IPL 2024 Auction: ఐపీఎల్‌ వేలంలో అతడు అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలుస్తాడు.. కానీ: ఆకాశ్ చోప్రా

డిసెంబరు 19 జరిగే ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్‌ పేసర్ మిచెల్‌ స్టార్క్‌ భారీ ధర దక్కించుకుంటాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు.

Published : 12 Dec 2023 20:28 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2024 (IPL 2024) సీజన్‌ కోసం డిసెంబరు 19న దుబాయ్‌ వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. అన్ని ఫ్రాంఛైజీల్లో కలిపి 77 ఖాళీలు ఉండగా.. మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. ఆసీస్‌ ఆటగాళ్లు కమిన్స్‌, ట్రావిస్‌ హెడ్‌, జోష్ ఇంగ్లిస్‌, మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc)లు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఈ వేలంలో మిచెల్‌ స్టార్క్‌ భారీ ధర దక్కించుకుని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. స్టార్క్‌ ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. అతడు 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించి 34 వికెట్లు పడగొట్టాడు. తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టిపెట్టడం కోసం ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. 

‘‘ఐపీఎల్‌ వేలంలో మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకుంటాడు. ఇటీవల ఆస్ట్రేలియా తరఫున ఆడిన దాదాపు అందరూ ఐపీఎల్‌ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ, వారందరిలో మిచెల్ స్టార్క్ ఎక్కువ ఆకర్షిస్తున్నాడు. అతడు కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. ఆరంభంలో వికెట్లు పడగొట్టడంతోపాటు యార్కర్లు వేస్తాడు. మంచి డెత్ బౌలర్ కూడా. ఐపీఎల్‌లో స్టార్క్‌కు మంచి గణాంకాలు కూడా ఉన్నాయి. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) తరపున బాగా ఆడాడు. కానీ, ఆ తర్వాత అతడు లీగ్‌లో ఆడటానికి ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం. 

ఒక జట్టు అతడిని కొనుగోలు చేసిన తర్వాత యాషెస్ సిరీస్‌ లేదా ఏదైనా వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో ఐపీఎల్‌కు దూరమైతే సదరు జట్టు ఇబ్బందుల్లో పడుతుంది. అతడు వెళ్లిపోతే ఆ ఫ్రాంఛైజీకి డబ్బు వస్తుంది.  కానీ, కీలక ఆటగాళ్లు జట్టులో ఉండరు. ఈ వేలంలో స్టార్క్‌తో పాటు గెరాల్డ్ కొయెట్జీ, జోష్ హేజిల్‌వుడ్, దిల్షాన్ మధుశంక, బెన్ డ్వార్షిస్‌ ఇతర కీలక బౌలర్లు ఉన్నారు. కానీ, స్టార్క్‌ని కొనుగోలు చేసిన తర్వాత అతడు లీగ్‌ నుంచి వైదొలిగితే మళ్లీ కీలక బౌలర్లను తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏది ఏమైనా ఈ వేలంలో స్టార్క్‌ భారీ ధర పలికితే నేను ఆశ్చర్యపోను. కానీ, లీగ్ మొత్తానికి అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనే చిన్న అనుమానం ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా వివరించాడు. 


ఐసీసీ అండర్‌-19 ప్రపంచ కప్‌, ముక్కోణపు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన  

అండర్‌-19 లెవల్‌లో భారత్‌, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 29 నుంచి ముక్కోణపు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ 2024, జనవరి 10న జరగనుంది. అనంతరం భారత జట్టు అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం  జూనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. 

భారత జట్టు: 

ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్‌ కెప్టెన్‌), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్, రుద్ర మయూర్‌ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అన్వేష్‌ రావు, మురుగున్‌ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్‌ తివారీ.

ముక్కోణపు సిరీస్‌కు ముగ్గురిని (ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్ గోసాయి, ఎండీ అమన్‌) ట్రావెలింగ్‌ స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసిన సెలక్టర్లు దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, విఘ్నేష్‌, కిరణ్ చోర్మలేను బ్యాకప్‌ ప్లేయర్లుగా తీసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని