట్లుండేది. అవార్డులే కాక వివిధ అంశాల్లో ఎవరికి వారే సాటి అన్నట్లుండేవాళ్లు. కానీ గత ఐదేళ్లలో పరిస్థితి మారిపోయింది.

మెస్సి.. రొనాల్డో కన్నా మూడు బాలెన్ డోర్ పురస్కారాలు ఎక్కువ గెలుచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. రొనాల్డో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు విషయంలో మెస్సిని అధిగమించే అవకాశమే కనిపించడం లేదు. ఈసారి ఈ అవార్డు విషయంలో రొనాల్డో ఎంతగా వెనుకబడ్డాడంటే.. అతను కనీసం టాప్-10లో కూడా నిలవలేకపోయాడు. అంతకంటే ముందు షార్ట్ లిస్ట్ చేసిన 30 మందిలో కూడా రొనాల్డో లేడు. అంటే బాలెన్‌డోర్‌ పురస్కారం దరిదాపుల్లో కూడా లేడు. ఈ ఏడాది క్లబ్ ‌ఫుట్‌బాల్‌లో మెస్సి 17 గోల్స్ సాధిస్తే.. రొనాల్డో 11కు పరిమితం అయ్యాడు. ఎర్లింగ్ హాలండ్ 52 గోల్స్‌తో రొనాల్డోకు పోటీ ఇచ్చినా.. అంతర్జాతీయ ప్రదర్శనను కూడా దృష్టిలో ఉంచుకుని మెస్సిని విజేతగా ప్రకటించారు.

మెస్సి అది కూడా సాధించి..

ఈ మధ్య రొనాల్డో జోరు తగ్గింది కానీ.. క్లబ్‌ ఫుట్‌బాల్‌లో అతడిది తిరుగులేని ప్రదర్శన. దానికి కొన్నేళ్ల ముందు వరకు మెస్సి, రొనాల్డోల్లో ఎవరికి వాళ్లే సాటి. ఆట పరంగా రొనాల్డో ఆకర్షణే వేరు అన్నట్లుండేది. కానీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మెస్సి పైచేయి సాధిస్తూ వచ్చాడు. అతడి సొంత దేశం అర్జెంటీనా ఎప్పట్నుంచో ప్రపంచ ఫుబ్‌బాల్ మేటి జట్లలో ఒకటి. కానీ రొనాల్డో సొంత జట్టు పోర్చుగల్‌కు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అంత స్థాయి లేదు. ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రమే. దాన్ని ఎవరూ ఫేవరెట్‌గా పరిగణించరు. నాకౌట్ చేరడమూ కష్టమే.

అర్జెంటీనా మాత్రం ప్రతిసారీ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతుంది. ప్రపంచకప్ గెలవడానికి అర్జెంటీనా తరఫున చాలా ఏళ్ల నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్న మెస్సి.. నిరుడు ఆ కలను నెరవేర్చుకున్నాడు. అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. మెస్సి కీర్తి కిరీటంలో కలికితురాయిలా మారిన ప్రపంచకప్.. రొనాల్డోకు అతడికి మధ్య అంతరాన్ని మరింత పెంచింది. దీనికి తోడు క్లబ్ ఫుట్‌బాల్‌లోనూ కొన్నేళ్లుగా మెస్సి ఆధిపత్యం సాగుతోంది. ఇటు ప్రపంచకప్, అటు అత్యధికంగా ఎనిమిది బాలెన్ డోర్ పురస్కారాలు దక్కించుకోవడంతో అతను రొనాల్డోను దాటి ఆల్ టైం గ్రేట్ అయిపోయాడు.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని